
వాడివేడిగా సాగనున్న అసెంబ్లీ!
* ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు
* విద్యుత్, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీపై నిలదీయాలని యోచన
* గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ దీటుగా తిప్పికొట్టేందుకు సర్కారు కసరత్తు
* బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావే శాలు వాడివేడిగా జరుగనున్నాయి. ప్రభుత్వం, విపక్షాల వాద, ప్రతివాదాలకు వేదిక కానున్నాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి, అసెంబ్లీలో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా... ప్రతిపక్షాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి పాలక పార్టీ కసరత్తు చేస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాలక, ప్రతిపక్షాల తీరు, అనుసరించబోయే వ్యూహాలను బట్టి ఈ నెలాఖరుదాకా సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణ తొలి సర్కారు వైఫల్యాలపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీ అధ్యయనం చేస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ఉన్నాయి.
రైతాంగ సమస్యలే ప్రధానంగా..
రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు, రుణ మాఫీలో జాప్యం వంటి అంశాలు ప్రధానంగా పాలక పక్షానికి ఇబ్బందిగా పరిణమించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఉండదని, రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీఇవ్వగా... రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగడం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలను ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకోనున్నాయి. అయితే ఈ అంశంలో కాంగ్రెస్, టీడీపీల హయాంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్యతో పోలుస్తూ తిప్పికొట్టాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉంది.
ఇక పంట రుణాల మాఫీ అంశంలోనూ రైతుల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకోనున్నాయి. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ కొరత విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. విద్యుత్ కొరత ఉంటుందని ఎన్నికలకు ముందే చెప్పామంటూ ప్రభుత్వం తప్పించుకోజూస్తోందని ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. దీనిపై కొత్త విద్యుత్ కేంద్రాలు, సౌర విద్యుత్, విద్యుత్ కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటివాటితో ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టే వ్యూహంతో ప్రభుత్వం ఉంది.
రేషన్, పింఛన్ల గందరగోళం కూడా..
రేషన్‌కార్డుల సంఖ్యలో కోత, కొత్తగా అందించబోయే ఆహార భద్రత కార్డుల మార్గదర్శకాల్లో లోపాలు, సమగ్ర సర్వే, వివిధ పెన్షన్ల మంజూరుకు మెలికలు, భూ కేటాయింపులు (మై హోమ్ వివాదం), తెలంగాణ అమరవీరుల సంఖ్య కుదింపు, కొన్ని కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పాలనలో అస్తవ్యస్తత, వివిధ అంశాల్లో నిలకడ లేని ప్రభుత్వ నిర్ణయాలు వంటివాటిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు గళం విప్పనున్నాయి. ఇదే సమయంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీల తప్పిదాలను ఎత్తిచూపుతూ ఎదురుదాడి చేయడానికి పాలక పక్షం సిద్ధమవుతోంది.