- బలోపేతానికి చర్యలు
- కార్పొరేట్‌కు దీటుగా మౌలిక సౌకర్యాలు
- నియోజకవర్గానికి రూ.5 కోట్లు
- త్వరలో నిధుల విడుదల
పాపన్నపేట:ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని సర్కార్ యోచిస్తోంది. మౌలిక వసతులు కల్పించి పాఠశాలలకు ప్రాణం పోయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకోసం బృహత్ ప్రణాళికను రూపొందిస్తోంది. అందరి సహకారం తీసుకుంటూనే నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి నిధులు, సీఎస్‌ఆర్ నిధులతో ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, ల్యాబోరేటరీ, ప్రహరీలు, తరగతి గదులు, టాయిలెట్లు, వంట గదులు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది.
జిల్లాలో మొత్తం 2,947 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చాలా వాటికి ప్రహరీలు లేవు. సరిపడా తరగతి గదులు, ల్యాబోరేటరీ, గ్రంథాలయ, మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకట్టుకునే అవకాశం లభిస్తుందన్న నిర్ణయంతో పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించినట్లు ఇటీవల సంగారెడ్డి పట్టణానికి వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.
నియోజకవర్గానికి రూ 5.కోట్లు
ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సంబంధిత నియోజకవర్గం నిధుల నుంచి ఎమ్మెల్యే రూ.కోటి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రూ.కోటి, సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.కోటి చొప్పున ఇస్తే తాము మరో రూ.2కోట్లు జత చేసి నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యేలా చూస్తామన్నారు.
ఇందుకు ఎమ్మెల్యేలు తమ సమ్మతిని తెలిపారన్నారు. అయితే శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రహరీల నిర్మాణాన్ని ఉపాధి పనులకు జత చేస్తే బావుంటుందని సూచించారన్నారు. ఈ సూచనను ప్రశంసించినట్టు చెప్పారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుని కొంత మంది దాతల సహకారంతో, ఇతర నిధులతో పాఠశాలల్లో ఫర్నిచర్ సౌకర్యం కల్పించిన తీరును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ప్రశంసించారన్నారు. త్వరలోనే పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించడంతో సర్కారు బడులకు మహర్దశ పట్టనుందని పరిశీలకులు భావిస్తున్నారు.