మెదక్: చదువుల్లో..ఆటల్లో... వైజ్ఞానిక ప్రదర్శనలో ఇలా ఏ రంగంలోనైనా సరే అగ్రస్థానంలో నిలిచి మెతుకుసీమకు మంచి పేరు తేవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ పట్టణంలోని రాయల్ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెతుకు సీమలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి చిన్నారులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
విజ్ఞాన శాస్త్రం లేకపోతే జీవితమే లేదని, అందువల్ల బాల్యం నుంచే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయులు నవ తెలంగాణ నిర్మాణంలోనూ, విద్యాభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో అక్షరాస్యత పరంగా మెదక్ జిల్లాను మొదటిస్థానంలో ఉంచేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొన్ని రోజుల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉపాధ్యాయులందరికీ ఒకే సర్వీస్ రూల్స్ వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా మహిళలంతా జరుపుకోవాలని సూచించారు. సోలార్ పవర్ వినియోగానికి ప్రజలంతా కృషి చేయాలని, దీంతో కరెంటు కొరతను చాలా వరకు నివారించవచ్చన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. గతంలో మెదక్ జిల్లా నుంచి 15 మంది జాతీయస్థాయి అవార్డులు పొందడం గమనార్హమన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సంకల్పం ఉండాలని సూచించారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషితో ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుభాష్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఇన్‌స్పైర్ ప్రారంభోత్సవంలో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్‌లు అతిథులను ఆకట్టుకున్నాయి. మెదక్ సిద్ధార్థ్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఇంటలిజెంట్ ట్రెయిన్ విత్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాక్‌ఫాల్ట్ డిటెక్టర్, సంగారెడ్డిలోని కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు రూపొందించిన హైటెక్ ఫార్మర్, తూప్రాన్ విద్యార్థులు తయారు చేసిన రైలు ప్రమాదాల నివారణ, కొల్చారం విద్యార్థులు తయారు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ ప్రాజెక్ట్‌లను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు అతిథులంతా ఆసక్తిగా తిలకించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఇన్‌స్పైర్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాల, ఏపీఆర్‌ఎస్ మెదక్ తదితర పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, బతుకమ్మ ఆటలు, ఫోక్ డ్యాన్స్‌లు అందరినీ ఆలరించాయి.
అగ్రస్థానంలో నిలవాలి
Published Thu, Sep 18 2014 12:39 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement