డిప్యూటీ స్పీకర్‌గా పద్మ?
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. పద్మకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే అంశాన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభం రోజున ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
టీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఇద్దరి ఎన్నికపై హరీష్‌రావు ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిన పక్షంలో జిల్లాకు రెండోమారు శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినట్లు అవుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె.చంద్రశేఖర్‌రావు పనిచేశారు.
పద్మ విముఖత
శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవిపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆసక్తిగా లేరని ఆమె అనుచరులు చెబుతున్నారు. మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇస్తానని పేర్కొనటం గమనార్హం. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవిపై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.