న్యూఢిల్లీ: నవంబరు 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను బిల్లు, భూసేకరణ బిల్లుతో పాటు 9 కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వర్షాకాల సమావేశాల చేదు అనుభవాలను మర్చిపోయి ముందుకు పోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు. దాద్రి హత్యోదంతంపై పత్రిపక్షాల వ్యూహాలు తమకు తెలుసుని ఆయన అన్నారు.
మరోవైపు నవంబరు 26 నుంచి డిసెంబరు 23 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను 'అసహనం' అంశం కుదిపేయనుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, పలు వివాదాస్పద అంశాలు అధికార పార్టీలో అశాంతిని రేపిన మాట వాస్తవం. ముఖ్యంగా దేశంలో చెలరేగిన మతఘర్షణలు, బీఫ్ బ్యాన్, దాద్రి ఘటన, అవార్డు వాపసీ లాంటి పలు అంశాలపై యుద్ధానికి ప్రతిపక్షాలు తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి.
అలాగే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రాజేశాయి. బీజేపీ ఎంపీలు, నాయకులు, మరి కొందరు సీనియర్ నటులు ఆయనపై విరుచుకుపడ్డారు. దేశం విడిచి పొమ్మని ఒకరంటే, నీకు అంత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన దేశానికే కళంకితం ఆపాదిస్తావా అంటూ మరొకరు ధ్వజమెత్తారు. చివరికి శివసేన అధికార పత్రిక సామ్నా లో అమీర్ పై విమర్శలు గుప్పించింది.
అటు ప్రతిపక్షాలు కోరిన అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. సభ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా సామరస్య పూర్వక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సహా, ప్రతిపక్షాలన్నీ అస్త్రశస్త్రాలతో రడీగా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న అసహనం తనకు బాధ కలిగించిందని, అందుకే పార్లమెంటులో దీనిపై చర్చను కోరుతున్నామని మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు.
అటు కీలక బిల్లుల్ని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో బలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం బలహీనంగా ఉంది. జీఎస్‌టీ బిల్లు, భూ సేకరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలోనే ఉన్నాయి. వీటిని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాగా లలిత్ మోదీ వివాదం కేంద్రంగా.. గత సమావేశాలు కృష్ణార్పణం అయిపోయాయి. ఇక 21 రోజుల పాటు సాగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.