‘కారు’ జోరు | TRS Party Full Josh In 2018 Elections | Sakshi
Sakshi News home page

‘కారు’ జోరు

Published Sat, Nov 10 2018 6:42 PM | Last Updated on Sat, Nov 10 2018 7:12 PM

TRS Party Full Josh In 2018 Elections - Sakshi

ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థులు పదింటికి ఎనిమిది స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గజ్వేల్‌ నుంచి బరిలో నిలిచి గెలిచిన కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావు కీలకమైన నీటి పారుదల శాఖ మంత్రి పదవి చేపట్టారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కింది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పదమూడో శాసనసభ (2009–14)లో జిల్లాలో తిరుగులేని విజయం నమోదు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మలి విడత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014 జూలై రెండో తేదీని ప్రకటించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రాతిపదికనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను నారాయణఖేడ్, జహీరాబాద్‌ మినహా మిగతా ఎనిమిది సెగ్మెంట్లలోనూ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన చింతా ప్రభాకర్‌ (సంగారెడ్డి), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్‌), బాబూమోహన్‌ (అందోలు) తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.కిష్టారెడ్డి (æఖేడ్‌), జె.గీతారెడ్డి (జహీరాబాద్‌) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు.

అసెంబ్లీకి మళ్లీ కేసీఆర్‌..
1985 నుంచి 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్‌ 2004 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు దశాబ్దకాలం తర్వాత శాసన సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాలు సాధించడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్‌ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మహరెడ్డి భూపాల్‌రెడ్డి మరోమారు పార్టీ తరపున పోటీ చేశారు. హోరాహోరిగా సాగిన ఉప ఎన్నికల పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి సుమారు 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

మంత్రివర్గంలో హరీశ్‌..
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించిన తన్నీరు హరీష్‌రావుకు కేసీఆర్‌ మంత్రివర్గంలో ప్రధానమైన శాఖలు దక్కాయి. నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెదక్‌ నుంచి విజయం సాధించిన పద్మా దేవేందర్‌ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

 సైడ్‌ లైట్స్‌..
2004లో రామాయంపేట నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి, 2014లో మెదక్‌ నుంచి బరిలోకి దిగారు. మాజీ లోక్‌సభ సభ్యురాలు, సినీనటి విజయశాంతి మెదక్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. మెదక్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా పదవి స్వీకరించారు.  సిద్దిపేట నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా టి.హరీష్‌రావు వరుసగా ఐదో పర్యాయం బరిలో నిలిచి, కాంగ్రెస్‌ అభ్యర్థిపై 93వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించి రికార్డు సృష్టించారు. 

నర్సాపూర్‌ నుంచి వరుసగా మూడో పర్యాయం విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి పరాజయం పాలయ్యారు. ∙2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన చింత ప్రభాకర్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌లో చేరిన చింత ప్రభాకర్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జయప్రకాశ్‌రెడ్డిపై గెచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 

అందోలు నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించి, మంత్రిగా పనిచేసిన బాబూమోహన్‌ 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చివరి నిమిషంలో చేరి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు.  ఖేడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.కిష్టారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరీ విజయం సాధించారు. అయితే 2015 ఆగస్టులో గుండెపోటుతో కిష్టారెడ్డి మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. గతంలో గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి నియోజకర్గాల పునర్విభజన అనంతరం 2009, 14 ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి వరస విజయాలు సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement