మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, పక్కన ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చరించారు. జాతర ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలసి శనివారం ఏడుపాయల్లోని హరిత హోటల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి రాని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై మండిపడ్డారు. వీఐపీ పార్కింగ్ విషయంలో కూడా ఈఓ సార శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఈ జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర అని, సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్నారు. ఈనెల 26లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర కోసం సింగూరు నుంచి రెండు విడతలుగా 0.45 టీఎంసీ నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేస్తామన్నారు. అవసరమైనన్ని మరుగుదొడ్లు, తాగు నీటి కులాయిలు నిర్మించాలన్నారు.
650 మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని డీపీఓ తరుణ్‌కు సూచించారు. 140 బస్సులతోపాటు, పార్కింగ్ నుంచి జాతర వరకు 3 బస్సులు నిరంతరంగా తిరిగేలా ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. 1200 మంది పోలీసుల సేవలు అందిస్తున్నామని డీఎస్సీ సైదులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐదు ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కోవిడ్ వ్యాక్సిన్‌లు కూడా ఇస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
మొత్తం మీద ఏడుపాయల జాతర కీర్తి ఎల్లలు దాటేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, వెంకట్ ఉపేందర్, డీఎస్పీ సైదులు, ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, ఈఓ సార శ్రీనివాస్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment