సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసే క్లాప్ మిత్రలకు (పారిశుధ్య కార్మికులు) వేతన బకాయిలన్నింటినీ వేగంగా చెల్లించే ప్రక్రియ ఇటీవలే మొదలైందని.. అయినా “ఈనాడు’ పత్రిక ఉద్దేశపూర్వకంగా ఓ తప్పుడు భావనతో మంగళవారం “పారిశుధ్య కార్మికులకూ జగన్ దెబ్బ’ అంటూ దుష్ప్రచారం చేస్తూ కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది.
నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43,534 మంది క్లాప్‌మిత్రలకు 2022 అక్టోబరు నుంచి జూన్ 2023 మధ్య కాలానికి చెల్లించాల్సిన వేతన బకాయిలకు గాను రూ.84.03 కోట్లు ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మరో రూ.141 కోట్ల చెల్లింపు ప్రక్రియ పురోగతిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ “ఫ్యాక్ట్ చెక్’ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ చెల్లింపులకు గాను 2,055 గ్రామ పంచాయతీల్లో వెండర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇక మీదట గ్రామ పంచాయతీల నిధుల నుంచి ఎప్పటికప్పుడు క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపులు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు..
మరోవైపు.. క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేసినట్లు కూడా ఆ శాఖ వివరించింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తూ.. గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం పోగవకుండా పూర్తి పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని 2021 అక్టోబరు 2న ప్రారంభించిందని.. ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ ఉ.6గంటల నుంచి క్లాప్‌మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కొనసాగుతోందని తెలిపింది.
ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 43,534 మంది పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో.. గ్రామ పంచాయతీలకు 32,777 చెత్త తరలించే రిక్షాలు, 1,004 టిప్పర్లను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చినట్లు పంచాయతీరాజ్‌శాఖ వివరించింది. అలాగే, ప్రతినెలా క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు కోసమే ప్రభుత్వం రూ.27 కోట్లు ఖర్చుచేస్తోందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment