జ్వరంతో బాధపడుతున్న గిరిజన మహిళ
- 70 మందికి అస్వస్థత.. ఏడు రోజులుగా అవస్థలు
- వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికుల వినతి
పాపన్నపేట: మారుమూల గిరిజన తండా విషజ్వరాలతో వణుకుతోంది. సుమారు 70 మంది గిరిజనులు పిల్లా..పెద్ద అన్న తేడా లేకుండా జ్వరాల బారిన పడి మంచం పట్టారు. సర్కారు దవాఖానకు వెళ్లి సూది మందు తీసుకున్నా నయం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. పాపన్నపేట మండలం అర్కెల పంచాయతీ పరిధిలోని ఢాక్యాతండాలో వారం రోజులుగా విషజ్వరాలు ప్రబలాయి.
చలి జ్వరం, నీరసం, కీళ్ళనొప్పులు కొంతమంది వాంతులతో బాధపడుతున్నట్లు గిరిజనులు తెలిపారు. ఒక్కో ఇంట్లో ఇంటిళ్ళిపాది జ్వరంతో బాధపడుతున్నారు. చేతనైన వారు పాపన్నపేట పీహెచ్‌సీకి వెళ్తుండగా..మరికొంత మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నా జ్వరం తగ్గడం లేదంటున్నారు.పీహెచ్‌సీ సిబ్బంది తండాకు వచ్చి సూది మందులు ఇస్తున్నా నయం కావడం లేదని వాపోతున్నారు.
తండాకు చెందిన అన్షి,లక్ష్మి,మోత్య ,పూల్య, సుమిత్ర, గుగులోత్ లక్ష్మి,రాణి, పీక్లి ,ప్రియాంక, విఠల్, శోభ, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు.వెంటనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి తమకు వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.తల్లి దండ్రులకు జ్వరాలు రావడంతో పిల్లలు సైతం బడికి రావడం లేదు.బుధవారం ఒక్క రోజే 35 మంది విద్యార్థులు బడికి రాలేదని హెచ్‌ఎం నర్సింహరెడ్డి తెలిపారు.
కొనసాగుతున్న వైద్యశిబిరం
కౌడిపల్లి: మండలంలోని రాందాస్‌గూడలో వైద్యశిబిరం కొనసాగుతోంది. బుధవారం మూడో రోజు స్థానిక ఎంపీహెచ్‌ఈఓ సురేందర్, సూపర్‌వైజర్ మార్త వైద్యశిబిరం కొనసాగించారు. రోగులకు మందులు ఇచ్చి పంపుతున్నారు. గ్రామంలో విషజ్వరాలు తగ్గుతున్నాయిని జలుబు, కీళ్లనొప్పులతో ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ వర్ల సత్తమ్మ పాల్గొన్నారు.