కమిలిపోయిన వీపు భాగాన్ని చూపిస్తున్న ఓబ్లాయిపల్లి కృష్ణయ్య
మహబూబ్‌నగర్ రూరల్: అవగాహన లేమితో గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యాల బారినపడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం గ్రామాల్లో పలు రకాల క్రిమిసంహారక మందులను పిచికారి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు అధికారుల సూచన మేరకు హైడ్రోక్లోరైడ్‌ను పిచికారీ చేస్తున్నారు. ఈ మందును పిచికారి చేసే సమయంలో బొక్కలోనిపల్లి, జమిస్తాపూర్, జైనళ్లీపూర్, ఓబ్లాయిపల్లి గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కాళ్లు, చేతులు, వీపు భాగంలో శరీరం కమిలిపోయింది.
కరోనా కష్టాల నుంచి ప్రజలను గట్టేక్కించేందుకు రేయింబవల్లు శ్రమిస్తున్నారు. వీరి కష్టాలను చూసి వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలతచెందుతున్నారు. ఇన్నాళ్లు ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయంగా పనిచేస్తూ వచ్చిన కార్మికులు మందుల పిచికారితో అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంపై ఎంపీఓ వెంకట్రాములును వివరణ కోరగా కార్మికులు అనారోగ్యం బారినపడకుండా తమవంతు ప్రయత్నం చేస్తున్నామని, వారి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యంపాలు కావడంతో గ్రామాల్లో పరిశుభ్రత చర్యల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు యుద్ధప్రాతిపదికన కార్మికుల రోగ నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment