అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..! | Petrol Bunk Women Staff Unexpectedly Drowned In Edupayala Jathara | Sakshi
Sakshi News home page

అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..!

Published Thu, Mar 7 2019 10:58 AM | Last Updated on Thu, Mar 7 2019 10:58 AM

Petrol Bunk Women Staff Unexpectedly Drowned In Edupayala Jathara - Sakshi

మంజీరా నదిలో గాలింపు చర్యలు పరిశీలిస్తున్న జేసీ నగేశ్, ఇతర అధికారులు , అంతర్ చిత్రంలో దుర్గ(ఫైల్‌)

సాక్షి, పాపన్నపేట(మెదక్‌): ‘దుర్గ’ పేరు పెట్టుకొని దుర్గమ్మ తల్లిని కొలుస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఏడుపాయలకు వచ్చిన ఓ యువతి మంగళవారం రాత్రి స్నానానికి వెళ్లి నీటి మునిగి బుధవారం శవమై తేలింది. తండ్రిలేని ఆ ఆడ బిడ్డ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది. హైదరాబాద్‌లోని మొహిదిపట్నానికి చెందిన ముక్కర్ల బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భర్త కొంతకాలం కిందట మరణించడంతో పెద్ద కూతురు దుర్గ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది.

ఆమెకు ఏడుపాయల దుర్గమ్మంటే ఎనలేని భక్తి.. ప్రతియేడు ఏడుపాయల జాతరకు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఏడుపాయలకు వచ్చి టేకుల బొడ్డె ప్రాంతంలోని మంజీరా పాయలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగింది. గమనించిన బోయిని పాపయ్య అనే గజ ఈతగాడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న  కలెక్టర్‌ ధర్మారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నగేష్,  పాలకవర్గ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి 12గంటల వరకు మంజీరా నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.  అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దుర్గ శవం లభ్యమైంది. 

రూ.500 అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా!
ఇంట్లో చిల్లిగవ్వలేక పక్కింటి వాళ్ల దగ్గర రూ.500ల అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తల్లీ.. నేను ఎవరి కోసం బతకాలి బిడ్డా...! అంటూ మృతురాలి తల్లి బాలమణి రోధించిన తీరు జాతరకు వచ్చిన భక్తులను కంటతడి పెట్టించింది. తమ బిడ్డ గల్లంతైందన్న విషయం తెలుసుకొని ఏడుపాయలకు వచ్చిన బాలమణికి తెల్లవారి శవం చూసేసరికి తెలియదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లికి నోచుకోకుండానే కానరాని లోకాలకు  వెళ్లడంతో బాలమణి కన్నీరు మున్నీరైంది.  పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement