ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.
వెల్లుల్లి చారు తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment