
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ బులెటిన్ విడుదల చేశారు. కాగా.. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి 3వ తేదీ (ఆదివారం) నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
హరితహారంపై సీఎం సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక అధికారులు భూపాల్‌రెడ్డి, శాంతికుమారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment