Conway
-
టీడీపీ నేతల్లో వణుకు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన టీడీపీ దాడిని తిరుపతి అర్బన్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనలో పాల్గొ న్న టీడీపీ ముఖ్య నాయకుల్ని విడతల వారీగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. దీంతో నగర టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు కలవరానికి లోనవుతున్నారు. కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే 15 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. ఘటనలో పాల్గొన్న 40 మంది టీడీపీ నాయకులు, వార్డు స్థాయి నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని వ్యక్తిగతంగా విచారణ జరుపుతున్నారు సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి క్రైం : తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చిన అమిత్ షా ఈ నెల 11న ఉదయం దర్శనం పూర్తిచేసుకుని కొండ దిగుతుండగా అలిపిరి దగ్గర కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపారు. కాన్వాయ్‌లో ఉన్న బీజేపీ నేత కోలా ఆనంద్ కారు అద్దాలను పగులగొట్టి ఉద్రిక్తత సృష్టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి చేయ డం జాతీయ స్థాయిలో సంచలనమైంది. మరుసటి రోజు ప్రధాన పత్రికలన్నీ దాడి జరిగిన తీరును, బీజేపీ నేతల ఖండనలనూ ప్రముఖంగా ప్రచురించాయి. కేంద్ర ఇంటెలిజెన్సు ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై తిరుపతి అర్బన్ పోలీసుల్ని నివేదిక కోరారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుని కాన్వాయ్‌పై దాడి జరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఏపీ పోలీస్ బాస్‌లు ప్రశ్నించారు. దీంతో తిరుపతి అర్బన్ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అదే రోజున కాన్వాయ్ పై కర్రతో దాడికి పాల్పడిన సుబ్రమణ్యయాదవ్ అనే టీడీపీ నాయకుడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అతనిపై కేసు నమోదు చేశారు. తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో అలిపిరి సీఐ చంద్రశేఖర్ నాయకుల విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా.... సంఘటన జరిగిన 11వ తేదీ అలిపిరి నిరసనలో పాల్గొన్న టీ డీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో టీటీడీ అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలు, మీడియా ప్రచురించిన ఫోటోలు, టీవీ ఛానళ్ల వీడియోలలో కనిపించిన నగర పార్టీ నేతల పేర్లను నమోదు చేసుకుని విడతల వారీగా స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌నాయుడు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, ఎమ్మెల్యే అల్లుడు సంజయ్‌లను ప్రధాన నాయకులుగా గుర్తించారు. వీరి నేతృత్వంలోనే పార్టీ కార్యకర్తలు ఆ రోజున నిరసనకు హాజరైనట్లు పోలీసులు సమాచారం తెప్పించుకున్నారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు దాడి జరిపేందుకు కర్రలు, రాళ్లు వాడారా లేదానన్న అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి సమీక్షిస్తున్నారు. బాధ్యులపై కేసులు ఖాయం అమిత్ షా కాన్వాయ్‌లో వెనుక ఉన్న వాహనంపై కర్రతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యాన్ని ఆ రోజే అరెస్టు చేశాం. దాడికి దారితీసిన పరిస్థితులు, ఎవరెవరి పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే చాలా మందిని విచారించాం. నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ, తిరుపతి -
కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లా సెగ
కాన్వాయిపై రాళ్లు రువ్విన అడ్వకేట్ జేఏసీ నాయకులు ఎల్లారెడ్డిపేట: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లె వద్ద మంత్రి కేటీఆర్ పర్యటనను సిరిసిల్ల జిల్లా డిమాండ్‌తో అడ్వకేట్ జేఏసీ నాయకులు అడ్డుకోవడం, రాళ్లదాడితో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో ఆర్మీ పోలీస్ వ్యానుతో పాటు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ ఎలుసాని సుజాత వాహనం ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. వరదలతో ఎగువ మానేరు జలకళ సంతరించుకోగా మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం జలాశయూన్ని సందర్శించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు వస్తున్న క్రమంలో మల్లుపల్లె వద్ద దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి పరిశీలించి తిరిగి వెళ్తుండగా, న్యాయవాద జేఏసీ నాయకులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హామీ ఇవ్వాలని, లేకుంటే కదలనిచ్చేది లేదని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి వాహనానికి అడ్డుగా కూర్చోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు మంత్రి కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. -
నగరంలో కాన్వాయ్ కష్టాలు
వారంలో నాలుగు రోజులు నగరంలోనే సీఎం పెరిగిన వీఐపీల తాకిడి గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్ నరకం చూస్తున్న నగరవాసులు నగరంలో అసలే ఎక్కడ చూసినా ట్రాఫికర్. ఒక్కో సిగ్నల్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరితే అనుకున్న సమయానికి అనుకున్న చోటికి వెళతామనే గ్యారంటీ లేదు. విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక నానా పాట్లు పడుతున్నారు. దీనికితోడు ఇప్పుడు సీఎం చంద్రబాబు నగరంలో మకాం వేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నారు. ఇక రోడ్ల వెంట కాన్వాయ్‌లే కాన్వాయ్‌లు. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో జనం కష్టాలు వర్ణనాతీతం. విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి నాలుగు రోజులు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మకాం ఉంటున్నారు. ఆయనతో పాటు, ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల రాకపోకలతో గత నెల రోజులుగా నగరానికి వీఐపీల తాకిడి పెరిగింది. అందుకు తగ్గట్టు రాజధాని స్థాయిలో నగరంలో రోడ్లు, ఇతర సౌకర్యాలు ప్రొటోకాల్, సెక్యూరిటీ, అధికారులు లేకపోవటంతో సామాన్య జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది. కాన్వాయ్‌లే కాన్వాయ్‌లు... సీఎం రాకతో ముఖ్య శాఖల అధికారులు నగరంలో మకాం వేస్తున్నారు. సీఎం ప్రొటోకాల్ చూసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) లేకపోవటంతో ఆ విధులను నగరంలో ఉన్న వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ప్రతి నిత్యం వీఐపీల కాన్వాయ్‌ల రాకపోకలతో నగరంలోని బందరు రోడ్డులో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సీఎం నగరంలో ఉన్నారంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజుకు రెండు మూడు సార్లు బందర్ రోడ్డులో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం బయటకు వెళ్లి రావటంతో ఆ మార్గంలో జనం ట్రాఫిక్ అవస్థలతో చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన కాన్వాయ్ వెళ్లే ముందు గంట నుంచి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. బందరు రోడ్డు, బెంజిసర్కిల్, రామవరప్పాడు వరకు రోడ్డు దాటి ఆటోనగర్, పటమట వెళ్లాలంటే వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులంతా అక్కడే... సీఎం నగరంలో మకాం ఉంటే రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదు. సీఎం సమీక్షలకు వచ్చే వివిధ శాఖల ఉన్నతాధికారుల ప్రొటోకాల్ విధులతో జిల్లా అధికారులంతా సతమతమవుతున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్-కలెక్టర్‌తో పాటు, మున్సిపల్ కమిషనర్ వరకు సీఎం క్యాంపు కార్యాలయం వద్దే ఉంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది యావత్తూ కార్యాలయాలు వదిలి రోడ్లపైనే గడుపుతున్నారు. అర్బన్ తహశీల్దార్‌తో పాటు సిబ్బంది యావత్తూ సీఎం, ఇతర వీఐపీల ప్రొటోకాల్ సేవకే సమయమంతా కేటాయించాల్సి వస్తోంది. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉండటం వల్ల అర్బన్ తహశీల్దారు కార్యాలయంలో పనుల కోసం వెళ్లే ప్రజలు అగచాట్లు పడుతున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా సీఎం క్యాంపు కార్యాలయం విధులకే పరిమతమవుతున్నారు. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు తమ సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలకు సిద్ధమవుతుండటం తో పోలీసు బలగాలు అక్కడ పహరా కాయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. జీఏడీ తరలింపే పరిష్కారం... విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల పొడవునా వందమందికి పైగా సిబ్బంది, అధికారులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే విధుల్లో ఉంటున్నారు. వీటన్నింటికి సత్వర పరిష్కారం తక్షణం జీఏడీ (సాధారణ పరిపాలనా విభాగం) విజయవాడకు తరలించటమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
సీఎం కాన్వాయ్‌లో ‘రక్షక్ ప్లస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భద్రతను మరింత పటిష్టం చేశారు. మరో అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీఎం కాన్వాయ్‌లో భద్రతా సిబ్బంది చేర్చింది. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం ‘రక్షక్ ప్లస్’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. కాన్వాయ్ వరుసలో ఎస్కార్ట్ ముందు ఈ వాహనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు ఇందులో అధునాతన ఆయుధాలు కలిగిన నలుగురు గన్మెన్లు ఉంటారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లే సమయంలో రక్షక్ ప్లస్ కాన్వాయ్‌లో ఉంటుందన్నారు. -
ఎమ్మెల్యే కాన్వాయ్‌లో వాహనాల ఢీ
రామాయంపేట: అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన పందిని తప్పించబోయి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ వాహన శ్రేణి (కాన్వాయ్)లోని కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొనడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గురువారం జరిగింది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి, ఇసన్నపల్లి గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గోవర్దన్ తన అనుచరులతో కలసి వాహనాలలో బయలుదేరారు. మండలంలోని కోనాపూర్ శివారులోకి రాగానే వాహన శ్రేణిలో గంప వాహనం ముందుకు వెళ్లగానే అడవి పంది రోడ్డుపైకి వచ్చింది. దీంతో కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్ డీసీసీబీ డెరైక్టర్లు చంద్రారెడ్డి, కిష్టాగౌడ్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు అమృతరెడ్డి, బాల్‌రెడ్డి , మహేందర్‌రెడ్డి, శంకర్ గాయపడ్డారు. -
బెజవాడ నుంచే బాబు కాన్వాయ్
హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు భద్రత సిబ్బంది వసతి కూడా ఇక్కడే విజయవాడ సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలకు కాన్వాయ్‌ను ఇకపై విజయవాడ నుంచే పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చే కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత సిబ్బందికి వసతి ఏర్పాట్లు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పాలన సాగించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పర్యటనల నిమిత్తం వెళతారు. అయితే సీఎం కాన్వాయ్ కోసం ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను సమకూర్చుతోంది. అయితే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. విధిలేని స్థితిలో ప్రైవేటు వాహనాల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ వాహనాలు పంపేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా 8 టాటా సఫారీ వాహనాలు రానున్నట్టు తెలిసింది. వీటిలో కొన్ని బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు కూడా ఉంటాయని కమిషనరేట్ వర్గాల సమాచారం. వీటి కోసం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక షెడ్ల ఏర్పాటు జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తిరిగేందుకు వీలుగా అక్కడ కొన్ని వాహనాలు ఉంచుతారని చెపుతున్నారు. సెక్యూరిటీ వింగ్ రాక పర్యటన సమయంలో ముఖ్యమంత్రి భద్రతకు పెద్ద సంఖ్యలో సిబ్బంది కావాలి. భద్రతా చర్యలు తెలిసిన ఇంటిలిజెన్స్ విభాగం నుంచి వీరిని నియమిస్తారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి భద్రతను ఇక్కడి పోలీసులే పర్యవేక్షిస్తున్నారు. కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత, రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై ముఖ్యమంత్రి భద్రత కోసం ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి అధికారులు, సిబ్బంది వస్తున్నట్టు తెలిసింది. ఎస్పీ స్థాయి అధికారి, డీఎస్పీ, ఇతర సిబ్బంది వస్తారు. -
డిప్యూటీ స్పీకర్‌కు ఉద్యమ సెగ
మెదక్ టౌన్: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి మరోమారు జిల్లా కేంద్ర సాధన ఉద్యమ సెగ తగిలింది. శనివారం మెదక్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెదక్‌కు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్‌ని స్థానిక రాందాస్ చౌరస్తాలో ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపారు. అక్కడి నుంచి ఈడ్చివేశారు. అయినప్పటికీ ఉద్యమకారులు పట్టువదలకుండా ఒకరికొకరు పట్టుకొని గొలుసుగా ఏర్పడి కాన్వాయ్కి అడ్డుగా పడుకున్నారు. దీంతో చేసేది లేక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కారులోంచి దిగి దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎవరిని అడిగి టెంట్‌వేసి దీక్షలు చేపట్టారని ఆగ్రహించారు. దీంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరినడిగి చేశారంటూ ఉద్యమకారులు ఆమెను ప్రశ్నించారు. ఒక దశలో అసహనానికి గురైన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహిస్తూ మైక్‌లు పడేసి పోలీసుల సాయంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె వైఖరిని నిరసిస్తూ రెండు గంటలపాటు పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఓ వైపు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్, మెతుకు సీమ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
చంద్రబాబుకు మరో రెండు కాన్వాయ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో రెండు అధికారిక కాన్వాయ్‌లు సమకూరనున్నాయి. వీటిలో ఒక కాన్వాయ్‌ను విజయవాడలో, మరొకటి తిరుపతిలో ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం సీఎంకు హైదరాబాద్‌లో ఒక కాన్వాయ్ ఉంది. సీఎం రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు దీనినే తరలిస్తున్నారు. లేదంటే అక్కడ రిజర్వ్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తున్నారు. కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభమైన తరవాత చంద్రబాబు దాదాపు ప్రతి వారం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్తారని అధికారులు చెప్తున్నారు. అందువల్ల విజయవాడలో ప్రత్యేకంగా కాన్వాయ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుణేలో ఆర్డర్ ఇచ్చిన సఫారీ వాహనాలు పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తరవాత మరో కాన్వాయ్‌కు ఆర్డర్ ఇవ్వనున్నారు. దీనిని సీఎం సొంత జిల్లాలో ఉన్న తిరుపతిలో ఉంచాలని భావిస్తున్నారు. -
హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి
మైదుకూరు టౌన్: మైదుకూరు నియోజవర్గంలోని జాండ్లవరం గ్రామంలో ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌తో వెళుతుండగా అపశృతి చోటు చేసుకుంది. మైదుకూరు-జాండ్లవరం మార్గమధ్యంలోని పుల్లయ్యస్వామి సత్రం సమీపంలో మైదుకూరు యూత్ బలిజ సంఘం నాయకుడు ఏపీ రవీంద్ర వెళుతున్న స్కార్పియో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ నాగసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. మహేష్, కిట్టు అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. దస్తగిరి, చంద్ర, గోవిందు, హరి, సాయిలకు స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్ఐ నరసింహారెడ్డి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డ్రైవర్ నాగసుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.