లోక్‌సభలో ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గురువారం సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ బిర్లా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. పలు క్రీడల్లో పతకాలు సొంతం చేసుకున్న భారత మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకొని నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండగానే 10 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను సభ్యులు అడిగారు. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇందులో పాలుపంచుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సభ ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
ప్రతిపక్షాలు లెక్కచేయకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత అధిర్ రంజన్ దీనిపై మళ్లీ మాట్లాడారు. దళిత బాలిక వ్యవహారంపై కాంగ్రెస్ వాదనను కేంద్ర సహాయ మంత్రి మేఘవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. ఇన్‌కం యాక్ట్ ఆఫ్ 1961, ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2012కు సవరణ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
ఎగువ సభలో రెండు బిల్లులకు ఆమోదం
తమ డిమాండ్లపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెగసస్, కొత్త సాగు చట్టాలపై సభలో చర్చించాలని పేర్కొన్నారు. వారి ఆందోళనలు, నినాదాల కారణంగా సభను సభాపతి పలుమార్లు వాయిదా వేశారు. ఒకవైపు విపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‘ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్‌జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను గురువారం లోక్‌సభలో ఆమోదించారు.
ఈ బిల్లుపై పర్యావరణ మంత్రి భూపేందర్ రాజ్యసభలో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాయు కాలుష్యానికి కారణమైన వారికి సెక్షన్ 14 కింద జరిమానా విధిస్తారని, పంటల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, సభలో మాత్రం శబ్ద కాలుష్యం ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment