బాలుడి మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు
ట్రాలీ ఆటో నెట్టి.. చక్రాల కింద నలిగి
పండుగ ముంగిట ఓ విద్యార్థి విషాదం
పాపన్నపేట: దసరా సెలవుల్లో.. దోస్తులతో కలిసి ఆటలాడుకుంటున్న ఓ విద్యార్థి సహాయం కోసం వెళ్ళి.. మృత్యువాతపడ్డాడు. మొరాయిస్తున్న ట్రాలీ ఆటో నెట్టేందుకు వెళ్లిన ఆ చిన్నారి.. దాని చక్రాల కిందే నలిగి చనిపోయిన దుర్ఘటన పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత వర్గాల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొత్తపల్లి గ్రామానికి చెందిన పుట్టి శంకరప్ప, లక్ష్మి దంపతులకు పూజ, నాగరాజు అనే ఇద్దరు బిడ్డలు. తినడానికి తిండి లేని ఈ దంపతులు బతుకుదెరువు కోసం బిడ్డ పూజను తీసుకొని ఆర్మూర్‌కు వలస వెళ్ళారు. కొడుకు నాగరాజు(10) చిన్నాన్న సత్యనారాయణ దగ్గర ఉంటూ కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
బతుకమ్మ, దసరా పండుగలు దగ్గర పడటంతో శంకరయ్య, లక్ష్మి దంపతులు కొత్తపల్లికి వచ్చారు. సెలవుల నేపథ్యంలో గురువారం దోస్తులతో కలసి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద నాగరాజు ఆడుకుంటున్నాడు. అయితే అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ ట్రాలీ ఆటో స్టార్ట్ కాక పోవడంతో డ్రైవర్ ఆడుకుంటున్న పిల్లలను నెట్టమని కోరాడు.
ఈక్రమంలో నాగరాజు కూడా స్నేహితులతో కలసి ఆటోనెడుతుండగా అది స్టార్ట్ అయి ముందుకు కదలింది. నాగరాజుకు మాత్రం ఆటో వెనుక భాగం తగలడంతో తల పగిలి అక్కడికక్కడే చని పోయాడు. విషయం తెలుసుకున్న దంపతులు, వారి బంధువులు ఘటన స్థలికి వచ్చి గుండెలు బాదుకున్నారు. ఉన్న ఏకైక పుత్రుడు దుర్మరణం పాలవడంతో కన్నీరుమున్నీరయ్యారు.
న్యాయం జరిగే వరకు కదిలేది లేదు
ఆటలాడుకుంటున్న తమ పిల్లాడిని పొట్టన బెట్టుకున్న నిందితులపై చర్య తీసుకొని, తమకు న్యాయం జరిపించే వరకు శవం కదిలేది అంటు మృతుని బంధువులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు బాధితులను సముదాయించి కేసు నమోదు చేశారు. కాగా మృతుడు పాఠశాలలో చురుకైన విద్యార్థి అని ఉపాధ్యాయులు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి మృతి పట్ల ఎంఈఓ మోహన్‌రాజుతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం తెలిపారు.