Two years child
-
షాకింగ్ : గన్‌తో పేల్చుకున్న రెండేళ్ల చిన్నారి
టెక్సాస్ : చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారు తెలిసీ తెలియకుండా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదకు తెస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా హోస్టన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి.. అక్కడే బుల్లెట్లు లోడ్ చేసి ఉన్న గన్‌తో తనకు తానుగా కాల్చుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. చిన్నారిని టెక్సాస్‌లోని పిల్లల ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన ఒక రోజు అనంతరం చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడని తెలిసింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం హోస్టన్‌లో జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం, సురక్షితం కాని లోడెడ్ గన్‌తో తనకు తానుగా పేల్చుకోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. లోడ్ చేసిన 9 ఎంఎం పిస్టల్‌ను ఈ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆ గన్‌తో ఆడుకుంటూ తలకు గురిపెట్టుకుని ట్రిగర్ నొక్కుకున్నాడని.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి గన్‌తో పేల్చుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారిని కాపాడుకోలేకపోయారు. వారికి ఏమైనా శిక్ష విధించాలా? అనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ పాఠంలా ఉందని పలువురు అంటున్నారు. -
ఫోన్‌పై ధ్యాస.. ఆ తల్లికి బిడ్డపై ఉంటే..
-
ఫోన్‌పై ధ్యాస.. ఆ తల్లికి బిడ్డపై ఉంటే...
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. అమ్మ చేతివేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకరమైన సంఘటన చైనాలోని యుయాంగ్ నగరంలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ తన కూతురిని వెంటబెట్టుకుని వెళ్తున్న ఓ మహిళ తన మొబైల్లో ఏదో చూస్తూ అందులోనే మునిగిపోయింది. తనతో వస్తున్న కన్నకూతురు ఎక్కడికెళ్లిందని ధ్యాస లేకుండా తదేకంగా ఫోన్వైపే చూస్తు ఉండిపోయింది. అంతలో అటువైపు నుంచి ఓ కారు వేగంగా దూసుకొస్తోంది. ఆ చిన్నారి ఉన్న విషయాన్ని గ్రహించని కారు డ్రైవర్ అమాంతంగా చిన్నారిపై నుంచి పోనిచ్చాడు. కారు ముందు చక్రాల కింద నలిగిపోయిన ఆ చిన్నారి విలవిలలాడుతూ మృతిచెందింది. మొబైల్ తీక్షణంగా చూస్తూ ఉండిపోయిన తల్లి.. రోడ్డుపై ఏం జరిగిందో తేరుకోనే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కూతురు కారు చక్రాల కింద నలిగిపోవడంతో భయపడిపోయిన తల్లి ఏమి చేయాలో తోచక సాయం కోసం బిగ్గరగా అరిచింది. దాంతో అటుగా వెళ్లేవారూ వచ్చి ఆ చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై చిన్నారిని గుర్తించకుండా చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చూసిన జనమంతా తల్లిని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై కన్నబిడ్డను వదిలేసి ఫోన్లో ఏదో చూస్తూ ఉండిపోయిన తల్లిని కఠినంగా శిక్షించాలని తిట్టిపోస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన మహిళపై చర్యలు తీసుకున్నారో లేదో ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. -
అయ్యో.. హారిక
పాపన్నపేట: ఆడపిల్ల అని భారమైందో...లేక ప్రమాదమే కారణమైందో...తెలియదు కానీ.. రెండేళ్ల చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర సంఘటనతో పదిరోజుల బాలింత అయిన చిన్నారి తల్లి నోటమాటరాక తల్లడిల్లిపోతోంది. ఈ దారుణానికి కారణమేమిటో తెలియక కన్నీరుమున్నీరవుతోంది. వివరాల్లోకి వెళితే...పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మాటూరి ఎల్లంకు 2010లో చింతకుంట గ్రామానికి చెందిన మంజులతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మొదటి పాప రేణుక, రెండోపాప హారికతోపాటు పదిరోజుల క్రితమే మరో ఆడపిల్లకు మంజుల జన్మనిచ్చింది. అయితే మగ సంతానం కావాల్సిందేనంటూ ఎల్లం తండ్రి బీరయ్య, తల్లి దుర్గమ్మ, ఆడపడుచు మమతలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా మంజులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం హారిక అలియాస్ సుజాత(2) అంగన్వాడి కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తలనొప్పితో బాధపడుతున్న మంజుల హారికను దగ్గరకు తీసుకోలేక పోయింది. దీంతో తాత బీరయ్య చిన్నారి హారికను తీసుకుని బయటకు వెళ్లాడు. అరగంట తర్వాతఇంటికొచ్చిన ఆడపడుతచు మమత వంటింట్లోకి వెళ్లేసరికి నీటితొట్టిలో హారిక మృతదేహం కనిపించింది. దీంతో ఆమె పెద్దగా అరుస్తూ బయటకు రాగా, వెంటనే వంటింట్లోకి వెళ్లిన మంజుల కూతురు మృతదేహం చూసి కన్నీరుమున్నీరైంది. ఘటనపై పలు అనుమానాలు హారికను ఇంట్లో దించి తాను బీడీలు తెచ్చుకునేందుకు వెళ్లానని చిన్నారి తాత బీరయ్య చెబుతున్నాడు. అయితే బాలిక నీటితొట్టిలో పడిపోయే ఆస్కారమే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హారిక పడిపోయిన నీటితొట్టి చిన్నారికి అందేంత ఎత్తులో లేనందున బాలిక తనకు తానుగా అందులో పడిపోయే అవకాశం లేదంటున్నారు. ఈ మేరకు పాపన్నపేట ఏఎస్ఐ విఠల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.