సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు పోటీ చేయడానికి భయపడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కాలేజీ! సిద్దిపేట జిల్లా కేనా? అన్న కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు ఎక్కడుంది?. ఉద్యమంలో, అభివృద్ధిలో ముందున్న మనం మెజారిటీలో కూడా ముందుండాలి. మా ఊరు కూడా సిద్దిపేటలా! అనేలా సిద్దిపేటను తయారు చేసుకున్నాం. మీరు చూపించిన ఆత్మీయత, మీ ప్రేమతో నా బాధ్యత మరింత పెరుగుతుంది. త్వరలో సిద్దిపేటకు రైలు వస్తుంది.
వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మెడికల్ కాలేజీ సిద్దిపేటకు వస్తే వ్యతిరేకించిన కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఓట్లు అడుగుతారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 40 ఏండ్లలో జరిగే అభివృద్ధి 4 ఏండ్లలో జరిగింది. గడప గడపను కదిలించి ఓటింగ్ శాతం పెంచాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment