
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మూడు, నాలుగు వేల రూపాయల వేతనాలకే పనిచేసే పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. తొలుత మూడు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు చేశారు. యంత్రాలతో కాల్వల్లో మురుగు తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మూడు ట్రైనింగ్ సెంటర్లలో యంత్రాలను అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 వేల మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీలు వీరిని కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకున్నాయి. వీరిలో దాదాపు 20 వేల మంది మేజర్, మీడియం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మేజర్, మీడియం గ్రామ పంచాయతీల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం తథ్యం.
తొలగించక తప్పదు
గ్రామాల్లో పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత కార్మికులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలంటే పంచాయతీలకు నిధుల కొరత తప్పదు. నిబంధనల ప్రకారం.. గ్రామ పంచాయతీకి చెందిన మొత్తం నిధుల్లో కేవలం 15 శాతం మాత్రమే పారిశుధ్య పనులకు ఖర్చుపెట్టాలి. కాంట్రాక్టర్లకు డబ్బులను గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అరకొర నిధులతో కార్మికులందరికీ జీతాలు చెల్లించడం గ్రామ పంచాయతీలకు అసాధ్యమేనని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించడం మినహా మరో మార్గం ఉండదని చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో సరిపడా నిధులు లేవన్న కారణంతో ఇప్పటికే పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు.
అధికార పార్టీ వారికే కాంట్రాక్టులు
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పంచాయతీల్లో కీలకమైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. 105 మేజర్ పంచాయతీల్లో రోడ్లు శుభ్రం చేశాక పోగయ్యే చెత్తను ఊరి బయటకు తరలించేందుకు కాంట్రాక్టు విధానంలో ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి, ట్రాక్టర్లు అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఎస్సీలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. యంత్రాల ద్వారా కాల్వల్లో మురుగు తొలగింపు కాంట్రాక్టులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికే దక్కే పరిస్థితి కనిపిస్తోంది.