ఒంటరిగానే టీఆర్‌ఎస్ పోటీ
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
పాపన్నపేట, న్యూస్‌లైన్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు.
కార్యకర్తలంతా అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ వచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆశయ్య, కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, సాయిరెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
అభ్యర్థుల గెలపునకు ప్రణాళిక
మెదక్‌టౌన్: టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవశం చేసుకుంటామని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపుకోసం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. త్వరలో అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను కైవశం చేసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ చేసిన పోరాటాన్ని గడప గడపకు వివరిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టం సాధించారని కొనియాడారు.
టీఆర్‌ఎస్‌కు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, వారి నిర్ణయం మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగాధర్, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సలాం, మండలఅధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు రాగి అశోక్, జీవన్ తదితరులు ఉన్నారు.