దేవుళ్లు దయ్యాలయ్యారా? | oposition parties fire on kcr govt | Sakshi
Sakshi News home page

దేవుళ్లు దయ్యాలయ్యారా?

Published Sun, Jul 12 2015 1:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

దేవుళ్లు దయ్యాలయ్యారా? - Sakshi

దేవుళ్లు దయ్యాలయ్యారా?

మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో సీఎంపై విపక్ష నేతల ఫైర్
 
హైదరాబాద్: ‘‘పారిశుద్ధ్య కార్మికులు నిజమైన దేవుళ్లని ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో మీరే అన్నారు. ఇప్పుడు న్యాయమైన కోరికలు తీర్చాలని అడిగితే ఆ దేవుళ్లు దయ్యాలయ్యారా?..’’ అని సీఎం కేసీఆర్‌పై విపక్షాల నేతలు మండిపడ్డారు. కార్మిక దేవుళ్లు రోడ్డున పడి ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదేమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుళ్లకు వందల కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో కొంత డబ్బు కేటాయించినా కార్మికుల బతుకులు బాగుపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘మహా ధర్నా’లో వివిధ పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ మొన్న యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహ స్వామికి రూ.200 కోట్లు ఇచ్చారు. పండుగలూ బ్రహ్మండంగా చేస్తున్నారు.

లక్ష్మీ నరసింహ స్వామి ఏమైనా సమ్మె చేశారా?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓ అలవాటు ఉందని. ఆయనకు దండం పెడితే కోరికలు తీరవని, దండం తీస్తేనే తీరుతాయని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం గడ్డిపోచ కింద లెక్కగడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆ గడ్డిపోచలు కలిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉరితాడు తయారవుతుందని మరిచిపోవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారంపై పట్టింపులకు పోవద్దని కేసీఆర్‌కు సూచించారు. మన రాష్ట్రం, మన ప్రభుత్వం వచ్చిందనుకుంటే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ‘చెత్తశుద్ధి’ ఉంటే స్వచ్ఛ హైదరాబాద్ అంటూ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పుడు రోడ్లపైకి పంపాలని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. ఈ మహాధర్నాలో టీడీపీ నేత కృష్ణయాదవ్, బీజేపీ నేత కృష్ణమూర్తి, అన్వేష్ (సీపీఐఎంఎల్), జానకీరాములు (ఆర్‌ఎస్‌పీ), వెంకట్‌రెడ్డి(ఆప్), కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), ఏసురత్నం (ఏఐటీయూసీ), కృష్ణ (ఐఎఫ్‌టీయూ), సుధీర్(ఏఐటీయూసీ), రామారావు మాట్లాడారు.

 రేపటి నుంచి దీక్షలు..
 తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చామని, సోమవారం నుంచి జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చెప్పా రు. మంగళవారం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనలు చేపడతామని.. అవసరమైతే ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలకూ దిగుతామని ప్రకటించారు. కా గా కార్మికుల సమ్మెతో గ్రేటర్ హైదరాబాద్ పరి ధిలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. పర్యాటక, చారిత్రక ప్రాంతాలు కూడా అధ్వానంగా మారాయి. శనివారం విధులకు హాజరై న కొందరు తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ సిబ్బం దిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.
 
రివర్స్ గేర్‌లో చర్చలు
సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామంటున్న ప్రభుత్వం, వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామంటున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు... ఇలా ఎవరికివారే పట్టుదలతో ఉండడంతో ఎన్నిసార్లు చర్చించినా ఫలితం తేలడం లేదు. వేతనాలు పెంచేందుకు సిద్ధమేనని ప్రభుత్వం, సమ్మె విరమణకు సిద్ధమని కార్మిక నేతలూ సెలవిస్తున్నా... ఎవరు ముందు చేయాలన్నదానిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం కార్మిక నేతలతో నాలుగు పర్యాయాలు జరిపిన చర్చలు విఫలం కావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. తాజాగా శనివారం కూడా కార్మిక నేతలతో మంత్రి నాయిని దాదాపు మూడున్నర గంటల పాటు జరిపిన చర్చలూ విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతుందని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మె విరమిస్తే జీతాలు పెంచుతామని మంత్రి చెప్పారని, జీతాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని తాము తేల్చి చెప్పామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement