దీనావస్థలో పారిశుద్ధ్య కార్మికులు
మురుగు ఎత్తినా మమత చూపని పాలకులు
ఏళ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ కాని కొలువు
వైద్యమందదు.. జీతం సరిపోదు
హోరువానలోనా, ఎముకలు కొరికే చలిలోనైనా తెల్లవారుజామునే రోడ్డెక్కుతారు. రోడ్లన్నీ మెరిసేలా ఊడ్చేస్తారు. మురుగు ఎత్తి శుభ్రంగా ఉన్న రోడ్లను చూసి మురిసిపోతారు. కానీ మనమధ్యే ఉంటూ మనకి ఇంతా సేవ చేస్తున్న ఈ మట్టిమనుషులకు మాత్రం అన్నీ కష్టాలే..
మెదక్: చెత్తపై కొత్త సమరం పేరిట చేపట్టిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమం ఉద్యమంలా విస్తరిస్తోంది. దేశ ప్రధాని మోడి పిలుపుతో క్రికెటర్లు, సినీమా స్టార్లు...కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చేస్తూ...దేశ ప్రజలకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు.
సీన్ కట్‌చేస్తే....
బురద బుక్కుతూ...బురద కక్కుతూ...మురికిలో మునిగి తేలుతూ...ఒళ్లంతా మట్టిని చేసుకొని...బతుకంతా వెట్టిలో గడుపుతున్న గ్రామీణ పారిశుధ్ధ్య కార్మికుల బతుకులు దీనంగా మారుతున్నాయి. ఇచ్చిందే పైకంగా...వచ్చిందే జీతంగా కనీస సౌకర్యాలకు దూరమై దుర్బర జీవితాలు గడుపుతున్నారు. గ్రామాల్లోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకున్నా...మురికి కాల్వల్లో రోతను ఎత్తిపోసినా...వారి శ్రమను గుర్తించే వారు గానీ, అయ్యోపాపం అనేవారు గానీ లేకుండా పోయారు.
మసక చీకట్లో...చీపుళ్లు చేతుల్లో...
జనమంతా..మగత నిద్రలో ఉంటే...పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తొలి కోడి కూయకముందే మేల్కొంటారు. చిమ్మ చీకట్లో..చీపుళ్లు చేతబట్టి..తట్టా..పార నెత్తినబెట్టుకొని...వీధుల్లోకి అడుగులు వేస్తారు. ఎముకలు కొరికే చలిలో...జోరు వానలో సైతం విధులకు నిర్వర్తిస్తారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు వారంతా మురుగుపూసుకుంటారు.
మెదక్ జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలు ఉండగా, 620 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. ప్రతిరోజు గ్రామంలోని వీధులు...మురికి కాల్వలు శుభ్ర పర్చడం వీరి విధి. ఈ క్రమంలో తెల్లవారక ముందే చలికి వణుకుతూ...వర్షానికి తడుస్తూ..ఎండకు ఎండుతూ తమ విధులను నిర్వర్తిస్తుంటారు. మురికి కాల్వల్లోని మురుగును సైతం ఓర్పుతో తొలగిస్తారు. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కాకులు లాంటి ఏ జీవి చనిపోయినా..వీధుల్లో అవి కుళ్లిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నా ముక్కు మూసుకొని తొలగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘స్వచ్ఛ భారత్’’కు అచ్చమైన మూలాలు వీరే.
బతుకు భారం..సౌకర్యాలు మృగ్యం
గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ 516, 10-12-2013 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు సరిపడ సబ్బులు, కొబ్బరి నూనెను గ్రామ పంచాయతీలు ఇవ్వాలి. దుమ్ము, ధూళి నుంచి రక్షణకోసం ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు అందజేయాలి. కనీసం ఏడాది రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించాలి. రెండు జతలు దుస్తులు, రెండు జతల చెప్పులు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు.
రెక్కలు ముక్కలు చేసుకునే ఈ కష్ట జీవులకు నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా పంచాయతీ నిధులను బట్టి రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు. కొత్త సర్పంచ్‌లు రాగానే అవసరమైతే తమకు ఇష్టంలేని కార్మికులను తొలగిస్తూ...కొత్తవారిని చేర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాలుష్య వాతావరణంలో విధులు నిర్వర్తిస్తూ....అనారోగ్యానికి గురై మృత్యువాత పడ్డ కార్మికులు ఎందరో ఉన్నారు.
పాఠశాలల్లోని పార్ట్‌టైం స్వీపర్లది అదే గతి
జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో పార్ట్ స్వీపర్లు..కాన్టిన్‌జెంట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 270 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పాఠశాలను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ...ఒళ్లంతా దుమ్ము చేసుకుంటున్నారు. 30 ఏళ్ల నుండి సేవలందిస్తున్నా..వారి ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు. నెలకు వచ్చే జీతం కేవలం రూ.1,623లు మాత్రమే. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ పేస్కేల్ ఇవ్వాలని కనిపించిన వారినల్లా వేడుకుంటున్నా...వారి వేదన అరణ్య రోదనగానే మారుతోంది.
ఒళ్లంతామట్టి.. బతుకంతా వెట్టి
Published Fri, Dec 12 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement