రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్..
సాక్షి, విజయవాడ : ఇకపై విజయవాడలోనే ఎక్కువ రోజులుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం గురునానక్‌నగర్‌లోని ఎన్‌ఏసీ కల్యాణమండపంలో జరిగిన టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరుకు కొత్త రాజధాని ప్రకటిస్తారని చెప్పారు. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారుచేస్తామని తెలిపారు.
గ్రామాలు, మండలాలు, జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఎక్కడికక్కడ నిధులు ఎలా తెచ్చుకోవాలి.. ఆదాయం ఎలా పెంచుకోవాలి.. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలుచేయాలి వంటి అంశాలకు అక్కడే ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించి.. నాయకులు, కార్యకర్తల పని తీరుపై మూడు నెలలకొకసారి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. అందరి జాతకాలు తీస్తానని, వాటి ఆధారంగానే కష్టపడి పనిచేసే వారికి ప్రమోషన్లు ఇస్తానని పేర్కొన్నారు. ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవని పడుకుంటే కుదరదు.. ఇప్పటివరకు నేను పరిగెత్తాను.. ఇకముందు మిమ్మల్ని పరిగెత్తించి నేను కూర్చుంటాను..’ అంటూ కార్యకర్తలను హెచ్చరించారు.
బందరు పోర్టు అభివృద్ధి చేస్తాం..
వెస్ట్‌కోస్టులో గుజారాత్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, అక్కడ పోర్టులు అభివృద్ధి చేశారని, ఈస్ట్‌కోస్టులో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, ఇక్కడ మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. కేంద్రం సహాయంతో ఆయిల్ రిఫైనరీ, ఆక్వా యూనిట్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లాను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుస్తామని చెప్పారు. కోస్తా కారిడార్‌ను అభివృద్ధి చేసి స్పీడ్ ట్రైన్‌లు, బులెట్ రైళ్లు రప్పిస్తామన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండడం విచారకరమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్..
రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయని, డబ్బులు లేవని చంద్రబాబు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల్ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై తాను విడుదల చే.సే శ్వేతపత్రాలను చూసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను తాను ఎప్పుడూ విస్మరించనని, అధికారుల కంటే ముందు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని తొలుత ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు.
కార్యకర్తల కోసం రూ.20 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, దాన్ని మరింత పెంచుతామని చెప్పారు. సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.