Telangana state assembly meetings
-
నేడు అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ బులెటిన్ విడుదల చేశారు. కాగా.. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి 3వ తేదీ (ఆదివారం) నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. హరితహారంపై సీఎం సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక అధికారులు భూపాల్‌రెడ్డి, శాంతికుమారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు. -
అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపు
డిజైన్‌పై అన్నిపక్షాలతో స్పీకర్ చర్చలు 160-165 కుర్చీలకే పరిమితం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో సీట్ల సంఖ్యను కుదించనున్నారు. భవిష్యత్‌లో పెరగబోయే స్థానాలను దృష్టిలో పెట్టుకుని 160-165 వరకు వీటిని కుదించాలని నిర్ణయించారు. దీనిపై బుధవారం స్పీకర్ మధుసూదనాచారి అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో చర్చించారు. అంతకుముందు ఇదే అంశంపై జి,చిన్నారెడ్డి (కాంగ్రెస్), అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చర్చించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో 300 సీట్లు ఉన్నాయి. రాష్ర్టం విడిపోయాక ఏపీ శాసనసభ సమావేశాల నిర్వహణకు మరో హాలును కేటాయించగా, తెలంగాణ శాసనసభ సమావేశాలను పాత హాలులోనే నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణ శాసనసభలో సభ్యుల సంఖ్య 120 మాత్రమే (ఆంగ్లో ఇండియన్ సభ్యునితో కలిపి). దీంతో తెలంగాణ శాసనసభ్యులు మొత్తం హాజరైనా హాలులోని సగం సీట్లు కూడా నిండడం లేదు. స్పీకర్ స్థానం నుంచి చూసినా, గ్యాలరీ నుంచి చూసినా హాలులో సీట్లన్నీ ఖాళీగా, బోసిగా కన్పిస్తున్నాయి. ఈ కారణంగా హాలులో సీట్ల సంఖ్యను సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కుదించాలని స్పీకర్ నిర్ణయించారు. ప్రస్తుతానికి శాసనసభలో 120, మండలిలో 40 స్థానాలుండడం వల్ల ఉభయసభల సమావేశానికి కూడా కుదించిన సీట్లు ఈ నాలుగేళ్లపాటు సరిపోతాయని స్పీకర్ భావిస్తున్నారు. కొత్త సంఖ్యకు అనుగుణంగా డిజైన్లను రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌శర్మను స్పీకర్ ఆదేశించారు. వీలైనంత త్వరగా డిజైన్లు తయారు చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త సీట్ల ఏర్పాటును పూర్తిచేయాలని సూచించారు. సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో సీట్లను ఇంకా సౌకర్యవంతంగా రూపొందించాలని ఆదేశించారు. -
వాడివేడిగా సాగనున్న అసెంబ్లీ!
-
వాడివేడిగా సాగనున్న అసెంబ్లీ!
* ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు * విద్యుత్, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీపై నిలదీయాలని యోచన * గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ దీటుగా తిప్పికొట్టేందుకు సర్కారు కసరత్తు * బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావే శాలు వాడివేడిగా జరుగనున్నాయి. ప్రభుత్వం, విపక్షాల వాద, ప్రతివాదాలకు వేదిక కానున్నాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి, అసెంబ్లీలో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా... ప్రతిపక్షాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి పాలక పార్టీ కసరత్తు చేస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాలక, ప్రతిపక్షాల తీరు, అనుసరించబోయే వ్యూహాలను బట్టి ఈ నెలాఖరుదాకా సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణ తొలి సర్కారు వైఫల్యాలపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీ అధ్యయనం చేస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ఉన్నాయి. రైతాంగ సమస్యలే ప్రధానంగా.. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు, రుణ మాఫీలో జాప్యం వంటి అంశాలు ప్రధానంగా పాలక పక్షానికి ఇబ్బందిగా పరిణమించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఉండదని, రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీఇవ్వగా... రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగడం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలను ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకోనున్నాయి. అయితే ఈ అంశంలో కాంగ్రెస్, టీడీపీల హయాంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్యతో పోలుస్తూ తిప్పికొట్టాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉంది. ఇక పంట రుణాల మాఫీ అంశంలోనూ రైతుల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకోనున్నాయి. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ కొరత విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. విద్యుత్ కొరత ఉంటుందని ఎన్నికలకు ముందే చెప్పామంటూ ప్రభుత్వం తప్పించుకోజూస్తోందని ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. దీనిపై కొత్త విద్యుత్ కేంద్రాలు, సౌర విద్యుత్, విద్యుత్ కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటివాటితో ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టే వ్యూహంతో ప్రభుత్వం ఉంది. రేషన్, పింఛన్ల గందరగోళం కూడా.. రేషన్‌కార్డుల సంఖ్యలో కోత, కొత్తగా అందించబోయే ఆహార భద్రత కార్డుల మార్గదర్శకాల్లో లోపాలు, సమగ్ర సర్వే, వివిధ పెన్షన్ల మంజూరుకు మెలికలు, భూ కేటాయింపులు (మై హోమ్ వివాదం), తెలంగాణ అమరవీరుల సంఖ్య కుదింపు, కొన్ని కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పాలనలో అస్తవ్యస్తత, వివిధ అంశాల్లో నిలకడ లేని ప్రభుత్వ నిర్ణయాలు వంటివాటిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు గళం విప్పనున్నాయి. ఇదే సమయంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీల తప్పిదాలను ఎత్తిచూపుతూ ఎదురుదాడి చేయడానికి పాలక పక్షం సిద్ధమవుతోంది.