![Boy Drowns Tragedy In Barrage At Karimnagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/21/water.jpg.webp?itok=Xdu4foAB)
సాక్షి, మంథని(కరీంనగర్): తొలి పండుగ వేళ సరదా కోసం బంధువులతో కలిసి బ్యారేజీ సందర్శనకు వచ్చిన ఓ బాలుడు నదిలో మునిగి విగతజీవిగా మారడం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ దిగువ నీటిలో మునిగి హైదరాబాద్‌లోని లాల్‌గూడ మల్కాజ్‌గిరికి చెందిన నెరిమెట్ల సాయిష్(16) మృతి చెందాడు. మంథని ట్రైనీ ఎస్సై అజయ్ కథనం ప్రకారం గోదావరిఖనిలోని తన బంధువు ఇంట్లో శుభకార్యం ఉండడంతో సాయిష్ ఈనెల16న వచ్చాడు.
ఏకాదశి సందర్భంగా తన బంధువులతోపాటు మరి 10మంది కలిసి మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద కాసేపు కాలక్షేపం చేశారు. అయితే సాయిష్ బ్యారేజీ గేట్ల వైపు ఉన్న నీటిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు అందులోనే మునిగాడు. కాపాడేందుకు ప్రయత్నించగా నీటి గుంత కావడంతో ఫలితం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోపాటు కలివిడిగా ఉన్న సాయిష్ విగత జీవిగా మారడంతో వెంట వచ్చిన వారి రోదనలు మిన్నంటాయి.
మృతుడి తండ్రి అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్యారేజీ దిగువన గుంతలున్న సమాచారం లేకపోవడంతో గతంలో కూడా పలువురు మృతి చెందారు. అటు వైపుగా వెళ్లకుండా భద్రతా సిబ్బంది నియంత్రించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment