papannapeta
-
బోరుబావిలో పడిన బాలుడి మృతి
సాక్షి, మెదక్: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సంజయ్ సాయివర్థన్ ఉదంతం విషాదాంతమైంది. సుమారు 11 గంటల పాటు అధికారులు నిర్విరామంగా కొనసాగించిన సహాయక చర్యలు ఆ పసివాడిని బతికించలేకపోయాయి. మృత్యుంజయుడై తిరిగివస్తాడనుకున్న సంజయ్.. కన్నవారికి తీరని శోకాన్ని మిగిలిస్తూ, కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో అప్పుడే వేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు సంజయ్ సాయివర్దన్ జారి పడిన విషయం తెలిసిందే. సాయంత్రం 5.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. అధికారులు ఆరు గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరు గుంతకు సమాంతరంగా తవ్వకం చేపట్టారు. కొంత లోతుకు వెళ్లే సరికి బండరాళ్లు వచ్చాయి. వీటిని డ్రిల్లింగ్ చేసి తొలగించారు. చివరకు గురువారం తెల్లవారుజామున 4.32 గంటలకు 17 అడుగుల లోతులో ఉన్న బాలుడిని వెలికితీశారు. వెంటనే ఆక్సిజన్ అందిస్తూ 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, సంజయ్ అంత్యక్రియలు తండ్రి స్వస్థలమైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలో గురువారం సాయంత్రం అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆక్సిజన్ అందకపోవడంతోనే మృత్యువాత! సంజయ్ బోరుగుంతలో పడిన సమయంలో బాలుడి తాత అతడిని రక్షించేందుకు ధోవతి, చీర జత చేసి లోపలికి పంపించారు. అయితే వదులు మట్టి కావడంతో పెల్లలు బాలుడి మీద పడి కూరుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆక్సిజన్ పైపు బాబు వద్దకు చేరలేదని.. దీంతో శ్వాస అందక చిన్నారి మృతి చెందాడని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా స్థాయిలో సరైన సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులో లేకపోవడం కూడా పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది. -
బాలుడిని మింగిన బోరుబావి
-
బాలిక కడుపులో వెంట్రుకల ఉండ
సాక్షి, మెదక్‌జోన్: ఓ బాలిక కడుపులో నుంచి సుమారు కిలో వెంట్రుకల ఉండను శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాపాన్నపేట మండలానికి చెందిన బాలిక (15) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. ఇటీవల మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేసి బాలిక కడుపులో నుంచి వెంట్రుకల ఉండను బయటికి తీశారు. బాలిక మానసిక ఒత్తిడికి గురై వెంట్రుకలను తినగా అవి కడుపులో ఉండలా తయారయ్యాయని వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, ఇలాంటి కేసు జిల్లాలో రావడం ఇదే మొదటిసారని చెప్పారు. -
అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..!
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘దుర్గ’ పేరు పెట్టుకొని దుర్గమ్మ తల్లిని కొలుస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఏడుపాయలకు వచ్చిన ఓ యువతి మంగళవారం రాత్రి స్నానానికి వెళ్లి నీటి మునిగి బుధవారం శవమై తేలింది. తండ్రిలేని ఆ ఆడ బిడ్డ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది. హైదరాబాద్‌లోని మొహిదిపట్నానికి చెందిన ముక్కర్ల బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భర్త కొంతకాలం కిందట మరణించడంతో పెద్ద కూతురు దుర్గ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది. ఆమెకు ఏడుపాయల దుర్గమ్మంటే ఎనలేని భక్తి.. ప్రతియేడు ఏడుపాయల జాతరకు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఏడుపాయలకు వచ్చి టేకుల బొడ్డె ప్రాంతంలోని మంజీరా పాయలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగింది. గమనించిన బోయిని పాపయ్య అనే గజ ఈతగాడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి 12గంటల వరకు మంజీరా నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దుర్గ శవం లభ్యమైంది. రూ.500 అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంట్లో చిల్లిగవ్వలేక పక్కింటి వాళ్ల