ప్రజల రుణం తీర్చుకుంటా
- ఆరు నెలల్లో పోర్టు పనులకు కృషి
- మంత్రి కొల్లు రవీంద్రకు ఘనస్వాగతం
- పట్టణంలో భారీ ర్యాలీ
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : బందరు నియోజకవర్గ శాసనసభ్యునిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించిన బందరు ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని వచ్చిన బందురు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘనస్వాగతం పలికారు.
సోమవారం విజయవాడ నుంచి మచిలీపట్నం వస్తున్న కొల్లు రవీంద్ర సుల్తానగ రం ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు అనుకున్న సమాయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటి వరకు పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు గుడి వద్దే పడిగాపులు పడ్డారు. అక్కడికి చేరుకున్న రవీంద్రకు నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా అభిమానంతో పూలవర్షం కురిపించారు. బాణసంచా కాల్చి ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. మంత్రిరవీంద్ర తొలుత ఆంజనేయస్వామిని దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని పూజారులు రవీంద్ర పేరిట ప్రత్యేక పూజలు చేసి హారతులు పట్టారు.
పట్టణంలో భారీ ర్యాలీ ...
కొల్లు రవీంద్రకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. సుల్తానగరం నుంచి ప్రారంభమైన ర్యాలీ మూడు స్తంభాల సెంటర్, చలరాస్తాసెంటర్, కోనేరుసెంటర్‌ల మీదుగా వల్లూరిరాజాసెంటర్, రేవతిసెంటర్, బస్టాండ్‌సెంటర్‌కు చేరుకుంది. అనంతరం రవీంద్ర బస్టాండ్‌సెంటర్‌లోని స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆరు నెలల్లో పోర్టు పనులు : మంత్రి కొల్లు రవీంద్ర
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బందరు ప్రజల రుణం తీర్చుకుంటానని, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో స్థానం కల్పించడం నిజంగా తన అదృష్టమని చెప్పారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన బందరు ప్రజల రుణాన్ని పార్టీ అధినేత చంద్రబాబు సహకారంతో రానున్న ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభించేలా కృషి చేసి తీర్చుకుంటానన్నారు.
అలాగే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పున:రుద్ధరణతో పాటు పట్టణ ప్రజలకు సక్రమంగా తాగునీరందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపీచంద్, మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యనారాయణ, చిలంకుర్తి తాతయ్య, వాలిశెట్టి వెంకటేశ్వరరావు, వాలిశెట్టి తిరుమలరావు, నారగాని ఆంజనేయప్రసాద్, అచ్యుతరావు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.