పరిష్కార వేదికగా...
సమస్యల నుంచి ప్రజలకు విముక్తి
ఇళ్లు, నాలాలు,కలుషిత జలాలపైనే వినతులు
రూ. 200 కోట్లు మంజూరు
రూ. 600 కోట్ల పనులకు విజ్ఞప్తులు
ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’
సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం కేవలం పారిశుద్ధ్య కార్యక్రమాలకే పరిమితం కాకుండా... ప్రజా సమస్యలు గుర్తించేందుకు ఉపయోగపడింది. గవర్నర్ నుంచి ఐఏఎస్‌లు, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా భాగస్వాములైన ఈ కార్యక్రమంలో ప్రజల ‘నాడి’ని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వారిని స్వచ్ఛ టీమ్ సభ్యులుగా ఎంపిక చేసి.. ప్రజల అవసరాలను, డిమాండ్లను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆక్రమణల పాలైన నాలాల వల్ల తలెత్తుతున్నముంపు, కలుషిత నీటి సమస్యలను ప్రజలు గట్టిగా వినిపించారు. ఇళ్లు, పింఛన్లు, వైద్యం, రేషన్ కార్డులను ఎక్కువగా కోరారు. ఈ కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా పనులు చేపట్టడానికి రూ.200 కోట్లు సిద్ధంగా ఉంచినప్పటికీ... అదనపు నిధులు అవసరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పనులను స్వల్ప, దీర్ఘకాలికమైనవిగా విభజించి పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములైన ప్యాట్రన్లు/మెంటర్లతో శుక్రవారం సమీక్షించనున్నారు. అప్పటికి దీనిపైస్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పారిశుద్ధ్య కార్మికులకు వరాలు
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు, వారి సమస్యలపై సీఎం శ్రద్ధ కనబరిచారు. వారి వేతనాలు పెంచడంతో పాటు జీహెచ్‌ఎంసీలోని 20 వేల మంది కార్మికులకు దశల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు వివిధ ప్రాంతాల్లోని 2 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇదే సందర్భంలో ఓయూ భూముల్లో ఇళ్లు కట్టిస్తామనడం వివాదానికి దారి తీసింది. తాగునీటి పైపుల్లో డ్రైనేజీ నీరు కలుస్తున్న సమస్యను పరిష్కరించేందుకు రూ.3వేల కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. నాలాలను మెరుగుపర చడానికి ప్రస్తుతం రూ.400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సమస్య లేదని సీఎం తెలిపారు. పాతబస్తీకి తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు రెండు డబ్బాల విధానాన్ని ప్రారంభించడంతో పాటు, వాటిని ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించేందుకు 2500 ఆటోట్రాలీలతో పేదలకు ఉపాధి కల్పిస్తామన్నారు.
తద్వారా చెత్త తరలింపు, నిరుద్యోగులకు ఉపాధి అనే రెండు ప్రయోజనాలు నెరవేరనున్నాయి. నగరం నుంచి రోజుకు సగటున 3600 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తుండగా, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రోజుకు సగటున 8 వేల టన్నుల చెత్త, డెబ్రిస్‌ను అదనంగా సేకరించగలిగారు. మొత్తం 32వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త, డెబ్రిస్‌ను తరలించారు. అందిన వినతులు.. వాటి పరిష్కార చర్యలపై ఈనెల 26న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగనుంది.
కొనసాగుతుంది...
పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్, కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.