Inspire Exhibition
-
ఔను ఇతడు ‘ఇన్స్పైర్’
టాప్ లేపిన అంధ విద్యార్థి బహుళ వినియోగ బ్రెరుులీ రైటింగ్ సిస్టమ్ నమూనా రూపకల్పన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో మొదటి స్థానం పెదవాల్తేరు(విశాఖపట్నం) : కళ్లు లేకుంటేనేం.. తన కల నిజం చేసుకున్నాడా అంధ విద్యార్థి. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక పోటీలో మొదటి స్థానం కొట్టేశాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఏబీఎం హైస్కూల్‌కు చెందిన ఆర్పీ సారథిరెడ్డి ఆవిష్కరణ అందరినీ అబ్బురపరిచింది. సాధారణ అట్టపై అంధులకు అర్ధమయ్యే రీతిలో రాసే విధానాన్ని రూపొంచాడీ విద్యార్థి. తాను తయారుచేసిన బహుళ వినియోగ బ్రెయిలీ రైటింగ్ సిస్టం నమూనాను విశాఖలో ప్రదర్శించాడు. ఈ నమూనాను రూపొందించేందుకు సాదాసీదా అట్ట మాత్రమే వినియోగించటం విశేషం. అట్టకు క్రమపద్ధతిలో రంధ్రాలు చేశాడు. అట్ట క్లిప్‌కు పేపర్ పెట్టి హోల్స్ ద్వారా చేతులతో తడుముకుని అవసరమైన పదాలను రాయొచ్చని ప్రయోగాత్మంగా నిరూపించాడు. తన ఆలోచనలకు రూపమిచ్చానని.. మొదటి స్థానంలో నిలవటం సంతోషంగా ఉందని సారథిరెడ్డి చెప్పాడు. -
‘ఇన్స్పైరింగ్’ చిల్డ్రన్
పుస్తకం చదువుకుంటూ.. టీవీ చూసుకుంటూ వాషింగ్ మెషీన్లో బట్టలుతకొచ్చు. పైసా విద్యుత్ కూడా ఖర్చుకాదు. వోల్వో బస్సులో మంటలంటుకున్నాయి. ఎర్రదీపాలు వెలిగి అలారం మోగింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. అంతా క్షేమంగా కిందకు దిగిపోయారు. అంధ విద్యార్థుల కోసం స్నేక్ అండ్ లాడర్ ఉంది. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. అద్భుతమైన ఈ ప్రాజెక్టులను రూపొందించింది బాల మేధావులు. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో ప్రారంభమైంది. ఆరు జిల్లాల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బట్టలు శుభ్రం...ఒంటికి వ్యాయామం మా సార్ కె.రవికుమార్ సహాయం తో పెడల్ పవర్ వాషిం గ్ మెషీన్‌ను తయారు చే శాను. పల్లెటూర్లలో తల్లిదండ్రులిద్దరు పొ లాలకు వెళ్లిపోతే ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలకు అప్పగించేస్తారు. కొందరు ఇంట్లో పనుల కోసమే చదువులు మానేస్తుంటారు. అది ఆలోచించి ఈ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశాను. దీనివల్ల స్థూలకాయులకు మంచి వ్యాయా మం అవుతుంది. బట్టలుతకడం సులభమవుతుంది. -కె.సురేష్, ఆరో తరగతి, కె.గంగవరం, తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ సమస్యకు చక్కని పరిష్కారం ప్రస్తుతం ట్రాఫిక్, పార్కింగ్ సమస్య బాగా పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ, లండన్, అమెరికాలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. ఆ విధానం స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేశాను. పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తే వాహనాల పార్కింగ్‌కు చాలాసేపు నిరీక్షిం చాల్సి వస్తోంది. అండర్ గ్రౌండ్ పార్కింగ్తో ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీనికి మా టీచర్ సత్యవేణి ఎంతో సహాయం చేశారు. - పి.జ్యోత్స్న, ఎనిమిదో తరగతి, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా సురక్షిత బస్సు ప్రయాణం టెన్త్ క్లాస్ చదువుతున్నాను. బస్సులో అగ్ని ప్రమాదాలను నివారించే ప్రాజెక్ట్‌ను మా సార్ డి.రవికుమార్ సహకారంతో తయారు చేశాను. బస్సులో సెన్సార్లు, ఎమర్జెన్సీ తలుపులను ఏర్పాటు చేయాలి. మంటలు చెలరేగితే పొగలు వస్తాయి. పొగ సెన్సార్‌ను తాకగానే డ్రయివర్, ప్రయాణికుల దగ్గర ఎర్రదీపాలు వెలిగి అలారం మోగుతుంది. తలుపులు కూడా ఆటోమెటిక్‌గా తెరుచుకుంటా యి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ట్రైమిథేన్ ట్రైమిథైల్ గ్లైకాల్ అనే రసాయనాన్ని ఉంచాలి. అప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడతారు. - రాజరాజేశ్వరి, పదో తరగతి, కైకలూరు, కృష్ణాజిల్లా. పవర్ పార్క్ పార్కులో పిల్లలు జారుడు బల్లలపై నుంచి జారుతుంటారు. వాళ్లు జారుతున్నప్పుడు కలిగిన ఒత్తిడికి విద్యుదుత్పత్తి అవుతుంది. పైపులోంచి నీరు మొక్కలకు సరఫరా అవుతుంది... ఇది సాధ్యమేనా అంటారా?.. సాధ్యమేనని నిరూపించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న నవ్య. తన ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి, టీచర్ దివ్య ప్రత్యూష సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకోసం డైనమోలను ఉపయోగించింది. అంధుల కోసం స్నేక్ అండ్ లాడర్ అంధులు కూడా స్నేక్ అండ్ లాడర్ ఆడొచ్చు. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. పశ్చమగోదావరి జిల్లా నర్సపురానికి చెందిన ఆర్.పార్థసారధిరెడ్డి ఈ పరికరాన్ని ప్రదర్శించి ప్రశంసలందుకున్నాడు. దీని తయారీలో తన టీచర్ వి.రాజేష్ పూర్తి సహకారాన్ని అందించారని చెప్పాడు. -
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి
తిరుచానూరు : దేశాభివృద్ధిలో విద్యార్థులు, యువకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. తిరుపతి ఎంజీఎం ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాల్యంలోనే మేధావులుగా తీర్చిదిద్దేందుకు ఇన్స్పైర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యావిధానంలో మార్పు తీసుకురానున్నట్లు తెలిపారు. ఆడియో, వీడియో లెర్నింగ్ పద్ధతిని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ స్థాయి ఇన్స్పై ర్ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌కు ఏడు జిల్లాల నుంచి విద్యార్థులు, గైడ్‌టీచర్లు పాల్గొని వారు రూపొందించిన ప్రయోగాత్మక నమూనాలను ప్రదర్శించారు. ఈ నమూనాలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు 24 ఉత్తమ నమూనాలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. వారిలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి ఎస్‌ఎంఎస్‌వో హైస్కూల్ విద్యార్థి ఎస్కే.మౌలాఅలీ(బీ.రాధాకృష్ణ), నెల్లూరు శ్రీనగర్ కాలనీ వోవల్ స్కూల్ విద్యార్థినీ ఎన్.సంజన, సంగం-తరునవాయి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జీ.రామ్‌బాబు, సూళూరుపేట-రంగన్నపట్టెడ జెడ్పీపీ హెచ్ఎస్ విద్యార్థి జీ.నాగరాజు ఉన్నారు. ion -
అగ్రస్థానంలో నిలవాలి
మెదక్: చదువుల్లో..ఆటల్లో... వైజ్ఞానిక ప్రదర్శనలో ఇలా ఏ రంగంలోనైనా సరే అగ్రస్థానంలో నిలిచి మెతుకుసీమకు మంచి పేరు తేవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ పట్టణంలోని రాయల్ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెతుకు సీమలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి చిన్నారులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. విజ్ఞాన శాస్త్రం లేకపోతే జీవితమే లేదని, అందువల్ల బాల్యం నుంచే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయులు నవ తెలంగాణ నిర్మాణంలోనూ, విద్యాభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో అక్షరాస్యత పరంగా మెదక్ జిల్లాను మొదటిస్థానంలో ఉంచేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొన్ని రోజుల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఉపాధ్యాయులందరికీ ఒకే సర్వీస్ రూల్స్ వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా మహిళలంతా జరుపుకోవాలని సూచించారు. సోలార్ పవర్ వినియోగానికి ప్రజలంతా కృషి చేయాలని, దీంతో కరెంటు కొరతను చాలా వరకు నివారించవచ్చన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. గతంలో మెదక్ జిల్లా నుంచి 15 మంది జాతీయస్థాయి అవార్డులు పొందడం గమనార్హమన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సంకల్పం ఉండాలని సూచించారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషితో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుభాష్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇన్స్పైర్ ప్రారంభోత్సవంలో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు అతిథులను ఆకట్టుకున్నాయి. మెదక్ సిద్ధార్థ్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఇంటలిజెంట్ ట్రెయిన్ విత్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాక్ఫాల్ట్ డిటెక్టర్, సంగారెడ్డిలోని కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు రూపొందించిన హైటెక్ ఫార్మర్, తూప్రాన్ విద్యార్థులు తయారు చేసిన రైలు ప్రమాదాల నివారణ, కొల్చారం విద్యార్థులు తయారు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ ప్రాజెక్ట్‌లను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు అతిథులంతా ఆసక్తిగా తిలకించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్స్పైర్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాల, ఏపీఆర్ఎస్ మెదక్ తదితర పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, బతుకమ్మ ఆటలు, ఫోక్ డ్యాన్స్‌లు అందరినీ ఆలరించాయి. -
ఇన్‌స్పైర్‌లో టీడీపీ సొంత డబ్బా!
తిరుచానూరు : సొంత డబ్బా కొట్టుకునేందుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ వేదికయింది. వంద రోజుల పాలన గురించి మంత్రి ప్రభుత్వాన్ని, సీఎం ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చివేశారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి సొంత డబ్బాకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మంత్రి వర్గం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎటువంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకునే నేర్పు సీఎం చంద్రబాబుకే సొంతమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుడుతున్నారని, అవినీతి రహిత రాష్ట్రంగా, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ఆయన నిర్విరామంగా పనిచేస్తున్నారని, అలాగే అధికారులతో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. భోజనాలు లేక అవస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభిం చారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే అధికారుల చేతకానితనం వల్ల ఎగ్జిబిషన్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనాలు అందక అవస్థలు పడ్డారు. దీనికి తోడు మంత్రి ఆలస్యంగా రావడం, సమావేశం పూర్తవ్వడానికి మధ్యాహ్నం ఒంటిగంట పైగా కావడంతో ఇబ్బం దులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం 3 గం టలైనా భోజనాలు చాలా మందికి అందలేదు. దీంతో పలువురు హోటల్స్‌లో తినాల్సి వచ్చిం ది. దీనికి తోడు ఒకే ప్రాంతంలో అన్నం వడ్డిం చడం, అక్కడే తినాల్సి రావడంతో తొలిరోజే అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఆటవిడుపు కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు, నటుడు శాంబోలా హరినాథ్ మిమి క్రీ, కీలుగుర్రం ప్రదర్శనలు అలరించాయి. వేదికంతా పసుపు చొక్కాలే ప్రభుత్వ కార్యక్రమమైన ఇన్‌స్పైర్‌కు పసుపు రంగు అంటుకుంది. వేదికపై మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు టీడీపీ నాయకులను ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంతో విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారు. ఇరుకైన గదుల్లో నమూనాలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఇరుకైన గదుల్లో ఏర్పాటుచేశారు. దీంతో విద్యార్థులు తమ నమూనాలను ఇరుకైన గదుల్లోనే ఏర్పాటుచేసుకున్నారు. పట్టుమని పది మంది సందర్శకులు నమూనాలను తిలకించలేని పరిస్థితి ఎదురయ్యింది. దీనికి తోడు వర్షం కురవడంతో పాఠశాల ఆవరణం బురదమయంగా మారింది.