డిప్యూటీ స్పీకర్‌కు ఉద్యమ సెగ
మెదక్ టౌన్: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి మరోమారు జిల్లా కేంద్ర సాధన ఉద్యమ సెగ తగిలింది. శనివారం మెదక్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెదక్‌కు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్‌ని స్థానిక రాందాస్ చౌరస్తాలో ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపారు. అక్కడి నుంచి ఈడ్చివేశారు. అయినప్పటికీ ఉద్యమకారులు పట్టువదలకుండా ఒకరికొకరు పట్టుకొని గొలుసుగా ఏర్పడి కాన్వాయ్‌కి అడ్డుగా పడుకున్నారు. దీంతో చేసేది లేక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కారులోంచి దిగి దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎవరిని అడిగి టెంట్‌వేసి దీక్షలు చేపట్టారని ఆగ్రహించారు.
దీంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరినడిగి చేశారంటూ ఉద్యమకారులు ఆమెను ప్రశ్నించారు. ఒక దశలో అసహనానికి గురైన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహిస్తూ మైక్‌లు పడేసి పోలీసుల సాయంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె వైఖరిని నిరసిస్తూ రెండు గంటలపాటు పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
అనంతరం జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఓ వైపు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్, మెతుకు సీమ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.