ఆ... మాటే మంత్రం!! | YS Jagan Cabinet decision to implement guarantees | Sakshi
Sakshi News home page

ఆ... మాటే మంత్రం!!

Published Tue, Jun 11 2019 3:35 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

YS Jagan Cabinet decision to implement guarantees - Sakshi

సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, అంగన్‌వాడీ వర్కర్లు, డ్వాక్రా యానిమేటర్లు, పారిశుధ్య కార్మికులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు. తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ఎన్నికల హామీలు, వాటి అమలుపై సోమవారం మంత్రిమండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య రంగాల్లో సాహసోపేత సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తద్వారా తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వ మని ప్రజలకు గట్టి సందేశం ఇచ్చారు. సోమవారం ఉదయం 10–30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సుదీర్ఘంగా కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కలిసి విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

రైతులందరికీ వడ్డీలేని రుణాలు
రైతన్నల సంక్షేమానికి ఉద్దేశించిన రైతు భరోసా పథకాన్ని అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రైతుకు 12,500 పెట్టుబడి సాయం అందిస్తారు. దీనివల్ల 56 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఆర్థిక సాయాన్ని వాణిజ్య బ్యాంకులు రైతులకు చెల్లించకుండా బకాయిలకు జమ చేసుకునే పక్షంలో ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా అందజేస్తారు. దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ, పురపాలక శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆరు లేదా ఏడుగురు రైతు సంఘాలకు చెందినవారు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌ వ్యవసాయంలో పురోగతి, రైతుల సంక్షేమం, ధరల స్థిరీకరణను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా రైతుల తరఫున వంద శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. క్లెయిమ్‌ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.

రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడాన్ని జూలై 8న వైఎస్సార్‌ పుట్టినరోజు నాడు ప్రారంభిస్తారు. రైతులు చెల్లించాల్సిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికోసం బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ప్రభుత్వం వడ్డీ చెల్లించిన రసీదును గ్రామ వాలంటీర్లు ద్వారా రైతులకు చేరవేస్తారు. చంద్రబాబు సర్కారు 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిన రూ.2,000 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా రైతులకు చెల్లించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు నష్టపోకుండా రూ.2 వేల కోట్లతో సహాయ నిధి, రూ.3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. బోర్లు మీద బోర్లు వేసి నీళ్లు పడక నష్టపోతున్న రైతుల కోసం అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున బోర్లు వేసే 200 రిగ్గులను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. బోర్ల కోసం నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంగా ఉచితంగా బోర్లు వేస్తారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రాని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ అందించనున్నారు. ఎప్పటి నుంచి ఉచిత విద్యుత్‌ అందిస్తారో నిర్ణయం తీసుకోవాలని ఇంధన శాఖను సీఎం ఆదేశించారు.

రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీకి నిర్ణయం
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా మంత్రి శంకర్‌ నారాయణ రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ విషయం ప్రస్తావించగానే, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే రైతులకు వేరుశనగ విత్తనాలు ఆ రెండు జిల్లాల్లో మొదలుపెట్టాలని ఆదేశించడంతోపాటు 24 నుంచి 48 గంటల లోపు పని ప్రారంభించినట్టు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సహకార రంగ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా వెంటనే చర్యలు చేపట్టనున్నారు. సహకార చక్కెర పరిశ్రమలతోపాటు సహకార పాల పరిశ్రమలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. సహకార చట్టాల రక్షణకు తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఒక్కో రైతుకు 5 పశువుల వరకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకూ బీమా సౌకర్యం కల్పించనున్నారు. గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో ఇలాంటి బీమా పథకం ఎలా అమలవుతోందో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. 

పిల్లలను స్కూళ్లకు పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు
అమ్మఒడి పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకం కింద తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లి తమ పిల్లలను స్కూళ్లకు పంపితే గ్రామ వాలంటీర్ల ద్వారా రూ.15 వేలు అందిస్తారు. తద్వారా బాలకార్మిక వ్యవస్థను నిరోధించవచ్చునని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఇళ్లులేని అర్హులైన నిరుపేద మహిళలను గుర్తించి, వారందరికీ తొలి ఏడాదిలోనే ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి ఉగాది పండుగ రోజున వారి పేరిటే ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఆ స్థలాలపై బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇళ్లులేని వారందరికీ రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లను వైఎస్సార్‌ పేరు మీద నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా పట్టణాల్లో ప్లాట్లను నిర్మించి పేదలకు వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వీటికి నిధులెక్కడవని మీడియా ప్రశ్నించగా మంత్రి నాని స్పందిస్తూ ‘రౌతు కొద్దీ గుర్రం.. నాయకుడి కొద్దీ పరిపాలన’ అన్నట్లుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలే వీటి అన్నింటికీ పరిష్కారమని అన్నారు. గత పదేళ్లుగా ఈ అంశాలన్నింటిపైన ఆయన ఆలోచన, కసరత్తు చేస్తూనే ఉన్నారని తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చిననాటి నుంచే వీటి అమలుపై దృష్టి పెట్టారని, ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో ప్రకటించామని, తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనన్నారు.

పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు
అన్ని శాఖల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.18 వేలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, అనుభవం ఆధారంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. దీన్ని అమలు చేయడానికి ఆర్థిక, విద్యుత్, వైద్య, పంచాయతీరాజ్, విద్య, పురపాలక మంత్రులతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల్లో పనిచేస్తున్న యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌లకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అంగన్‌ వాడీ వర్కర్లకు రూ.10,500 నుంచి రూ.11,500, అంగన్‌వాడీ ఆయాలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు, ఆశ వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, గిరిజన తండాల్లో పనిచేసే వర్కర్లకు రూ.400 నుంచి రూ.4 వేలకు వేతనాలను పెంచుతూ వారిపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 

ఐఆర్‌తో 4.24 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) మంజూరు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 4.24 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఐఆర్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.815 కోట్లు అదనపు భారం పడనుంది. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీన్ని ఎలా అమలు చేయాలనే దానిపై ఆర్థిక, రవాణా శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి  రెండు నెలల్లో నివేదిక కోరనున్నారు. ఆర్టీసీ ప్రస్తుతం రూ.6,400 కోట్ల అప్పుల్లో ఉంది. చంద్రబాబు సర్కారు రూ.2900 కోట్ల ఉద్యోగుల పీఎఫ్‌ను కూడా వేరే వాటికి వాడేసింది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆర్టీసీ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం డీజిల్‌ బస్సుల కారణంగా ఆర్టీసీలో కిలోమీటర్‌ రవాణాకు ఖర్చు రూ.38 అవుతోంది.

వాటి స్థానంలో ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కిలోమీటర్‌ రవాణాకు ఖర్చు రూ.19కు తగ్గించవచ్చనేది సీఎం ఆలోచనగా ఉందని మంత్రులు తెలిపారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ క్రమంలో సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తకుండా అమలు కార్యాచరణ కోసం ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఆర్థిక శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడం కోసం రూ.1150 కోట్లు హైకోర్టుకు జమ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనివల్ల అగ్రిగోల్డ్‌లో రూ.20 వేలు డిపాజిట్‌ చేసిన 9 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తులన్నింటినీ పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆస్తులను విక్రయించడం ద్వారా ఎక్కువ నిధులు రాబట్టి బాధితులందరికీ న్యాయం చేయనున్నారు. 

ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు చేరవేసేలా..
అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు పనిచేయనున్నాయి. వీటిలో ఉద్యోగాల నియామకం పూర్తి పారదర్శకంగా జిల్లా ఎంపిక కమిటీల ద్వారా చేయాలని నిర్ణయించారు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందేలా గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు. ఆగస్టు 15 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమవుతుంది. పట్టణ వాలంటీర్లకు నియామకానికి డిగ్రీ, గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్మీడియెట్, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి అర్హతగా నిర్ధారించారు. రేషన్‌ ద్వారా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యంలో నాణ్యత లేనందున రాష్ట్ర ప్రభుత్వమే నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి బియ్యంతోపాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి గడపకు బియ్యం ఐదు కేజీలు, పది కేజీలు, 15 కేజీల బ్యాగ్‌ల ద్వారా అందించనున్నారు. గతంలో జరిగిన అక్రమాలకు చెక్‌ పెట్టనున్నారు.

విద్యా రంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం
రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో అన్ని వసతులను కల్పించాక ఫొటోలు తీసి ప్రజలకు చూపించనున్నారు. 40 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేసి పౌష్టికాహారాన్ని స్కూళ్లకు సరఫరా చేయనున్నారు. వంట మనుషులకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు విద్యా హక్కు చట్టంలోని అంశాలను పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు విద్యాహక్కు చట్టం మేరకు ప్రతి స్కూలులో మొత్తం అడ్మిషన్లలో 25 శాతం అడ్మిషన్లను పేదలకు ఉచితంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఫీజుల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ఫీజుల రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేసి విద్య వ్యాపారం కాకుండా నిరోధించనున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల పటిష్టానికి నిర్ణయం
ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయడంతోపాటు మెరుగైన వైద్యసేవలందించేందుకు ఎమ్మెల్యేల అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ది కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 108, 104 వాహనాలను ఆధునికీకరించి, కొత్త వాహనాను కొనుగోలు చేయనున్నారు. డీజిల్‌ కొరత లేకుండా కండీషన్‌లో వాహనాలను ఉంచాలని, బాధితులు ఫోన్‌ చేసిన 20 నిముషాల్లో చేరేలాగ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 108, 104 సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, వారు సంతృప్తిగా ఉంటేనే మెరుగైన సేవలు అందుతాయని సీఎం వైద్యశాఖాధికారులకు సూచించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీని వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న వ్యాధులతోపాటు మరిన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తారు. 

12 నుంచి రాజన్న బడిబాట 
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే మొదటిరోజు ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ  సంబరాలు నిర్వహిస్తారు. టీచర్లు, విద్యార్ధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో ప్రాంగణాన్ని శుభ్రంచేసి మామిడి తోరణాలతో స్కూళ్లను అలంకరిస్తారు. పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేసి రాజన్న బడిబాటను ప్రారంభించాలి. కొత్తగా చేరే విద్యార్థులను సాదరంగా ఆహ్వానించి ఇతర విద్యార్థులకు పరిచయం చేయాలి. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారి ఫొటోలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు కల్పించే సౌకర్యాలను తెలియచేసే పోస్టర్లను, బ్యానర్లను ఏర్పాటుచేయాలి. వేసవి సెలవుల్లో పిల్లలు ఏవిధంగా గడిపారో ఆ అంశాలపై మాట్లాడించాలి. గత ఏడాది అనుభవాలను వారితో చెప్పించాలి. ఈ ఏడాది ప్రణాళికలను వివరించాలి. రెండో రోజు మొక్కలు నాటించడం, వాటిని దత్తతకు ఇవ్వడం, కథలు చెప్పించి గేయాలు, పాటలు పాడించే కార్యక్రమాలు నిర్వహించాలి. మూడో రోజు ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యకమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేయించాలి. నాలుగో రోజు ప్రముఖులతో స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు, బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు, తల్లిదండ్రులతో సమావేశాలు, ప్రతిభావంతులకు సత్కారం, సహపంక్తి భోజనాలు నిర్వహించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement