పాపన్నపేటలో బైక్‌లను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
పాపన్నపేట(మెదక్) : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం మెదక్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్, ముగ్గురు సీఐలు రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, శ్రీరాం విజయ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 8మంది ఎస్‌ఐలు కలిసి మొత్తం 55 మంది సిబ్బందితో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 129 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పోలీసు వాహనాలు మొట్ట మొదటిసారిగా పాపన్నపేట గ్రామంలో ప్రవేశించి కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు.
రూరల్‌సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ఆరాచకశక్తులు తిష్టవేయకుండా, సంఘ విద్రోహక శక్తులు హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు తరచుగా కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దొంగతనాన ఎత్తుకొచ్చిన వాహనాలను కొంతమంది వ్యక్తులు తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో సంబంధిత పత్రాలు లేకున్నా.. కొంతమంది వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పాపన్నపేటలో జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఆధార పత్రాలున్నట్లయితే పాపన్నపేట పోలీస్ స్టేషన్‌లో వాటిని సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. పత్రాలు లేకుంటే కోర్టుకు తరలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment