Edupayala jathara
-
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. జాతర ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలసి శనివారం ఏడుపాయల్లోని హరిత హోటల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి రాని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై మండిపడ్డారు. వీఐపీ పార్కింగ్ విషయంలో కూడా ఈఓ సార శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఈ జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర అని, సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్నారు. ఈనెల 26లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర కోసం సింగూరు నుంచి రెండు విడతలుగా 0.45 టీఎంసీ నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేస్తామన్నారు. అవసరమైనన్ని మరుగుదొడ్లు, తాగు నీటి కులాయిలు నిర్మించాలన్నారు. 650 మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని డీపీఓ తరుణ్‌కు సూచించారు. 140 బస్సులతోపాటు, పార్కింగ్ నుంచి జాతర వరకు 3 బస్సులు నిరంతరంగా తిరిగేలా ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. 1200 మంది పోలీసుల సేవలు అందిస్తున్నామని డీఎస్సీ సైదులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐదు ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కోవిడ్ వ్యాక్సిన్లు కూడా ఇస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. మొత్తం మీద ఏడుపాయల జాతర కీర్తి ఎల్లలు దాటేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, వెంకట్ ఉపేందర్, డీఎస్పీ సైదులు, ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, ఈఓ సార శ్రీనివాస్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..!
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘దుర్గ’ పేరు పెట్టుకొని దుర్గమ్మ తల్లిని కొలుస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఏడుపాయలకు వచ్చిన ఓ యువతి మంగళవారం రాత్రి స్నానానికి వెళ్లి నీటి మునిగి బుధవారం శవమై తేలింది. తండ్రిలేని ఆ ఆడ బిడ్డ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది. హైదరాబాద్‌లోని మొహిదిపట్నానికి చెందిన ముక్కర్ల బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భర్త కొంతకాలం కిందట మరణించడంతో పెద్ద కూతురు దుర్గ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది. ఆమెకు ఏడుపాయల దుర్గమ్మంటే ఎనలేని భక్తి.. ప్రతియేడు ఏడుపాయల జాతరకు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఏడుపాయలకు వచ్చి టేకుల బొడ్డె ప్రాంతంలోని మంజీరా పాయలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగింది. గమనించిన బోయిని పాపయ్య అనే గజ ఈతగాడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి 12గంటల వరకు మంజీరా నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దుర్గ శవం లభ్యమైంది. రూ.500 అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంట్లో చిల్లిగవ్వలేక పక్కింటి వాళ్ల దగ్గర రూ.500ల అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తల్లీ.. నేను ఎవరి కోసం బతకాలి బిడ్డా...! అంటూ మృతురాలి తల్లి బాలమణి రోధించిన తీరు జాతరకు వచ్చిన భక్తులను కంటతడి పెట్టించింది. తమ బిడ్డ గల్లంతైందన్న విషయం తెలుసుకొని ఏడుపాయలకు వచ్చిన బాలమణికి తెల్లవారి శవం చూసేసరికి తెలియదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లికి నోచుకోకుండానే కానరాని లోకాలకు వెళ్లడంతో బాలమణి కన్నీరు మున్నీరైంది. పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మది నిండా భక్తి భావం
♦ అట్టహాసంగా జనజాతర ప్రారంభం ♦ జనారణ్యంగా మారిన మంజీర తీరం ♦ ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు ♦ హెలికాప్టర్లో తరలివచ్చిన మంత్రులు పాపన్నపేట: మంజీర తీరం.. జనసంద్రమైంది... ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు.. మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరను డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఉదయం 8.45గంటలకే హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈఓ కార్యాలయం నుంచి ఊరేగింపుగా ఆలయం వరకు పట్టు వస్త్రాలను తీసుకెళ్లి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఏడుపాయల్లో స్నానాలుచేసి దుర్గమ్మతల్లిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివదీక్షలు చేపట్టారు. శివసత్తులు సిగాలూగుతూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఏడుపాయల్లో గల శివాలయంలో శివపూజలు చేసి ఉపవాస దీక్షలను విడిచి పెట్టారు. తెల్లవార్లు జాగరణ చేశారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆకట్టుకున్న జాతర: ఏడుపాయల దుర్గమ్మ ఆలయ ప్రాంగణాన్ని, రాజగోపురాన్ని రంగు రంగుల డిజిటల్ బల్బులతో అందంగా అలంకరించారు. రాత్రివేళ అమావాస్య చీకట్లో రంగు రంగుల కాంతులతో దుర్గమ్మతల్లి ఆలయం వింతశోభ సంతరించుకుంది. పిల్లల ఆనందం కోసం ఏర్పాటుచేసిన రంగుల రాట్నం, గ్లోబల్ బైక్ రేసింగ్, బ్రేక్ డాన్సింగ్ తదితర ఆట వస్తువులు ఆందరిని ఆకట్టుకున్నాయి. జాతరను పురస్కరించుకొని ఏడుపాయల్లో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖల అధికారులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అటవీశాఖ వివిధ రకాల మొక్కలను ప్రదర్శనకు ఉం చారు. మంజీరా నది పొడవున ఏర్పాటు చేసిన షవర్‌బాత్‌ల కింద స్నానాలు చేసి భక్తులు పులకరించిపోయారు. భారీ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జాతర నిర్వహక ప్రతినిధి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్, డివిజన్ పంచాయతి, ఇరిగేషన్, వైద్యశాఖ, ఫైర్‌స్టేషన్, ఎక్సైజ్‌శాఖ, సమాచారశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. కాగా భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. -
జజ్జనకరి జనాలే..
పాపన్నపేట, న్యూస్‌లైన్: శివసత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. బోనాలతో నృత్యాలు.. దుర్గమ్మనామస్మరణలతో రెండో రోజైన శుక్రవారం ఏడుపాయల జాతర హోరెత్తింది. రవికలు, చీరలు, కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, గాలి గుమ్మటాలు, మెరుపు కాగితాలతో అలంకరించిన ఎడ్లబండ్లు గణగణ గంటలతో పరుగులు తీస్తుండగా..శకట భ్రమణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాగా అకాల వర్షం భక్తజనులను ఆగమాగం చేసింది. అడపా దడపా కురిసిన చిరు జల్లులతో భక్తులు చెల్లా చెదురయ్యారు. బండ్లు తిరిగే సమయానికి ఒకేచోటుకు చేరుకొని ఉత్సవాన్ని తిలకించారు. కాగా ఉదయం 5గంటలకు పాలక వర్గ చైర్మన్ పబ్బతి ప్రభాకర్‌రెడ్డి పూజలుచేసి దుర్గమ్మ దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి సునీతారెడ్డి ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రే భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. తెల్లవారుజామునుంచే మంజీర నదిలో స్నానాలుచేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకుని ఉపవాస దీక్షలు విరమించారు. గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. దుర్గా భవానికి జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఏడుపాయల్లోని కొండా కోనాలు ప్రతిధ్వనించాయి. మెదక్ డీఎస్పీ గోద్రూ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతరావు, పాలక వర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బోనంతో ఆకట్టుకున్న నృత్యాలు నెత్తిపై బోనం పెట్టుకుని.. చేతిలో చెర్న కోళాలు పట్టుకొని డప్పుచప్పుళ్లకనుగుణంగా శివసత్తులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జానపదులు తమ బండ్లను అందంగా అలంకరించారు. వాటిపై వేపకొమ్మలు చేతపట్టుకున్న శివసత్తులు సిగాలు ఊగుతుండగా ఎడ్లు పరుగులు తీశాయి. మొదట ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి పాలక వర్గ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు స్వాగతం పలికారు. బండి ముందు డప్పుచప్పుళ్లకనుగుణంగా వందలాది యువకులు నృత్యం చేశారు. చెట్టు, గుట్ట భక్తులతో నిండిపోయి ఈ అపురూప దృశ్యాన్ని తిలకించారు. నేడు రథోత్సవం ఏడుపాయల జాతరలో మూడో రోజైన శనివారం అర్ధరాత్రి రథోత్సవం జరుగుతుంది. రంగు రంగుల మెరుపు కాగితాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాన్ని భక్తులు తాళ్లతో లాగుతారు. ఆదివారం తెల్లవారు జాము వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.