జిల్లాకు రెండోసారి దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవి
సంగారెడ్డి డివిజన్: జిల్లాకు చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. తెలంగాణ శాసనసభ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. వెనువెంటనే ఆమె డిప్యూటీ స్పీకర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
జిల్లాకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఇది రెండోపర్యాయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ స్పీకర్ పదవి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించారని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరును టీఆర్‌ఎస్ అధినేత పరిశీలించిన నాటి నుంచే పద్మాదేవేందర్‌రెడ్డి తన అయిష్టతను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ మహిళ, విద్యాధికారులైన పద్మాదేవేందర్‌రెడ్డికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిపై అంతగా ఆసక్తి చూపలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టడం వల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదని భావించిన ఆమె భావించారు.
అయితే సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరునే ఖరారు చేయటంతో పద్మాదేవేందర్‌రెడ్డికి మరో మార్గం లేకుండాపోయింది. బుధవారం పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావటంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లాకు చెందిన మరో మంత్రి హరీష్‌రావు పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నికలో కీలకపాత్ర పోషించారు.
ఆనందంగా ఉంది: పద్మాదేవేందర్‌రెడ్డి
తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గర్వంగా భావిస్తున్నారు. సభలో హుందాగా వ్యవహరించి శాసనసభా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా చూస్తానని, డిప్యూటీ స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఆమె పేర్కొన్నారు.