హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు
భద్రత సిబ్బంది వసతి కూడా ఇక్కడే
విజయవాడ సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలకు కాన్వాయ్‌ను ఇకపై విజయవాడ నుంచే పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చే కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత సిబ్బందికి వసతి ఏర్పాట్లు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పాలన సాగించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పర్యటనల నిమిత్తం వెళతారు. అయితే సీఎం కాన్వాయ్ కోసం ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను సమకూర్చుతోంది. అయితే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
విధిలేని స్థితిలో ప్రైవేటు వాహనాల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ వాహనాలు పంపేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా 8 టాటా సఫారీ వాహనాలు రానున్నట్టు తెలిసింది. వీటిలో కొన్ని బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు కూడా ఉంటాయని కమిషనరేట్ వర్గాల సమాచారం. వీటి కోసం పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక షెడ్ల ఏర్పాటు జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తిరిగేందుకు వీలుగా అక్కడ కొన్ని వాహనాలు ఉంచుతారని చెపుతున్నారు.
సెక్యూరిటీ వింగ్ రాక
పర్యటన సమయంలో ముఖ్యమంత్రి భద్రతకు పెద్ద సంఖ్యలో సిబ్బంది కావాలి. భద్రతా చర్యలు తెలిసిన ఇంటిలిజెన్స్ విభాగం నుంచి వీరిని నియమిస్తారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి భద్రతను ఇక్కడి పోలీసులే పర్యవేక్షిస్తున్నారు. కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత, రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై ముఖ్యమంత్రి భద్రత కోసం ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి అధికారులు, సిబ్బంది వస్తున్నట్టు తెలిసింది. ఎస్పీ స్థాయి అధికారి, డీఎస్పీ, ఇతర సిబ్బంది వస్తారు.
బెజవాడ నుంచే బాబు కాన్వాయ్
Published Sat, Feb 28 2015 1:28 AM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM
Advertisement