దగ్గర రూ.500ల అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తల్లీ.. నేను ఎవరి కోసం బతకాలి బిడ్డా...! అంటూ మృతురాలి తల్లి బాలమణి రోధించిన తీరు జాతరకు వచ్చిన భక్తులను కంటతడి పెట్టించింది. తమ బిడ్డ గల్లంతైందన్న విషయం తెలుసుకొని ఏడుపాయలకు వచ్చిన బాలమణికి తెల్లవారి శవం చూసేసరికి తెలియదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లికి నోచుకోకుండానే కానరాని లోకాలకు వెళ్లడంతో బాలమణి కన్నీరు మున్నీరైంది. పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పాపన్నపేటలో కార్డన్ సెర్చ్
పాపన్నపేట(మెదక్) : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం మెదక్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్, ముగ్గురు సీఐలు రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, శ్రీరాం విజయ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 8మంది ఎస్ఐలు కలిసి మొత్తం 55 మంది సిబ్బందితో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 129 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పోలీసు వాహనాలు మొట్ట మొదటిసారిగా పాపన్నపేట గ్రామంలో ప్రవేశించి కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు. రూరల్‌సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ ప్రశాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ఆరాచకశక్తులు తిష్టవేయకుండా, సంఘ విద్రోహక శక్తులు హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు తరచుగా కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొంగతనాన ఎత్తుకొచ్చిన వాహనాలను కొంతమంది వ్యక్తులు తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో సంబంధిత పత్రాలు లేకున్నా.. కొంతమంది వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పాపన్నపేటలో జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఆధార పత్రాలున్నట్లయితే పాపన్నపేట పోలీస్ స్టేషన్లో వాటిని సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. పత్రాలు లేకుంటే కోర్టుకు తరలిస్తామన్నారు. -
బుసకొడుతున్న పాములు
మెదక్‌జోన్ : వర్షాకాలం సీజన్ ప్రారంభం అయ్యిందో లేదో పాములు బుసలు కొడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో పాము కాటుకు గురై నలుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వీనమ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినా పాముకాటు బాధితులకు చివరి నిమిషంలో చికిత్స అందడం లేదు. వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురాకపోవడం, మూఢనమ్మకాలతో మంత్రాలు వేయిస్తూ కాలయాపన చేస్తుండటం వంటివి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. పాముకాటు గురైనప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాముల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. గడిచిన రెండు సంవత్సారాల్లో 25 మంది పాముకాటు బారిన పడ్డారు. సకాలంలో చికిత్సలు అందక 11 మంది మృత్యువాత పడ్డారు. పాముకాటు వేసిన 3 గంటల్లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతకు మించితే విషం శరీరం అంతాపాకి.. మృతి చెందే అవకాశం ఉంటుంది. పాముకాటుకు గురై మృతిచెందిన వారిలో అత్యధికంగా రైతులే ఉన్నారు. రాత్రిపగలు తేడాలేకుండా రైతులు పొలం గట్లవెంట తిరుగుతుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా పాము కాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో టార్చిలైట్, చేతికర్రతో పాటు బూట్ల మాదిరిగా చెప్పులు వేసుకోవడంతో పాములు, తేళ్లు కాటు వేసినా పెద్దగా ప్రమాదం ఉండదు. పాముకాటు బాధితులు భయంతోనే ఎక్కువగా మృతి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాటువేసిన సమయంలో భయాందోళనకు గురికావడంతో గుండె పనిచేయటం మానేసి మృతి చెందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పాము కాటువేస్తే వెంటనే కాటు వేసిన చోట గుండె వైపున తాడుతో కట్టుకట్టాలి. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి దాన్ని వదలు చేసుకుంటూ సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అలాగే పాము కాటువేసినప్పడు అది విషసర్పమా కాదా...? తెలుసుకోవడానికి రెండు లేదా ఒకటి మాత్రమే గాటు ఉంటే విషసర్పమని గుర్తించాలి. అంతేకాకుండా గాటులోంచి రక్తం కారుతుంది. పాము కాటు వేయగానే ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పైభాగంలో కట్టుకట్టి సిరంజిని గాటులో పెట్టి రక్తాన్ని పీల్చాలి. ఇలా ఒక్కోగాటులో రెండు, లేక మూడు సార్లు అలాపీల్చితే విషం బయటకు పోతుంది. విషపాము కాటువేస్తె రక్తం కూడా నల్లగా బయటకు వస్తుంది. దేశంలో 270 రకాల పాములు ఉండగా అందులో 56 సర్పాలకు మాత్రమే విషం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో కేవలం 5 పాములకు మాత్రమే ఉంటుందంటున్నారు. వాటిలో ముఖ్యంగా నాగు(త్రాచు) పాము, నల్ల కట్లపాము, రక్తపెంజరతో పాటు మరో రెండు రకాల పాములు ఉన్నట్లు చెబుతున్నారు. మూఢనమ్మకాలతో అధిక నష్టం ఆస్పత్రికి తరలించకుండా మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మంత్రాలు వేయిస్తూ ఆలస్యం చేయటంతో విషం శరీరం అంతా పాకి చనిపోతున్నారు. విష సర్పం కాటు వేస్తే మంత్రాలకు ఎట్టిపరిస్థితిలో విషం ఎక్కకుండా ఉండదు. ఒకవేళ పాముకాటు వేసిన వ్యక్తికి మంత్రాలు వేయటంతో విషం ఎక్కలేదు అంటే కాటువేసిన పాముకు విషంలేదని అర్థం. కానీ మంత్రాలు వేయటంతోనే విషం ఎక్కలేదు అంటే అది మూఢనమ్మకమనే చెప్పాలి. జిల్లాలో 5 సంవత్సరాలకు ముందు పాముకాటు వేస్తే దుబ్బాక ఐరేళ్ల లక్ష్మయ్య పేరుచెప్పి పాముకాటు బాధితుడి ఒంటిమీద ఉన్న దుస్తులను ముడివేసేవారు. అతని పేరుచెప్పి ముడివేస్తే విషం ఎక్కదని అప్పట్లో ఉమ్మడి జిల్లా ప్రజలకు గట్టినమ్మ కం. ఆదివారం వరకు ఆగి దుబ్బాకకు వెళ్లి అతని సమక్ష్యంలో ఆ ముడిని విప్పేవారు. వీరిలోనూ అనేకులు చనిపోయినట్లు సమాచారం. లక్ష్మయ్య మరణించటంతో ఆ పక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ నేటికి అనేక గ్రామాల్లో అలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావాలి.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు వేసిన 3 గంటల్లోపల బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి. మంత్రాలు వేయిస్తే ఎట్టిపరిస్థితుల్లో విషం తగ్గదు. అది పూర్తిగా మూఢ విశ్వాసం. పాముకాటు బాధితులు చనిపోయారంటే సకాలంలో ఆస్పత్రికి తీసుక రాకుండా మంత్రాలు వేయించి ఆలస్యం చేయటంతోనే జరిగి ఉంటుంది. - వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ ఇటీవల మృతి చెందిన వారు హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన హన్మంతు ఈనెల 13న, పొలం వద్ద పాముకాటుకు గురై మృతి చెందాడు. హవేళిఘణాపూర్ మండలం లింగ్సాన్‌పల్లి గిరిజన తండాకు చెందిని లంబాడి చత్రియ ఈనెల 13న, పొలం వద్ద పాముకాటుకు గురై మృతి చెందాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన హాస్యప్రియ(10) ఈనెల 12, ఇంటివద్ద పాముకాటుకు గురై మృతి చెందింది. పాపాన్నపేట మండల కేంద్రానికి చెందిన హరిప్రసాద్(5) ఈనెల 12న, రాత్రివేళలో పాముకాటుకు గురై మృతి చెందాడు. -
శాస్త్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
పాపన్నపేట: రైతులు అనుకరణ విధానానికి స్వస్తి చెప్పి శాస్త్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ శాస్త్రవేత్త రాఘవయ్య అన్నారు. పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో మంగళవారం జరిగిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు రైతులు మొదట భూసార పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులో సేంద్రియ, రసాయన ఎరువులు వాడాలని, విత్తనశుద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ రమేష్ ఏడిఏ మనోహర, జిల్లా వ్యవసాయాధికారి పరశురాములు, ఏఓలు శోభ, శిరీష, రమేష్, నెలవంక, రైతులు పాల్గొన్నారు. -
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
పాపన్నపేట: రైతుల ప్రయోజనం కోసమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట, రామతీర్థం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మల్లంపేటలో డీసీసీబీ డైరక్టర్ మోహన్‌రెడ్డి డీసీఓను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం సర్పంచ్ అనురాధ, పర్యవేక్షణ అధికారి సాదిక్ అలీ, బేతయ్య, కిష్టయ్య, నవీన్, అంథోని, సంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మెదక్‌రూరల్ (హవేళిఘనపూర్): హవేళిఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ సొసైటీ చైర్మన్ హన్మంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు రాజేశ్వర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు. టేక్మాల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కో-ఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రమైన టేక్మాల్ పీఏసీఎస్ గోదాం వద్ద చైర్మన్ యశ్వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటు ఉంటామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని రైతులు లాభాలను గడించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెరైక్టర్ మోహన్‌రెడ్డి, జెడ్పీటీపీ ఎంఏ.ముఖ్తార్, ఎంపీపీ అంజమ్మ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్ధయ్య, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, ఎంపీడీఓ విష్ణువర్దన్, సీఈఓ వేణుగోపాల్, పీఏసీఎస్ డెరైక్టర్లు విద్యాసాగర్, రవిశంకర్, గోవిందచారి, యాదయ్య, నాయకులు నిమ్మ రమేష్, వీరప్ప, కిషోర్, శ్రీనివాస్, నారాయణ, యాదగిరి, దేవేందర్, మోహన్ మల్లేశం, సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఈఓ వెంకట్‌రెడ్డిని, జిల్లా డెరైక్టర్ మోహన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
అయ్యో పాపం..
ట్రాలీ ఆటో నెట్టి.. చక్రాల కింద నలిగి పండుగ ముంగిట ఓ విద్యార్థి విషాదం పాపన్నపేట: దసరా సెలవుల్లో.. దోస్తులతో కలిసి ఆటలాడుకుంటున్న ఓ విద్యార్థి సహాయం కోసం వెళ్ళి.. మృత్యువాతపడ్డాడు. మొరాయిస్తున్న ట్రాలీ ఆటో నెట్టేందుకు వెళ్లిన ఆ చిన్నారి.. దాని చక్రాల కిందే నలిగి చనిపోయిన దుర్ఘటన పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత వర్గాల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన పుట్టి శంకరప్ప, లక్ష్మి దంపతులకు పూజ, నాగరాజు అనే ఇద్దరు బిడ్డలు. తినడానికి తిండి లేని ఈ దంపతులు బతుకుదెరువు కోసం బిడ్డ పూజను తీసుకొని ఆర్మూర్‌కు వలస వెళ్ళారు. కొడుకు నాగరాజు(10) చిన్నాన్న సత్యనారాయణ దగ్గర ఉంటూ కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. బతుకమ్మ, దసరా పండుగలు దగ్గర పడటంతో శంకరయ్య, లక్ష్మి దంపతులు కొత్తపల్లికి వచ్చారు. సెలవుల నేపథ్యంలో గురువారం దోస్తులతో కలసి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద నాగరాజు ఆడుకుంటున్నాడు. అయితే అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ ట్రాలీ ఆటో స్టార్ట్ కాక పోవడంతో డ్రైవర్ ఆడుకుంటున్న పిల్లలను నెట్టమని కోరాడు. ఈక్రమంలో నాగరాజు కూడా స్నేహితులతో కలసి ఆటోనెడుతుండగా అది స్టార్ట్ అయి ముందుకు కదలింది. నాగరాజుకు మాత్రం ఆటో వెనుక భాగం తగలడంతో తల పగిలి అక్కడికక్కడే చని పోయాడు. విషయం తెలుసుకున్న దంపతులు, వారి బంధువులు ఘటన స్థలికి వచ్చి గుండెలు బాదుకున్నారు. ఉన్న ఏకైక పుత్రుడు దుర్మరణం పాలవడంతో కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు ఆటలాడుకుంటున్న తమ పిల్లాడిని పొట్టన బెట్టుకున్న నిందితులపై చర్య తీసుకొని, తమకు న్యాయం జరిపించే వరకు శవం కదిలేది అంటు మృతుని బంధువులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు బాధితులను సముదాయించి కేసు నమోదు చేశారు. కాగా మృతుడు పాఠశాలలో చురుకైన విద్యార్థి అని ఉపాధ్యాయులు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి మృతి పట్ల ఎంఈఓ మోహన్రాజుతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం తెలిపారు. -
‘లక్ష్మీ’కటాక్షమే!
పాలనురగలు.. సిరుల ముల్లెలు పచ్చని లోగిళ్లు.. హరిత వనాలు మొక్కలకు పుట్టిన రోజు పండుగలు సాధికారత దిశగా లక్ష్మీనగర్ మహిళలు పాపన్నపేట: ఆకాశంలో సగం.. అవనిపై సగం మాత్రమే కాదు కుటుంబ పోషణలో.. పర్యావరణ పరిరక్షణలో.. హరిత ఉద్యమంలో.. సామాజిక చైతన్యంలో.. ఆర్థిక ప్రగతిలో.. పొదుపు మంత్రంలో.. మేము సైతమంటూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.. మెతుకు సీమకే ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీనగర్ మహిళలు. పాలనురగలు ఆపల్లెకు సిరుల ముల్లెగా మారుతున్నాయి. వారి ఆర్థికాభివృద్ధికి మూలాలవుతున్నాయి. పాపన్నపేట మండలంలో మెదక్-బొడ్మట్‌పల్లి రోడ్డుపై ఉంది లక్ష్మీనగర్ గ్రామం.1950లో ఆంధ్రా›పాంతం నుంచి వలస వచ్చిన జనాలు ఈ గ్రామానికి పురుడు పోశారు. మంజీర గలగలల ఒడ్డున.. ఫతేనహర్ కెనాల్ పక్కన వెలసిన ఈ ప్రాంతం పచ్చని పంటలకు నిలయం. మగవారంతా వ్యవసాయం చేస్తుంటే.. పాడి వ్యాపారంతో ఆర్థికాభివృద్ధికి తమ శ్రమను సోపానాలుగా మారుస్తున్నారు ఆ గ్రామ మహిళలు. కుటుంబ పోషణకు మేము సైతమంటు తమ చేయూతనిస్తున్నారు. సుమారు 1200 జనాభా గల ఆ పల్లెలో సగంమందికి పైగా మహిళలే. మగవాళ్ళంతా పొలంపనులకు వెళ్తే మహిళలు పాడి పనులే లోకంగా బతుకుతుంటారు. ఈ పల్లెలో సుమారు 400కు పై గేదెలున్నాయి. కోడికూతతో నిద్ర లేచే మహిళలు మొదట అడుగులు వేసేది పశువుల పాక వైపే. పేడ తీయడం.. గడ్డివేయడం.. పాలు పితకడం..కేంద్రానికి తీసుకెళ్ళడం ప్రధాన దినచర్య. గ్రామంలో నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయం పాల వ్యాపారంపైనే వస్తుంది. ప్రణాళికాబద్ధమైన అడుగులు ప్రభుత్వ సహకారంతో మెరుగైన ప్రణాళికతో ప్రగతివైపు అడుగులు వేస్తున్నారు మహిళలు. గ్రామంలో 21 డ్వాక్రా గ్రూపులున్నాయి. పొడిచన్పల్లి యూకో బ్యాంకు ద్వారా ఒక్కో గ్రూపు రూ.5 లక్షల రూణాలను తీసుకొని ,గేదెలు కొనుగోలు చేశారు. అలాగే ఇటీవల నాబార్డ్ సహకారంతో 16 గ్రూపులకు చెందిన మహిళలొక్కక్కరు రూ.50 వేల చొప్పునపాపన్నపేట సహకార బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని ఒక్కో గేదెను కొనుక్కొచ్చారు. దళారి వ్యవస్థకు స్వస్తి చెప్పి మహిళలంతా గ్రూపుగా ఏర్పడి జనవరి 2015లో పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని విజయ డెయిరీ వాళ్ళకు విక్రయిస్తూ గిట్టుబాటు ధర పొందుతున్నారు. చాలా మంది మహిళలు తమ సంపాదనతో పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్ లాంటి కోర్సులు చదివిస్తున్నారు. పచ్చని లోగిళ్లు లక్ష్మీనగరంలో చెట్టు లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి లేదు. పూరిళ్లు అయినా.. ఆర్సీసి మేడ అయినా పచ్చని చెట్లతోనే స్వాగతం పలుకుతాయి. ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 4 వేల మొక్కలు నాటారు. వాటి పరిరక్షణ కోసం మహిళలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసుకొని, వాటి చుట్టూ కంచెలు నాటి, ఎండా కాలంలో నీళ్లు పోస్తు వాటికి జీవం పోశారు. ప్రతి యేడు జూలై 10 రోజున వినూత్న రీతిలో మొక్కలకు పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు. అలాగే దేవస్థాన గోమాతకు శ్రీమంతం జరిపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక్కడ మరుగుదొడ్డి లేని ఇళ్లు లేదు. బాలవికాస ఆధ్వర్యంలో మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం విలేజి డెవలప్మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో మహిళల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామానికి చెందిన కమ్మలపాటి సాంబశివరావు, పద్మ, సాంబశివరావు, శారద అనే రెండు కుటుంబాలకు చెందిన నిరుపేద దంపతులు ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల్లో ఇడ్లీలు అమ్ముతున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలతో మానసికోల్లాసం మహిళలు కేవలం కష్టపడి పనిచేయడమే గాకుండా సాంస్క ృతిక.. ఆద్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసికోల్లాసాన్ని పొందుతున్నారు. గ్రామంలోని సుమారు 50 మంది మహిళలు కోలాటాన్ని నేర్చుకొని తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, భిక్కనూర్, ఏడుపాయల ఆలయాల్లో ఉత్సవాల సమయాన ప్రదర్శన లిచ్చి అందరి మన్ననలు పొందారు. స్వాధ్యాయ కార్యక్రమం ద్వార ఆధ్యాత్మిక బోధనలతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పొందడానికి మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీనగర్ మహిళలు శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభవిస్తూ తోటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
గాయత్రీదేవిగా ఏడుపాయల దుర్గమ్మ
పాపన్నపేట: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత మంగళవారం శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్‌షెడ్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలతో విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ సొంగ పవిత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగుతున్న వరదనీటితో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఇంకా జలదిగ్భంధంలోనే కొనసాగుతోంది. -
ఢాక్యాతండాలో విషజ్వరాలు
70 మందికి అస్వస్థత.. ఏడు రోజులుగా అవస్థలు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికుల వినతి పాపన్నపేట: మారుమూల గిరిజన తండా విషజ్వరాలతో వణుకుతోంది. సుమారు 70 మంది గిరిజనులు పిల్లా..పెద్ద అన్న తేడా లేకుండా జ్వరాల బారిన పడి మంచం పట్టారు. సర్కారు దవాఖానకు వెళ్లి సూది మందు తీసుకున్నా నయం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. పాపన్నపేట మండలం అర్కెల పంచాయతీ పరిధిలోని ఢాక్యాతండాలో వారం రోజులుగా విషజ్వరాలు ప్రబలాయి. చలి జ్వరం, నీరసం, కీళ్ళనొప్పులు కొంతమంది వాంతులతో బాధపడుతున్నట్లు గిరిజనులు తెలిపారు. ఒక్కో ఇంట్లో ఇంటిళ్ళిపాది జ్వరంతో బాధపడుతున్నారు. చేతనైన వారు పాపన్నపేట పీహెచ్‌సీకి వెళ్తుండగా..మరికొంత మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నా జ్వరం తగ్గడం లేదంటున్నారు.పీహెచ్సీ సిబ్బంది తండాకు వచ్చి సూది మందులు ఇస్తున్నా నయం కావడం లేదని వాపోతున్నారు. తండాకు చెందిన అన్షి,లక్ష్మి,మోత్య ,పూల్య, సుమిత్ర, గుగులోత్ లక్ష్మి,రాణి, పీక్లి ,ప్రియాంక, విఠల్, శోభ, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు.వెంటనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి తమకు వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.తల్లి దండ్రులకు జ్వరాలు రావడంతో పిల్లలు సైతం బడికి రావడం లేదు.బుధవారం ఒక్క రోజే 35 మంది విద్యార్థులు బడికి రాలేదని హెచ్ఎం నర్సింహరెడ్డి తెలిపారు. కొనసాగుతున్న వైద్యశిబిరం కౌడిపల్లి: మండలంలోని రాందాస్‌గూడలో వైద్యశిబిరం కొనసాగుతోంది. బుధవారం మూడో రోజు స్థానిక ఎంపీహెచ్ఈఓ సురేందర్, సూపర్వైజర్ మార్త వైద్యశిబిరం కొనసాగించారు. రోగులకు మందులు ఇచ్చి పంపుతున్నారు. గ్రామంలో విషజ్వరాలు తగ్గుతున్నాయిని జలుబు, కీళ్లనొప్పులతో ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ వర్ల సత్తమ్మ పాల్గొన్నారు. -
ఏడుపాయలను దర్శించుకున్న శ్రీకాంత్
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతోందని, ప్రతి మొక్క భూమాతకు పచ్చని బుట్టులా మారాలని సినీ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం ఏడుపాయలకు వచ్చిన ఆయన దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ముందుగా ఈఓ వెంకట్‌కిషన్‌రావు, విష్ణువర్దర్‌రెడ్డి, ఆయల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏడుపాయలను దర్శించుకోలేదన్నారు. దట్టమైన అడవి మధ్యన మంజీరా, ప్రహరీలా ఉన్న రాతి గుట్టల్ని చూస్తుంటే మనస్సు పులకించిందన్నారు. హరితహారంలో యావత్ సినీ పరిశ్రమ పాల్గొని మొక్కలు నాటిందన్నారు. ఆయన వెంట బంధువులు, ఆలయ సిబ్బంది గోపాల్, రవి, శ్రీనివాస్, అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, పూజారులు శంకరశర్మ, పార్థివశర్మ ఉన్నారు. సెల్ఫీల కోసం ఆరాటం తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు, మహిళలు పోటీపడ్డారు. చిరుజల్లులు పడుతున్నా శ్రీకాంత్ ఓపిగ్గా అందరినీ పలకరించి, ఫొటోలు దిగడం విశేషం. -
బడులకు ఊపిరి
బలోపేతానికి చర్యలు కార్పొరేట్‌కు దీటుగా మౌలిక సౌకర్యాలు నియోజకవర్గానికి రూ.5 కోట్లు త్వరలో నిధుల విడుదల పాపన్నపేట:ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని సర్కార్ యోచిస్తోంది. మౌలిక వసతులు కల్పించి పాఠశాలలకు ప్రాణం పోయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకోసం బృహత్ ప్రణాళికను రూపొందిస్తోంది. అందరి సహకారం తీసుకుంటూనే నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి నిధులు, సీఎస్ఆర్ నిధులతో ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, ల్యాబోరేటరీ, ప్రహరీలు, తరగతి గదులు, టాయిలెట్లు, వంట గదులు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. జిల్లాలో మొత్తం 2,947 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చాలా వాటికి ప్రహరీలు లేవు. సరిపడా తరగతి గదులు, ల్యాబోరేటరీ, గ్రంథాలయ, మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకట్టుకునే అవకాశం లభిస్తుందన్న నిర్ణయంతో పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించినట్లు ఇటీవల సంగారెడ్డి పట్టణానికి వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గానికి రూ 5.కోట్లు ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సంబంధిత నియోజకవర్గం నిధుల నుంచి ఎమ్మెల్యే రూ.కోటి, జిల్లా ఇన్చార్జి మంత్రి రూ.కోటి, సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.కోటి చొప్పున ఇస్తే తాము మరో రూ.2కోట్లు జత చేసి నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యేలా చూస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు తమ సమ్మతిని తెలిపారన్నారు. అయితే శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రహరీల నిర్మాణాన్ని ఉపాధి పనులకు జత చేస్తే బావుంటుందని సూచించారన్నారు. ఈ సూచనను ప్రశంసించినట్టు చెప్పారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుని కొంత మంది దాతల సహకారంతో, ఇతర నిధులతో పాఠశాలల్లో ఫర్నిచర్ సౌకర్యం కల్పించిన తీరును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ప్రశంసించారన్నారు. త్వరలోనే పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించడంతో సర్కారు బడులకు మహర్దశ పట్టనుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
అయ్యో.. హారిక
పాపన్నపేట: ఆడపిల్ల అని భారమైందో...లేక ప్రమాదమే కారణమైందో...తెలియదు కానీ.. రెండేళ్ల చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర సంఘటనతో పదిరోజుల బాలింత అయిన చిన్నారి తల్లి నోటమాటరాక తల్లడిల్లిపోతోంది. ఈ దారుణానికి కారణమేమిటో తెలియక కన్నీరుమున్నీరవుతోంది. వివరాల్లోకి వెళితే...పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మాటూరి ఎల్లంకు 2010లో చింతకుంట గ్రామానికి చెందిన మంజులతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మొదటి పాప రేణుక, రెండోపాప హారికతోపాటు పదిరోజుల క్రితమే మరో ఆడపిల్లకు మంజుల జన్మనిచ్చింది. అయితే మగ సంతానం కావాల్సిందేనంటూ ఎల్లం తండ్రి బీరయ్య, తల్లి దుర్గమ్మ, ఆడపడుచు మమతలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా మంజులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం హారిక అలియాస్ సుజాత(2) అంగన్వాడి కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తలనొప్పితో బాధపడుతున్న మంజుల హారికను దగ్గరకు తీసుకోలేక పోయింది. దీంతో తాత బీరయ్య చిన్నారి హారికను తీసుకుని బయటకు వెళ్లాడు. అరగంట తర్వాతఇంటికొచ్చిన ఆడపడుతచు మమత వంటింట్లోకి వెళ్లేసరికి నీటితొట్టిలో హారిక మృతదేహం కనిపించింది. దీంతో ఆమె పెద్దగా అరుస్తూ బయటకు రాగా, వెంటనే వంటింట్లోకి వెళ్లిన మంజుల కూతురు మృతదేహం చూసి కన్నీరుమున్నీరైంది. ఘటనపై పలు అనుమానాలు హారికను ఇంట్లో దించి తాను బీడీలు తెచ్చుకునేందుకు వెళ్లానని చిన్నారి తాత బీరయ్య చెబుతున్నాడు. అయితే బాలిక నీటితొట్టిలో పడిపోయే ఆస్కారమే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హారిక పడిపోయిన నీటితొట్టి చిన్నారికి అందేంత ఎత్తులో లేనందున బాలిక తనకు తానుగా అందులో పడిపోయే అవకాశం లేదంటున్నారు. ఈ మేరకు పాపన్నపేట ఏఎస్ఐ విఠల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సింగూరు నీటి కోసం ఎదురుచూపులు
పాపన్నపేట: సింగూరు నీటి కోసం ఘనపురం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ నీటి జాడలేక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సింగూరు నుంచి 0.25 టీఎంసీల నీటిని వదిలారు. అయితే ఆ నీరు దిగువన ఉన్న కలబ్గూర్ డ్యాంలో నిల్వ ఉండిపోయాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఇరిగేషన్ అధికారులు 0.25 టీఎంసీ నీటిని దిగువకు వదిలినట్లు తెలిసింది. అయితే ఈనీరు 24గంటల తరువాతే ఘనపురం ఆనకట్టను చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీఈఈ సురేష్‌బాబు తెలిపారు. నాలుగు రోజులుగా చినుకులు జాడలేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాపన్నపేట మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. సింగూరు నీటిపై ఆశతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని రైతులు సైతం వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీంతో సింగూరు నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నాట్లు వేస్తేనే పంట దిగుబడి ఆశించినస్థాయిలో వస్తుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గిపోతుందని దిగాలుప డుతున్నారు. -
ఒంటరిగానే టీఆర్ఎస్ పోటీ
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట, న్యూస్‌లైన్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు. కార్యకర్తలంతా అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ వచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశయ్య, కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, సాయిరెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థుల గెలపునకు ప్రణాళిక మెదక్‌టౌన్: టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవశం చేసుకుంటామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపుకోసం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. త్వరలో అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను కైవశం చేసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని గడప గడపకు వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టం సాధించారని కొనియాడారు. టీఆర్ఎస్కు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, వారి నిర్ణయం మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగాధర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సలాం, మండలఅధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు రాగి అశోక్, జీవన్ తదితరులు ఉన్నారు.