ఫోన్పై ధ్యాస.. ఆ తల్లికి బిడ్డపై ఉంటే...
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. అమ్మ చేతివేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకరమైన సంఘటన చైనాలోని యుయాంగ్ నగరంలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ తన కూతురిని వెంటబెట్టుకుని వెళ్తున్న ఓ మహిళ తన మొబైల్లో ఏదో చూస్తూ అందులోనే మునిగిపోయింది. తనతో వస్తున్న కన్నకూతురు ఎక్కడికెళ్లిందని ధ్యాస లేకుండా తదేకంగా ఫోన్వైపే చూస్తు ఉండిపోయింది. అంతలో అటువైపు నుంచి ఓ కారు వేగంగా దూసుకొస్తోంది. ఆ చిన్నారి ఉన్న విషయాన్ని గ్రహించని కారు డ్రైవర్ అమాంతంగా చిన్నారిపై నుంచి పోనిచ్చాడు. కారు ముందు చక్రాల కింద నలిగిపోయిన ఆ చిన్నారి విలవిలలాడుతూ మృతిచెందింది. మొబైల్ తీక్షణంగా చూస్తూ ఉండిపోయిన తల్లి.. రోడ్డుపై ఏం జరిగిందో తేరుకోనే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కూతురు కారు చక్రాల కింద నలిగిపోవడంతో భయపడిపోయిన తల్లి ఏమి చేయాలో తోచక సాయం కోసం బిగ్గరగా అరిచింది.
దాంతో అటుగా వెళ్లేవారూ వచ్చి ఆ చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై చిన్నారిని గుర్తించకుండా చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చూసిన జనమంతా తల్లిని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై కన్నబిడ్డను వదిలేసి ఫోన్లో ఏదో చూస్తూ ఉండిపోయిన తల్లిని కఠినంగా శిక్షించాలని తిట్టిపోస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన మహిళపై చర్యలు తీసుకున్నారో లేదో ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు.