‘ఇన్‌స్పైరింగ్’ చిల్డ్రన్
పుస్తకం చదువుకుంటూ.. టీవీ చూసుకుంటూ వాషింగ్ మెషీన్‌లో బట్టలుతకొచ్చు. పైసా విద్యుత్ కూడా ఖర్చుకాదు. వోల్వో బస్సులో మంటలంటుకున్నాయి. ఎర్రదీపాలు వెలిగి అలారం మోగింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. అంతా క్షేమంగా కిందకు దిగిపోయారు. అంధ విద్యార్థుల కోసం స్నేక్ అండ్ లాడర్ ఉంది. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. అద్భుతమైన ఈ ప్రాజెక్టులను రూపొందించింది బాల మేధావులు. సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్లో శనివారం ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో ప్రారంభమైంది. ఆరు జిల్లాల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
బట్టలు శుభ్రం...ఒంటికి వ్యాయామం
మా సార్ కె.రవికుమార్ సహాయం తో పెడల్ పవర్ వాషిం గ్ మెషీన్‌ను తయారు చే శాను. పల్లెటూర్లలో తల్లిదండ్రులిద్దరు పొ లాలకు వెళ్లిపోతే ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలకు అప్పగించేస్తారు. కొందరు ఇంట్లో పనుల కోసమే చదువులు మానేస్తుంటారు. అది ఆలోచించి ఈ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశాను. దీనివల్ల స్థూలకాయులకు మంచి వ్యాయా మం అవుతుంది. బట్టలుతకడం సులభమవుతుంది.
-కె.సురేష్, ఆరో తరగతి, కె.గంగవరం, తూర్పుగోదావరి జిల్లా
ట్రాఫిక్ సమస్యకు చక్కని పరిష్కారం
ప్రస్తుతం ట్రాఫిక్, పార్కింగ్ సమస్య బాగా పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ, లండన్, అమెరికాలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. ఆ విధానం స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేశాను. పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తే వాహనాల పార్కింగ్‌కు చాలాసేపు నిరీక్షిం చాల్సి వస్తోంది. అండర్ గ్రౌండ్ పార్కింగ్‌తో ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీనికి మా టీచర్ సత్యవేణి ఎంతో సహాయం చేశారు.
- పి.జ్యోత్స్న, ఎనిమిదో తరగతి, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా
సురక్షిత బస్సు ప్రయాణం
టెన్త్ క్లాస్ చదువుతున్నాను. బస్సులో అగ్ని ప్రమాదాలను నివారించే ప్రాజెక్ట్‌ను మా సార్ డి.రవికుమార్ సహకారంతో తయారు చేశాను. బస్సులో సెన్సార్లు, ఎమర్జెన్సీ తలుపులను ఏర్పాటు చేయాలి. మంటలు చెలరేగితే పొగలు వస్తాయి. పొగ సెన్సార్‌ను తాకగానే డ్రయివర్, ప్రయాణికుల దగ్గర ఎర్రదీపాలు వెలిగి అలారం మోగుతుంది. తలుపులు కూడా ఆటోమెటిక్‌గా తెరుచుకుంటా యి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ట్రైమిథేన్ ట్రైమిథైల్ గ్లైకాల్ అనే రసాయనాన్ని ఉంచాలి. అప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడతారు.
- రాజరాజేశ్వరి, పదో తరగతి, కైకలూరు, కృష్ణాజిల్లా.
పవర్ పార్క్
పార్కులో పిల్లలు జారుడు బల్లలపై నుంచి జారుతుంటారు. వాళ్లు జారుతున్నప్పుడు కలిగిన ఒత్తిడికి విద్యుదుత్పత్తి అవుతుంది. పైపులోంచి నీరు మొక్కలకు సరఫరా అవుతుంది... ఇది సాధ్యమేనా అంటారా?.. సాధ్యమేనని నిరూపించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న నవ్య. తన ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి, టీచర్ దివ్య ప్రత్యూష సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకోసం డైనమోలను ఉపయోగించింది.
అంధుల కోసం స్నేక్ అండ్ లాడర్
అంధులు కూడా స్నేక్ అండ్ లాడర్ ఆడొచ్చు. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. పశ్చమగోదావరి జిల్లా నర్సపురానికి చెందిన ఆర్.పార్థసారధిరెడ్డి ఈ పరికరాన్ని ప్రదర్శించి ప్రశంసలందుకున్నాడు. దీని తయారీలో తన టీచర్ వి.రాజేష్ పూర్తి సహకారాన్ని అందించారని చెప్పాడు.