మెదక్: సింగూర్ నీటికోసం ఘనపురం రైతులు గతంలోలాగా ఆందోళన బాట పట్టలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. కానీ సింగూరు నీరు మంజీరకు చేరుతోంది. ఆయకట్టు రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. రైతుల సాగునీటికష్టాలు ముందుగానే ఊహించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఘనపురం రైతుల గోడును ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజులుగా సాగునీటి విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా బుధవారం సాయంత్రం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీరకు వదిలారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు.
సాగునీటి కోసం ఏటా పోరాటమే
1905లో నిర్మించిన ఘనపురం ప్రాజెక్ట్ కింద సుమారు 30 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి న్యాయంగా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి సంవత్సరం పంట పొలాల అవసరాలకనుగుణంగా రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టాల్సి వచ్చేది. ఈ ఏడు ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు.
ఎట్టకేలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో ఆగస్టు నెలలో 0.3 టీఎంసీల నీరు విడుదలైంది. అయినప్పటికీ ఘనపురం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండలేదు. ఉన్న నీటికి వరదనీరు, వర్షాలు తోడు కావడంతో సుమారు 20 వేల ఎకరాల్లో రైతన్నలు వరి పంటలు వేశారు. ఆగస్టు మధ్యలో కురిసిన అడపా దడపా వర్షాలతో వరి పంటలు ఇంతకాలం గట్టెక్కాయి. చాలాచోట్ల వరి పంట నిండు పొట్టతో ఉండగా, మరికొన్ని చోట్ల ఈనుతోంది. ఇంకొన్ని చోట్ల రెండో కలుపు దశలో ఉన్నాయి. అయితే వారంరోజులుగా పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది.
దీంతో రైతులు ప్రతి నీటిబొట్టుకోసం రాత్రింబవళ్లు పంట పొలాల వద్దే జాగరణ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు బుధవారం సాయంత్రం సింగూర్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీర బ్యారేజీలోకి వదిలారు. అక్కడి నుంచికూడా నేడో, రేపో ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేసే ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఇరిగేషన్ ఈఈ ఇచ్చిన ఉత్తర్వులు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు చేరగానే ఈ నీరు విడుదలవుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విడుదల చేసిన నీటికితోడు మరో 0.5 టీఎంసీ నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కుతామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఘనపురానికి సింగూరు నీరు
Published Wed, Sep 24 2014 11:48 PM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Advertisement