అయ్యో.. హారిక
పాపన్నపేట: ఆడపిల్ల అని భారమైందో...లేక ప్రమాదమే కారణమైందో...తెలియదు కానీ.. రెండేళ్ల చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర సంఘటనతో పదిరోజుల బాలింత అయిన చిన్నారి తల్లి నోటమాటరాక తల్లడిల్లిపోతోంది. ఈ దారుణానికి కారణమేమిటో తెలియక కన్నీరుమున్నీరవుతోంది.
వివరాల్లోకి వెళితే...పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మాటూరి ఎల్లంకు 2010లో చింతకుంట గ్రామానికి చెందిన మంజులతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మొదటి పాప రేణుక, రెండోపాప హారికతోపాటు పదిరోజుల క్రితమే మరో ఆడపిల్లకు మంజుల జన్మనిచ్చింది. అయితే మగ సంతానం కావాల్సిందేనంటూ ఎల్లం తండ్రి బీరయ్య, తల్లి దుర్గమ్మ, ఆడపడుచు మమతలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా మంజులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సోమవారం హారిక అలియాస్ సుజాత(2) అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తలనొప్పితో బాధపడుతున్న మంజుల హారికను దగ్గరకు తీసుకోలేక పోయింది. దీంతో తాత బీరయ్య చిన్నారి హారికను తీసుకుని బయటకు వెళ్లాడు. అరగంట తర్వాతఇంటికొచ్చిన ఆడపడుతచు మమత వంటింట్లోకి వెళ్లేసరికి నీటితొట్టిలో హారిక మృతదేహం కనిపించింది. దీంతో ఆమె పెద్దగా అరుస్తూ బయటకు రాగా, వెంటనే వంటింట్లోకి వెళ్లిన మంజుల కూతురు మృతదేహం చూసి కన్నీరుమున్నీరైంది.
ఘటనపై పలు అనుమానాలు
హారికను ఇంట్లో దించి తాను బీడీలు తెచ్చుకునేందుకు వెళ్లానని చిన్నారి తాత బీరయ్య చెబుతున్నాడు. అయితే బాలిక నీటితొట్టిలో పడిపోయే ఆస్కారమే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హారిక పడిపోయిన నీటితొట్టి చిన్నారికి అందేంత ఎత్తులో లేనందున బాలిక తనకు తానుగా అందులో పడిపోయే అవకాశం లేదంటున్నారు. ఈ మేరకు పాపన్నపేట ఏఎస్‌ఐ విఠల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.