జెడ్పీటీసీ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా..
పోరుగడ్డ నుంచి వచ్చిన ఉద్యమబిడ్డ. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షే ఆశయంగా ముందుకు సాగిన ధీర వనిత. న్యాయవిద్య చదివి కోర్టు మెట్లెక్కినా, తనప్రాంతవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఉద్యమజెండా ఎత్తుకుని ముందుకు సాగిన వీరనారి. ఊరూవాడా ఏకం చేస్తూ తెలంగాణ ఉద్యమ పంథాను మార్చిన పడతి. లాఠీదెబ్బలుతిన్నా...జైలుకు వెళ్లినా పోరుబాట వీడని మహిళా నేత. ఆవిడే పద్మాదేవేందర్‌రెడ్డి. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి..తెలంగాణ తొలి శాసనసభ ఉప సభాపతిగా ఎదిగిన మెతుకుసీమ ముద్దబిడ్డపై ప్రత్యేత కథనం.
మెదక్: జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరకు ఎదిగారు. శాసన సభ్యురాలిగా ప్రశ్నలడిగే స్థాయినుండి సభ నిర్వహించే వరకు ఎదిగి తన రాజకీయ పరిణతిని చాటారు. తెలంగాణ ఉద్యమంలో మెతుకు సీమ ఉద్యమకారులకు బాట చూపిన పద్మ అసలు సిసలైన పోరాట యోధురాలిగా వినుతికెక్కారు. ఆకాశంలో సగం..అవనిలో సగం అన్నట్లుగా అవకాశం ఇస్తే అతివలు అన్ని రంగాల్లో రాణిస్తారని చాటి చెప్పారు పద్మాదేవేందర్‌రెడ్డి. మెట్టినింటి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న పద్మ జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా నామాపూర్ గ్రామంలో 1969 జనవరి 06న జన్మించిన పద్మ ఇంటర్ వరకూ కరీంనగర్‌లోనే చదువుకున్నారు. ఈ క్రమంలోనే 1988లో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎం.దేవేందర్‌రెడ్డితో ఆమె వివాహం జరిగింది. భర్త దేవేందర్‌రెడ్డి న్యాయవాదిగా హైదరాబాద్‌లో స్థిరపడడంతో ఆమె కూడా హైదరాబాద్‌కు వచ్చేశారు.
అనంతరం భర్త ప్రోత్సాహం మేరకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన దేవేందర్‌రెడ్డి రాజకీయాల్లో కూడా కొనసాగేవారు. కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆయన చేస్తున్న సేవలను చూసి పద్మాదేవేందర్‌రెడ్డి రాజకీయాల వైపు ఆకర్షితురాలయ్యారు. 2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన పద్మాదేవేందర్‌రెడ్డి, అదే ఏడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు.
2004లో శాసనసభకు
జెడ్పీటీసీగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందిన పద్మాదేవేందర్‌రెడ్డి 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రామాయంపేట నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, టీడీపీ అభ్యర్థి మైనంపల్లి వాణి హన్మంతరావుపై విజయం సాధించారు. అప్పట్లో రామాయంపేట నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పద్మ తన గళమెత్తి ప్రజల వాణిని బలంగా వినిపించారు.
ఉద్యమ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 2007లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున టీడీపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈక్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనమయ్యాయి. దీంతో 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలని భావించారు.
అయితే అప్పుడు మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్ మెదక్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఇరుకునపడ్డారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రజల మద్దతు మేరకు స్వతంత్ర అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీచేసి 23,000 ఓట్లు సాధించారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై 39,600 ఓట్లతో మెదక్ నుంచి విజయం సాధించారు. పదవిలో ఉన్నా...లేకున్నా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే నాయకురాలిగా...పద్మ పేరుతెచ్చుకున్నారు. అందుకే ఆమెను చాలా మంది ప్రేమగా పద్మక్కా అని పిలుస్తారు. ఆ ప్రేమతోనే 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో పట్టం కట్టారు.