మాటలేనా..! | Bandar port works usedi | Sakshi
Sakshi News home page

మాటలేనా..!

Published Thu, Aug 7 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

మాటలేనా..!

మాటలేనా..!

  •   బందరు పోర్టు పనుల ఊసేది
  •   కృష్ణాయూనివర్సిటీ భవనాల నిర్మాణం జరిగేనా
  •   బందరు-బెజవాడ రోడ్డు విస్తరణకు మోక్షమెన్నడో
  •   నేడు ముఖ్యమంత్రి సమీక్ష
  • మచిలీపట్నం/విజయవాడ సాక్షి : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు భూ సేకరణపై స్పష్టత లేదు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూలుపై అయోమయం నెలకొంది. సాగునీటి విడుదల జాప్యం కావడంతో ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

    ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాష్ర్టంలోని 13 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో బందరుపోర్టు, విజయవాడ-పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను జాతీయ రహదారి పనులు వేగవంతం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం, బెంజ్‌సర్కిల్ నుంచి బందరు వరకు నాలుగు లైనరహదారి విస్తరణ, 400 ఎకరాల భూమిని సేకరించి గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, అధునికీకరణ, విజయవాడ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.. ఇలా అనేక కీలక ప్రాజెక్టులు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి.
     
    బందరు రోడ్డు విస్తరణ ఎన్నటికో..

    మచిలీపట్నం-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం రూ.750 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనులను  తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ఎంపీ నామానాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రోడ్డు విస్తరణ కోసం 81శాతం భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించేందుకు రూ.55 లక్షలతో టెండర్లు పిలిచారు. మధుకాన్ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లకపోవటంతో ఈ పనులు దాదాపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి జరిగితే ఈ రహదారి అత్యంత రద్దీగా మారుతుంది.
     
    కృష్ణా యూనివర్సిటీకి  సొంత భవనాలు నిర్మించేనా
     
    మచిలీపట్నంలో 2008, ఏప్రిల్‌లో కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. భవనాల నిర్మాణం కోసం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరులో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్సిటీ నడుస్తున్న ఏజే కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కేటాయించారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్‌లో 2 0గదుల్లో, మచిలీపట్నంలోని నిర్మలా కాన్వెంట్ సమీపంలో ఓ భవనంలో కొనసాగుతోంది. ల్యాబ్‌లు, హాస్టల్ గదులు, వసతి గృహాలు, గ్రంథాలయాలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రూ.70 కోట్లతో రుద్రవరంలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు.  
     
    ఆగస్టు వచ్చిన పూర్తవని ‘పులిచింతల’
     
    కృష్ణా, గుంటూరు జిల్లాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2004-05లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,281 కోట్లు. 46 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంది. పనులు పూర్తవకుండానే 2013 నవంబరులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పనులు పూర్తికాకుండానే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టులోపు ఈ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు వద్దకు వరదనీరు చేరనుంది. వరదనీరు చేరితే ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి.
     
    డెల్టా ఆధునికీకరణ
     
    సుమారు 150 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటీష్ పాలకులు జిల్లాలోని వివిధ ప్రధాన కాలువలను తవ్వించారు. అప్పట్లో సాగులో ఉన్న భూమి ఆధారంగా కాలువల నిర్మాణం జరిగింది. ఆ కాలువల ద్వారానే నేటికీ సాగునీరు సరఫరా అవుతోంది. 2009లో ఈ కాలువలను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించారు. కాలువలపై వంతెనలు, నూతన లాకులు మాత్రమే నిర్మించారు. మూడేళ్ల వ్యవధిలో కేవలం 20శాతం పనులు కూడా జరగలేదు. ఏటా భారీ వర్షాల కారణంగా రైతులు కోట్లాది రూపాయల పంటలను కోల్పోతున్నారు. డెల్టా ఆధునికీకరణ పూర్తయితే శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందే అవకాశం ఉంది. గత ఏడాది ఆధునికీకరణ పనులు అసలు చేయలేదు. ఈ ఏడాది చేసేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
     
    కలెక్టర్ నివేదిక పరిశీలనకే పరిమితం!
     
    రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తక్షణం పూర్తి చేయాల్సిన 16 అంశాలతో జిల్లా అభివృద్ధి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నివేదిక రూపొందిం చారు. నివేదిక పంపి రెండు నెలలు గడిచినా దాని లోని అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. పలు అంశాలపై గత నెల 12న జరిగిన  సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఎటువంటి హామీ లభించలేదు.
     
    ప్రతిపాదనలకే పరిమితం
     
    గత నెలలో జరిగిన సమీక్షలో విజయవాడలోని కాలువల ఆధునికీకరణకు తక్షణం రూ.11.6 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అధునికీకరణ పనులు మాత్రం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించినా కనీసం వాస్తవ పరిస్థితిని అధికారులు సమీక్షించలేదు. బెంజ్‌సర్కిల్ వద్ద నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం కన్సెల్టెన్సీ సంప్రదించాలని చెప్పినా ఇప్పటి వరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదు.
     
    బందరుపోర్టు కీలకం
     
    జిల్లా అభివృద్ధిలో బందరు పోర్టు నిర్మాణం కీలకం. పోర్టు కోసం 12 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. పోర్టు పనులకు 2008, ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ పనులను పట్టించుకునే వారే కరువయ్యారు. అనంతరం 2012, మే 1న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బందరు పోర్టుకు 5,324 ఎకరాల భూసేకరణ కోసం జీవో నంబరు 11ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 524 ఎకరాలు మాత్రమే సేకరించింది. మిగిలిన 4,800 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

    భూసేకరణకు రూ.451.49 కోట్లు, 563 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.43.58 కోట్లు అవసరమని 2014, ఏప్రిల్‌లో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. రెండు నెలలు పూర్తవుతోంది. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ కన్సార్టియం ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. భూసేకరణకు సంబంధించిన అంశంపై ఒక్క అడుగు ముందుకు వేయలేదు. పాలకులు చెప్పిన ప్రకారం మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపైనా పనులు ప్రారంభిస్తారో, లేదో, వేచి చూడాలి.
     
    ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని పరుగులు తీయిస్తా. కృష్ణా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తా. స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేస్తాం. బందరుపోర్టు నిర్మిస్తాం. కోస్టల్ కారిడార్ అభివృద్ధిచేస్తాం. చెప్పనివి కూడా మరెన్నో చేస్తాం.’
     - ఇవీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఇచ్చిన హామీలు
     
    ‘కృష్ణా జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేస్తాం. జిల్లాపై నాకో విజన్ ఉంది. దానికి అనుగుణంగా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.
     - ఇవీ గత నెల 12వ తేదీన విజయవాడలో సీఎం హోదాలో చంద్రబాబు చెప్పిన మాటలు.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement