స్థానికంగానే ఉండాలి
మెదక్ రూరల్: వసతి గృహాల వార్డెన్‌లంతా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాలని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వసతి గృహాల వార్డెన్‌లు, అధికారులతో సలహాసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పోల్చుకుంటే వసతిగృహాల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదన్నారు. సరైన పర్యవేక్షణ, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించిన రోజునే వసతి గృహాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు. వసతిగృహాల్లో చేరే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారికి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత వార్డెన్‌లపైనే ఉందన్నారు. అందువల్ల వార్డెన్‌లంతా స్థానికంగా ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
రానున్న రోజుల్లో తాను కూడా వసతిగృహాల్లో రాత్రిబస చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా వసతిగృహాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులుంటేనే..వసతి గృహాల మనుగడ
తగిన సంఖ్యలో విద్యార్థులుంటేనే వసతి గృహాల మనుగడ సాగిస్తాయన్న సత్యాన్ని వార్డెన్‌లంతా గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
బీసీ వసతిగృహాల్లో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు ఖాళీగా ఉన్నాయని మెదక్ బీసీడబ్ల్యూఓ రాంరెడ్డి డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకురాగా, ఆమె పై విధంగా స్పందించారు. వసతి గృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మెనూ ప్రకారం భోజనం పెడితే విద్యార్థులు ఎందుకు రారని ఆమె ప్రశ్నించారు.
అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సమష్టిగా కృషి చేసి వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వసతి గృహాల్లోని సమస్యలను ఆయా మండలాల వసతి గృహాల అధికారులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె పురాతన భవనాల మరమ్మత్తులకోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
అలాగే అవసరమైన చోట నూతన భవనాలను నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్‌లతో పాటు నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు నాలుగు మండలాల వసతిగృహ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వసతిగృహ అధికారులు డిప్యూటీ స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.