
నగరంలో కాన్వాయ్ కష్టాలు
వారంలో నాలుగు రోజులు నగరంలోనే సీఎం
పెరిగిన వీఐపీల తాకిడి
గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్
నరకం చూస్తున్న నగరవాసులు
నగరంలో అసలే ఎక్కడ చూసినా ట్రాఫికర్. ఒక్కో సిగ్నల్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరితే అనుకున్న సమయానికి అనుకున్న చోటికి వెళతామనే గ్యారంటీ లేదు. విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక నానా పాట్లు పడుతున్నారు. దీనికితోడు ఇప్పుడు సీఎం చంద్రబాబు నగరంలో మకాం వేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నారు. ఇక రోడ్ల వెంట కాన్వాయ్‌లే కాన్వాయ్‌లు. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో జనం కష్టాలు వర్ణనాతీతం.
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి నాలుగు రోజులు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మకాం ఉంటున్నారు. ఆయనతో పాటు, ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల రాకపోకలతో గత నెల రోజులుగా నగరానికి వీఐపీల తాకిడి పెరిగింది. అందుకు తగ్గట్టు రాజధాని స్థాయిలో నగరంలో రోడ్లు, ఇతర సౌకర్యాలు ప్రొటోకాల్, సెక్యూరిటీ, అధికారులు లేకపోవటంతో సామాన్య జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది.
కాన్వాయ్‌లే కాన్వాయ్‌లు...
సీఎం రాకతో ముఖ్య శాఖల అధికారులు నగరంలో మకాం వేస్తున్నారు. సీఎం ప్రొటోకాల్ చూసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) లేకపోవటంతో ఆ విధులను నగరంలో ఉన్న వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ప్రతి నిత్యం వీఐపీల కాన్వాయ్‌ల రాకపోకలతో నగరంలోని బందరు రోడ్డులో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సీఎం నగరంలో ఉన్నారంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజుకు రెండు మూడు సార్లు బందర్ రోడ్డులో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం బయటకు వెళ్లి రావటంతో ఆ మార్గంలో జనం ట్రాఫిక్ అవస్థలతో చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన కాన్వాయ్ వెళ్లే ముందు గంట నుంచి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. బందరు రోడ్డు, బెంజిసర్కిల్, రామవరప్పాడు వరకు రోడ్డు దాటి ఆటోనగర్, పటమట వెళ్లాలంటే వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులంతా అక్కడే...
సీఎం నగరంలో మకాం ఉంటే రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదు. సీఎం సమీక్షలకు వచ్చే వివిధ శాఖల ఉన్నతాధికారుల ప్రొటోకాల్ విధులతో జిల్లా అధికారులంతా సతమతమవుతున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్-కలెక్టర్‌తో పాటు, మున్సిపల్ కమిషనర్ వరకు సీఎం క్యాంపు కార్యాలయం వద్దే ఉంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది యావత్తూ కార్యాలయాలు వదిలి రోడ్లపైనే గడుపుతున్నారు. అర్బన్ తహశీల్దార్‌తో పాటు సిబ్బంది యావత్తూ సీఎం, ఇతర వీఐపీల ప్రొటోకాల్ సేవకే సమయమంతా కేటాయించాల్సి వస్తోంది. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉండటం వల్ల అర్బన్ తహశీల్దారు కార్యాలయంలో పనుల కోసం వెళ్లే ప్రజలు అగచాట్లు పడుతున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా సీఎం క్యాంపు కార్యాలయం విధులకే పరిమతమవుతున్నారు. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు తమ సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలకు సిద్ధమవుతుండటం తో పోలీసు బలగాలు అక్కడ పహరా కాయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
జీఏడీ తరలింపే పరిష్కారం...
విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల పొడవునా వందమందికి పైగా సిబ్బంది, అధికారులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే విధుల్లో ఉంటున్నారు. వీటన్నింటికి సత్వర పరిష్కారం తక్షణం జీఏడీ (సాధారణ పరిపాలనా విభాగం) విజయవాడకు తరలించటమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.