
సభాసమయం వృథాపై వెంకయ్య ఆవేదన
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్‌తో సమావేశమయ్యారు.
అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్‌లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు.
రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన
బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది.
నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment