Padmadevendar reddy
-
త్వరలో రూ. లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీ
మెదక్: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
లాభసాటి వ్యవసాయం మేలు
సాక్షి, మెదక్ : ఉన్న నీటితో లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తి కోసం ఎంపిక చేసిన మెదక్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం దళిత రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పండించేందుకు ఎక్కువ నీరు అవసరమని.. వాణిజ్య పంటలకు తక్కువ నీరు అవసరమని వివరించారు. ఈ మేరకు వాణిజ్య పంటల సాగు దిశగా రైతులు ముందుకు సాగాలన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా.. పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఇందులో ఈ గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం : పద్మాదేవేందర్‌రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామం ఎంపిక కావడంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. అంతేకాదు.. భూమి లేని దళిత కుటుంబాలకు నాటు కోళ్ల పెంపకానికి సంబంధించి పిల్లలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ రైతులు ఇలాంటి ఫలాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెదక్ మండల పరిషత్ అధ్యక్షురాలు లక్ష్మీకిష్టయ్య, సర్పంచ్, శాస్త్రవేత్తలు సతీష్, మంజునాథ్, పద్మావతితోపాటు జిల్లా వ్యవసాయ శాఖాధికారి పరశురాం నాయక్, ఏడీఏ నగేశ్ కుమార్, ఏపీడీ ఉమాదేవి, తహసీల్దార్ రవికుమార్, మండల వ్యవసాయాధికారి రెబల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
సీట్లూ తక్కువే... గెలిచిన స్థానాలూ తక్కువే
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం అంటూ ‘ఆమె’ను ఆకాశానికి ఎత్తేసే ప్రభృతులు రాజకీయంగా మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైతం మహిళలకు ఈసారి తక్కువ సీట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు వివిధ పార్టీలు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండగా, గెలుపొందిన స్థానాలు కూడా తక్కువే. 2014లో టీఆర్ఎస్ 11 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా, బీజేపీ- టీడీపీ కూటమి 14 మందికి, కాంగ్రెస్ పార్టీ 9 మంది మహిళలను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే ఈ అభ్యర్థుల్లో కేవలం 9 మంది మాత్రమే గెలుపొందగా.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంతో మహిళా ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ అత్యధికంగా 13 మంది మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించగా.. ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ తరఫున మొత్తంగా 11 మంది టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు అభ్యర్థులు(మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ నాయక్, సీతక్క) మాత్రమే గెలుపొందారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ కూకట్పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. ఇక మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీఆర్ఎస్ ఈ దఫా కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించింది. కాగా వీరిలో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందడం విశేషం. టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన మహిళలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), రేఖా శ్యాం నాయక్(ఖానాపూర్), కోవా లక్ష్మి (అసిఫాబాద్), గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి(ఆలేరు) కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న మహిళా అభ్యర్థులు గండ్రత్ సుజాత (ఆదిలాబాద్), ఆకుల లలిత(ఆర్మూర్), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), జె.గీతారెడ్డి (జహీరాబాద్), సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), డీకే అరుణ (గద్వాల), పద్మావతీరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల), సీతక్క (ములుగు), హరిప్రియ (ఇల్లందు), సింగాపురం ఇందిర (స్టేషన్ ఘన్పూర్) ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ నుంచి బరిలో దిగిన మహిళా అభ్యర్థులు స్వర్ణారెడ్డి(నిర్మల్), అరుణతార(జుక్కల్ ), బొడిగె శోభ(చొప్పదండి), ఆకుల విజయ(గజ్వేల్), సయ్యద్షెహజాది(చాంద్రాయణగుట్ట), పద్మజారెడ్డి(మహబూబ్‌నగర్), రజనీ మాధవరెడ్డి(ఆలంపూర్), కంకణాల నివేదిత(నాగార్జునసాగర్), నాగ స్రవంతి(), రేష్మారాథోడ్(వైరా), కుంజా సత్యవతి(భద్రాచలం), పుప్పాల శారద(ఖమ్మం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి). కాగా 2014 ఎన్నికల్లో మొత్తంగా 85 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగగా(ఏడీఆర్ నివేదిక ప్రకారం)... 9 మంది విజయం సాధించారు. ఈసారి 135 మంది పోటీ చేయగా కేవలం ఆరుగురు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టనున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు అభ్యర్థి పేరు నియోజకవర్గం పార్టీ ప్రత్యర్థి పార్టీ మెజారిటీ పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ 47983 గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 33086 సీతక్క ములుగు కాంగ్రెస్ అజ్మీరా చందూలాల్ టీఆర్ఎస్ 22671 రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ 20710 సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ 7607 హరిప్రియ ఇల్లందు కాంగ్రెస్ కనకయ్య కోరం టీఆర్ఎస్ 2907 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మహిళలు అభ్యర్థి పేరు నియోజక వర్గం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి పార్టీ మెజారిటీ రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రాథోడ్ రమేష్ టీడీపీ 38,551 బొడిగె శోభ చొప్పదండి టీఆర్ఎస్ సుద్దాల దేవయ్య కాంగ్రెస్ 54,981 డికె అరుణ గద్వాల్ కాంగ్రెస్ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ 8,260 గొంగిడి సునీత ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 31,477 జెట్టి గీత జహీరాబాద్ కాంగ్రెస్ కొనింటీ మానిక్ రావ్ టీఆర్ఎస్ 814 కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ బసవరాజు సారయ్య కాంగ్రెస్ 55,085 కోవా లక్ష్మి అసిఫాబాద్ టీఆర్ఎస్ ఆత్రం సక్కు కాంగ్రెస్ 19,052 పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ విజయశాంతి కాంగ్రెస్ 39,660 నలమాద పద్మావతి రెడ్డి కోదాడ కాంగ్రెస్ బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ 13,090 -
‘కారు’ జోరు
ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థులు పదింటికి ఎనిమిది స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గజ్వేల్ నుంచి బరిలో నిలిచి గెలిచిన కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావు కీలకమైన నీటి పారుదల శాఖ మంత్రి పదవి చేపట్టారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పదమూడో శాసనసభ (2009–14)లో జిల్లాలో తిరుగులేని విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మలి విడత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014 జూలై రెండో తేదీని ప్రకటించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను నారాయణఖేడ్, జహీరాబాద్ మినహా మిగతా ఎనిమిది సెగ్మెంట్లలోనూ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్), బాబూమోహన్ (అందోలు) తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.కిష్టారెడ్డి (æఖేడ్), జె.గీతారెడ్డి (జహీరాబాద్) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. అసెంబ్లీకి మళ్లీ కేసీఆర్.. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ 2004 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు దశాబ్దకాలం తర్వాత శాసన సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహరెడ్డి భూపాల్‌రెడ్డి మరోమారు పార్టీ తరపున పోటీ చేశారు. హోరాహోరిగా సాగిన ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి సుమారు 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. మంత్రివర్గంలో హరీశ్.. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించిన తన్నీరు హరీష్‌రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో ప్రధానమైన శాఖలు దక్కాయి. నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెదక్ నుంచి విజయం సాధించిన పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సైడ్ లైట్స్.. 2004లో రామాయంపేట నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి, 2014లో మెదక్ నుంచి బరిలోకి దిగారు. మాజీ లోక్‌సభ సభ్యురాలు, సినీనటి విజయశాంతి మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా పదవి స్వీకరించారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టి.హరీష్‌రావు వరుసగా ఐదో పర్యాయం బరిలో నిలిచి, కాంగ్రెస్ అభ్యర్థిపై 93వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించి రికార్డు సృష్టించారు. నర్సాపూర్ నుంచి వరుసగా మూడో పర్యాయం విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి పరాజయం పాలయ్యారు. ∙2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన చింత ప్రభాకర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల నాటికి టీఆర్ఎస్లో చేరిన చింత ప్రభాకర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాశ్‌రెడ్డిపై గెచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అందోలు నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించి, మంత్రిగా పనిచేసిన బాబూమోహన్ 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చివరి నిమిషంలో చేరి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.కిష్టారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరీ విజయం సాధించారు. అయితే 2015 ఆగస్టులో గుండెపోటుతో కిష్టారెడ్డి మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గా భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి నియోజకర్గాల పునర్విభజన అనంతరం 2009, 14 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి వరస విజయాలు సాధించారు. -
కనులపండువగా క్రిస్మస్..
మెదక్: ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పిస్తా
చిన్నశంకరంపేట: అర్హులైన ప్రతి ఒక్కరికి అసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పింఛన్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విదంగా అసరా పథకం కింద పింఛన్లను రూ. వెయ్యి, రూ.15వందలకు పెంచడంతో పాటు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో తమ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. జాబితాలో అర్హుల పేర్లు లేకున్నా అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హుల పేర్లను గుర్తించే బాధ్యత సర్పంచ్‌లదేనని, వారు అందించిన జాబితాను పరిశీలించి పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. చందంపేట గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 10 లక్షలు, రుద్రారంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలకు నాలుగు అదనపు గదులు మంజూరు చేయించానని, త్వరలోనే మోడల్ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంతోషి గ్రామ సమస్యలు వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ మోహన్, ఎంపీపీ కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎంపీటీసీ శశికళపోచగౌడ్, సర్పంచ్‌లు సత్యనారాయణ, నాగరాజ్, మాజీ సర్పంచ్‌లు సుధాకర్,రాజు పాల్గొన్నారు. సమాజసేవలో పాలుపంచుకోవాలి రామాయంపేట: ప్రతి ఒక్కరూ సేవా దృ క్పథాన్ని అలవర్చుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రామాయంపేటలో లయన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రక్తదానం ఎంతో గొప్పదని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సమాజసేవలో విద్యార్థులు పాలుపంచుకోవాలన్నారు. రామాయంపేటలో రోడ్డు విస్తరణతోపాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అదేశించారన్నారు. స్థానికంగా ఉన్న మల్లెచెరువును శుద్ధిచేయించడంతోపాటు మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి కృషిచేస్తామన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ స్థానికంగా ఒక హోటల్‌తోపాటు, దుకాణానికి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ జిల్లా నాయకుడు కొండల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, మాజీ ఎంపీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ స్పీకర్‌కు ఉద్యమ సెగ
మెదక్ టౌన్: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి మరోమారు జిల్లా కేంద్ర సాధన ఉద్యమ సెగ తగిలింది. శనివారం మెదక్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెదక్‌కు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్‌ని స్థానిక రాందాస్ చౌరస్తాలో ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపారు. అక్కడి నుంచి ఈడ్చివేశారు. అయినప్పటికీ ఉద్యమకారులు పట్టువదలకుండా ఒకరికొకరు పట్టుకొని గొలుసుగా ఏర్పడి కాన్వాయ్కి అడ్డుగా పడుకున్నారు. దీంతో చేసేది లేక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కారులోంచి దిగి దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎవరిని అడిగి టెంట్‌వేసి దీక్షలు చేపట్టారని ఆగ్రహించారు. దీంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరినడిగి చేశారంటూ ఉద్యమకారులు ఆమెను ప్రశ్నించారు. ఒక దశలో అసహనానికి గురైన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహిస్తూ మైక్‌లు పడేసి పోలీసుల సాయంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె వైఖరిని నిరసిస్తూ రెండు గంటలపాటు పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఓ వైపు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్, మెతుకు సీమ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
రైతు కుటుంబాలను ఆదుకుంటాం
రామాయంపేట: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె రామాయంపేటలో విలే కరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు సంబంధించి గతంలోఉన్న ప్యాకేజీకి అనుగుణంగా చర్యలు చేపడతామని, ఇందుకోసం సీఎం కేసీఆర్ సబ్‌కమిటీ నియమించారన్నారు. రైతు సంక్షేమంకోసం కృషి చేస్తామని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికిగాను ప్రతిపాదనలు తయారు చేసి సీఎంకు అందజేశామన్నారు. మెదక్- సిద్దిపేట రోడ్డు, వడియారం- మెదక్ రోడ్డు విస్తరణతోపాటు రూ.20 కోట్లతో ఇంటర్నల్ రోడ్లను మరమ్మతు చేయిస్తామన్నారు. మండలంలోని శివ్వాయపల్లి, సుతారిపల్లి, కోమటిపల్లి, తదితర గ్రామాల రహదార్లకు మహర్దశ పట్టనుందన్నారు. రామాయంపేటలోని మల్లెచెరువుకు మొదటి విడతలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. వ చ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల విషయమై ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. పాలమద్దతు ధర పెంపుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని, ఈవిషయమై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, ఎంపిటీసీ సభ్యులు శ్యాంసుందర్, మైసాగౌడ్, సర్పంచులు పాతూరి ప్రభావతి, సంగుస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, ఇతర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, నవాత్ కిరణ్ తదితతరులు పాల్గొన్నారు. -
ఘనపురానికి సింగూరు నీరు
మెదక్: సింగూర్ నీటికోసం ఘనపురం రైతులు గతంలోలాగా ఆందోళన బాట పట్టలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. కానీ సింగూరు నీరు మంజీరకు చేరుతోంది. ఆయకట్టు రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. రైతుల సాగునీటికష్టాలు ముందుగానే ఊహించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఘనపురం రైతుల గోడును ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజులుగా సాగునీటి విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా బుధవారం సాయంత్రం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీరకు వదిలారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. సాగునీటి కోసం ఏటా పోరాటమే 1905లో నిర్మించిన ఘనపురం ప్రాజెక్ట్ కింద సుమారు 30 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి న్యాయంగా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి సంవత్సరం పంట పొలాల అవసరాలకనుగుణంగా రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టాల్సి వచ్చేది. ఈ ఏడు ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో ఆగస్టు నెలలో 0.3 టీఎంసీల నీరు విడుదలైంది. అయినప్పటికీ ఘనపురం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండలేదు. ఉన్న నీటికి వరదనీరు, వర్షాలు తోడు కావడంతో సుమారు 20 వేల ఎకరాల్లో రైతన్నలు వరి పంటలు వేశారు. ఆగస్టు మధ్యలో కురిసిన అడపా దడపా వర్షాలతో వరి పంటలు ఇంతకాలం గట్టెక్కాయి. చాలాచోట్ల వరి పంట నిండు పొట్టతో ఉండగా, మరికొన్ని చోట్ల ఈనుతోంది. ఇంకొన్ని చోట్ల రెండో కలుపు దశలో ఉన్నాయి. అయితే వారంరోజులుగా పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రతి నీటిబొట్టుకోసం రాత్రింబవళ్లు పంట పొలాల వద్దే జాగరణ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు బుధవారం సాయంత్రం సింగూర్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీర బ్యారేజీలోకి వదిలారు. అక్కడి నుంచికూడా నేడో, రేపో ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేసే ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఇరిగేషన్ ఈఈ ఇచ్చిన ఉత్తర్వులు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు చేరగానే ఈ నీరు విడుదలవుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విడుదల చేసిన నీటికితోడు మరో 0.5 టీఎంసీ నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కుతామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అగ్రస్థానంలో నిలవాలి
మెదక్: చదువుల్లో..ఆటల్లో... వైజ్ఞానిక ప్రదర్శనలో ఇలా ఏ రంగంలోనైనా సరే అగ్రస్థానంలో నిలిచి మెతుకుసీమకు మంచి పేరు తేవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ పట్టణంలోని రాయల్ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెతుకు సీమలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి చిన్నారులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. విజ్ఞాన శాస్త్రం లేకపోతే జీవితమే లేదని, అందువల్ల బాల్యం నుంచే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయులు నవ తెలంగాణ నిర్మాణంలోనూ, విద్యాభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో అక్షరాస్యత పరంగా మెదక్ జిల్లాను మొదటిస్థానంలో ఉంచేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొన్ని రోజుల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఉపాధ్యాయులందరికీ ఒకే సర్వీస్ రూల్స్ వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా మహిళలంతా జరుపుకోవాలని సూచించారు. సోలార్ పవర్ వినియోగానికి ప్రజలంతా కృషి చేయాలని, దీంతో కరెంటు కొరతను చాలా వరకు నివారించవచ్చన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. గతంలో మెదక్ జిల్లా నుంచి 15 మంది జాతీయస్థాయి అవార్డులు పొందడం గమనార్హమన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సంకల్పం ఉండాలని సూచించారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషితో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుభాష్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇన్స్పైర్ ప్రారంభోత్సవంలో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు అతిథులను ఆకట్టుకున్నాయి. మెదక్ సిద్ధార్థ్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఇంటలిజెంట్ ట్రెయిన్ విత్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాక్ఫాల్ట్ డిటెక్టర్, సంగారెడ్డిలోని కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు రూపొందించిన హైటెక్ ఫార్మర్, తూప్రాన్ విద్యార్థులు తయారు చేసిన రైలు ప్రమాదాల నివారణ, కొల్చారం విద్యార్థులు తయారు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ ప్రాజెక్ట్‌లను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు అతిథులంతా ఆసక్తిగా తిలకించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్స్పైర్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాల, ఏపీఆర్ఎస్ మెదక్ తదితర పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, బతుకమ్మ ఆటలు, ఫోక్ డ్యాన్స్‌లు అందరినీ ఆలరించాయి. -
ఓటు వేసిన సునీతా, పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఆమె ఈరోజు ఉదయం ఓటు వేశారు. అలాగే మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేటలోని భరత్ నగర్లో ఓటు వేశారు. కాగా మెదక్ లోక్‌సభ ఎన్నికల బరిలో 14మంది అభ్యర్థులు ఉన్నారు. 15,43,700 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి గోమారంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామా చేసిన మెదక్ ఎంపీ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతను ఏడుగురు మంత్రులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ తరపున జగ్గారెడ్డి, కాంగ్రెస్ తరపున సునీత లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. -
వివక్షకు గురైన తెలంగాణ పండుగలు
తూప్రాన్: అరవై ఏళ్లుగా తెలంగాణలోని పండుగలు వివక్షకు గురయ్యాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్‌లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ తెలంగాణ బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సీమాంధ్రుల పాలనలో వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎలాగైతే ఉద్యమించామో అలాగే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆంజాగౌడ్, షఫీ, మన్నేశ్రీనివాస్, నరేష్, రాజు, సలాక రాజేశ్వర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. లయన్స సేవలు ఆదర్శనీయం మెదక్: ప్రపంచంలో సేవను మించిన సుగుణం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్‌క్లబ్ సేవలకు గుర్తింపు ఉందన్నారు. హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగానే లయన్స్ క్లబ్ సుమారు 2.50లక్షల మొక్కలు నాటడం హర్షనీయమన్నారు. రూ.2కోట్లతో వికలాంగులకు వివిధ రకాల పరికరాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత లయన్స్క్లబ్కే సొంతమన్నారు. లయన్స్ సేవలు చూస్తుంటే తనకు కూడా క్లబ్లో పూర్తిస్థాయి సేవాకార్యక్రమాలు చేపట్టాలనిపిస్తోందన్నారు. అంతకు ముందు పద్మాదేవేందర్‌రెడ్డి వికలాంగులకు వివిధ పరికరాలు అందజేశారు. అనంతరం లయన్స్‌క్లబ్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మల్టిపుల్ కౌన్సిల్ అధ్యక్షులు బాబురావు, జిల్లా గవర్నర్లు సునీతా ఆనంద్, జనార్దన్‌రెడ్డి, జిల్లా వైస్ ప్రథమ గవర్నర్ రాజ్‌కుమార్, 2వ వైస్ గవర్నర్ ఓబుల్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సురేందర్, కేబినెట్ కార్యదర్శి రమణరాజు, కోశాధికారి అమర్నాథ్రావు, లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా అధ్యక్షుడు రాంకిషన్, కార్యదర్శి నాగరాజుగౌడ్, కోశాధికారి శ్రీనివాస్‌తోపాటు సభ్యులు పాల్గొన్నారు. -
సింగూరు నీటి కోసం ఎదురుచూపులు
పాపన్నపేట: సింగూరు నీటి కోసం ఘనపురం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ నీటి జాడలేక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సింగూరు నుంచి 0.25 టీఎంసీల నీటిని వదిలారు. అయితే ఆ నీరు దిగువన ఉన్న కలబ్గూర్ డ్యాంలో నిల్వ ఉండిపోయాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఇరిగేషన్ అధికారులు 0.25 టీఎంసీ నీటిని దిగువకు వదిలినట్లు తెలిసింది. అయితే ఈనీరు 24గంటల తరువాతే ఘనపురం ఆనకట్టను చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీఈఈ సురేష్‌బాబు తెలిపారు. నాలుగు రోజులుగా చినుకులు జాడలేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాపన్నపేట మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. సింగూరు నీటిపై ఆశతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని రైతులు సైతం వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీంతో సింగూరు నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నాట్లు వేస్తేనే పంట దిగుబడి ఆశించినస్థాయిలో వస్తుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గిపోతుందని దిగాలుప డుతున్నారు. -
రేపు ఘనపురానికి సింగూరు నీరు
మెదక్: కరువు మేఘాలు కమ్ముకుని కర్షకులు కన్నీరు పెడుతున్న వేళ...సింగూర్ ప్రాజెక్టు నుంచిఘనపురం ఆనకట్టకు 0.20 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని ఇన్చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ బుధవారం సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో కార్తెలు కదలిపోతున్నప్పటికీ వరుణుడు కరుణించలేదు. ఘనపురం ఆనకట్ట కింద సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో కొంతమంది రైతులు తోటివారి బోర్ల సాయంతో వరి తుకాలు వేసుకున్నారు. అప్పటి నుండి చినుకు జాడే లేక పోవడంతో ఎండిపోతున్న వరి తుకాలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు చేసిన అప్పులు మీద పడనున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సింగూరు వద్ద ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించగా, ఘనపురం ఆయకట్టుకు సింగూర్ ప్రాజెక్టు నుంచినీటిని విడుదల చేయాలని డిప్యూటీ స్పీకర్‌తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు కోరారు. దీంతో స్పందించిన హరీష్‌రావు సింగూరు నుంచి ఘనపురం ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా వెంటనే స్పందించడంతో నీటి విడుదల చేయాలని సోమవారం జీఓ వెలువడింది. అయితే మంగళవారం రంజాన్ పండగ ఉండడంతో బుధవారం సింగూర్ నుంచి నీరు విడుదల చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఘనపురం ఆనకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడతల వారీగా వదిలేలా శాశ్వత జీఓ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
స్థానికంగానే ఉండాలి
మెదక్ రూరల్: వసతి గృహాల వార్డెన్లంతా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాలని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వసతి గృహాల వార్డెన్లు, అధికారులతో సలహాసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పోల్చుకుంటే వసతిగృహాల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదన్నారు. సరైన పర్యవేక్షణ, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించిన రోజునే వసతి గృహాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు. వసతిగృహాల్లో చేరే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారికి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత వార్డెన్లపైనే ఉందన్నారు. అందువల్ల వార్డెన్లంతా స్థానికంగా ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో తాను కూడా వసతిగృహాల్లో రాత్రిబస చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా వసతిగృహాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులుంటేనే..వసతి గృహాల మనుగడ తగిన సంఖ్యలో విద్యార్థులుంటేనే వసతి గృహాల మనుగడ సాగిస్తాయన్న సత్యాన్ని వార్డెన్లంతా గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బీసీ వసతిగృహాల్లో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు ఖాళీగా ఉన్నాయని మెదక్ బీసీడబ్ల్యూఓ రాంరెడ్డి డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకురాగా, ఆమె పై విధంగా స్పందించారు. వసతి గృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మెనూ ప్రకారం భోజనం పెడితే విద్యార్థులు ఎందుకు రారని ఆమె ప్రశ్నించారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సమష్టిగా కృషి చేసి వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వసతి గృహాల్లోని సమస్యలను ఆయా మండలాల వసతి గృహాల అధికారులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె పురాతన భవనాల మరమ్మత్తులకోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అలాగే అవసరమైన చోట నూతన భవనాలను నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్‌లతో పాటు నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు నాలుగు మండలాల వసతిగృహ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వసతిగృహ అధికారులు డిప్యూటీ స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. -
పదవికి వన్నె తెస్తా
శివ్వంపేట: తెలంగాణ అసెంబ్లీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడంతో పాటు పదవికి వన్నె తీసుకవస్తానని డిప్యూటీ స్వీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. దొంతి వేణుగోపాలస్వామి మహిమగల దేవుడని డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా వేణుగోపాలస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పద్మక్కగానే ఆదరించండి జిల్లా ప్రజల ప్రేమానురాగాల వల్లనే తెలంగాణ రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యానని, అందుకు జిల్లా ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటా నిని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిసున్నానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహ కారం, అండదండలు అవసరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. భారీ ర్యాలీ, సన్మానం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై మొదటి సారిగా జిల్లాకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలపూల్సింగ్ నాయకులు దేవేందర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూ ర్, కల్లూరి హరికృష్ణ, చంద్రాగౌడ్, పిట్ల సత్యనారాయణ, ఆనందరావు, నాగేశ్వర్రావు, లక్ష్మినర్సయ్య, మాధవరెడ్డి, అంజయ్య ఉన్నారు. అవమానాలను ఎదుర్కొన్నాం తూప్రాన్: సమైక్య రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ రకరకాల ఇబ్బందికరమైన జీఓల తో తెలంగాణలోని వనరులను దోచుకవెళ్లే విధంగా ఎన్నో ఎత్తుగడలు శాసన సభలో జరిగేవన్నారు. అప్పుడు శాసన సభ్యురాలిగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల స్వప్నం నేరవేరిందన్నారు. కల నేరవేరిన సందర్భంగా ప్రజలు స్వేచ్ఛా వాయివులు ఆ స్వాదిస్తూనే మరో వైపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. ప్రతి విషయంలోను ప్రతి పక్షాల సూచనలు, సలహాలు తీసుకుని శాసన సభ వ్యవహారాలు, సాంప్రదాయ బద్ధంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. శాసన సభలో రైతు రుణమాఫీపై సీఎం స్పష్టమైన హా మీ ఇచ్చారన్నారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయ న్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా శాసన సభలో ఏకగ్రీవం తీర్మానం చేశామన్నారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి తూప్రాన్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ ఆమెను సన్మానించారు. అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని సన్మానం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, నాగులపల్లిర్పంచ్ శ్రీలం యాదవ్, మధుసూదన్‌రెడ్డి, చంద్రారెడ్డి, షపీయొద్ధీన్ తదితురులు పాల్గొన్నారు. -
జెడ్పీటీసీ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా..
పోరుగడ్డ నుంచి వచ్చిన ఉద్యమబిడ్డ. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షే ఆశయంగా ముందుకు సాగిన ధీర వనిత. న్యాయవిద్య చదివి కోర్టు మెట్లెక్కినా, తనప్రాంతవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఉద్యమజెండా ఎత్తుకుని ముందుకు సాగిన వీరనారి. ఊరూవాడా ఏకం చేస్తూ తెలంగాణ ఉద్యమ పంథాను మార్చిన పడతి. లాఠీదెబ్బలుతిన్నా...జైలుకు వెళ్లినా పోరుబాట వీడని మహిళా నేత. ఆవిడే పద్మాదేవేందర్‌రెడ్డి. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి..తెలంగాణ తొలి శాసనసభ ఉప సభాపతిగా ఎదిగిన మెతుకుసీమ ముద్దబిడ్డపై ప్రత్యేత కథనం. మెదక్: జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరకు ఎదిగారు. శాసన సభ్యురాలిగా ప్రశ్నలడిగే స్థాయినుండి సభ నిర్వహించే వరకు ఎదిగి తన రాజకీయ పరిణతిని చాటారు. తెలంగాణ ఉద్యమంలో మెతుకు సీమ ఉద్యమకారులకు బాట చూపిన పద్మ అసలు సిసలైన పోరాట యోధురాలిగా వినుతికెక్కారు. ఆకాశంలో సగం..అవనిలో సగం అన్నట్లుగా అవకాశం ఇస్తే అతివలు అన్ని రంగాల్లో రాణిస్తారని చాటి చెప్పారు పద్మాదేవేందర్‌రెడ్డి. మెట్టినింటి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న పద్మ జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా నామాపూర్ గ్రామంలో 1969 జనవరి 06న జన్మించిన పద్మ ఇంటర్ వరకూ కరీంనగర్‌లోనే చదువుకున్నారు. ఈ క్రమంలోనే 1988లో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎం.దేవేందర్‌రెడ్డితో ఆమె వివాహం జరిగింది. భర్త దేవేందర్‌రెడ్డి న్యాయవాదిగా హైదరాబాద్‌లో స్థిరపడడంతో ఆమె కూడా హైదరాబాద్‌కు వచ్చేశారు. అనంతరం భర్త ప్రోత్సాహం మేరకు డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన దేవేందర్‌రెడ్డి రాజకీయాల్లో కూడా కొనసాగేవారు. కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆయన చేస్తున్న సేవలను చూసి పద్మాదేవేందర్‌రెడ్డి రాజకీయాల వైపు ఆకర్షితురాలయ్యారు. 2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మాదేవేందర్‌రెడ్డి, అదే ఏడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2004లో శాసనసభకు జెడ్పీటీసీగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందిన పద్మాదేవేందర్‌రెడ్డి 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రామాయంపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, టీడీపీ అభ్యర్థి మైనంపల్లి వాణి హన్మంతరావుపై విజయం సాధించారు. అప్పట్లో రామాయంపేట నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పద్మ తన గళమెత్తి ప్రజల వాణిని బలంగా వినిపించారు. ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 2007లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున టీడీపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈక్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనమయ్యాయి. దీంతో 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలని భావించారు. అయితే అప్పుడు మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ మెదక్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఇరుకునపడ్డారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రజల మద్దతు మేరకు స్వతంత్ర అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీచేసి 23,000 ఓట్లు సాధించారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై 39,600 ఓట్లతో మెదక్ నుంచి విజయం సాధించారు. పదవిలో ఉన్నా...లేకున్నా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే నాయకురాలిగా...పద్మ పేరుతెచ్చుకున్నారు. అందుకే ఆమెను చాలా మంది ప్రేమగా పద్మక్కా అని పిలుస్తారు. ఆ ప్రేమతోనే 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో పట్టం కట్టారు. -
జిల్లాకు రెండోసారి దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవి
సంగారెడ్డి డివిజన్: జిల్లాకు చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. తెలంగాణ శాసనసభ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. వెనువెంటనే ఆమె డిప్యూటీ స్పీకర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఇది రెండోపర్యాయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ స్పీకర్ పదవి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించారని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరును టీఆర్ఎస్ అధినేత పరిశీలించిన నాటి నుంచే పద్మాదేవేందర్‌రెడ్డి తన అయిష్టతను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ మహిళ, విద్యాధికారులైన పద్మాదేవేందర్‌రెడ్డికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిపై అంతగా ఆసక్తి చూపలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టడం వల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదని భావించిన ఆమె భావించారు. అయితే సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరునే ఖరారు చేయటంతో పద్మాదేవేందర్‌రెడ్డికి మరో మార్గం లేకుండాపోయింది. బుధవారం పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావటంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లాకు చెందిన మరో మంత్రి హరీష్‌రావు పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నికలో కీలకపాత్ర పోషించారు. ఆనందంగా ఉంది: పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గర్వంగా భావిస్తున్నారు. సభలో హుందాగా వ్యవహరించి శాసనసభా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా చూస్తానని, డిప్యూటీ స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఆమె పేర్కొన్నారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మ?
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. పద్మకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే అంశాన్ని టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభం రోజున ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఇద్దరి ఎన్నికపై హరీష్‌రావు ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిన పక్షంలో జిల్లాకు రెండోమారు శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినట్లు అవుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె.చంద్రశేఖర్‌రావు పనిచేశారు. పద్మ విముఖత శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవిపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆసక్తిగా లేరని ఆమె అనుచరులు చెబుతున్నారు. మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇస్తానని పేర్కొనటం గమనార్హం. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవిపై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒంటరిగానే టీఆర్ఎస్ పోటీ
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట, న్యూస్‌లైన్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు. కార్యకర్తలంతా అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ వచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశయ్య, కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, సాయిరెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థుల గెలపునకు ప్రణాళిక మెదక్‌టౌన్: టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవశం చేసుకుంటామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపుకోసం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. త్వరలో అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను కైవశం చేసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని గడప గడపకు వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టం సాధించారని కొనియాడారు. టీఆర్ఎస్కు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, వారి నిర్ణయం మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగాధర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సలాం, మండలఅధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు రాగి అశోక్, జీవన్ తదితరులు ఉన్నారు.