Petro Bunk staff
-
అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..!
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘దుర్గ’ పేరు పెట్టుకొని దుర్గమ్మ తల్లిని కొలుస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఏడుపాయలకు వచ్చిన ఓ యువతి మంగళవారం రాత్రి స్నానానికి వెళ్లి నీటి మునిగి బుధవారం శవమై తేలింది. తండ్రిలేని ఆ ఆడ బిడ్డ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది. హైదరాబాద్‌లోని మొహిదిపట్నానికి చెందిన ముక్కర్ల బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భర్త కొంతకాలం కిందట మరణించడంతో పెద్ద కూతురు దుర్గ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది. ఆమెకు ఏడుపాయల దుర్గమ్మంటే ఎనలేని భక్తి.. ప్రతియేడు ఏడుపాయల జాతరకు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఏడుపాయలకు వచ్చి టేకుల బొడ్డె ప్రాంతంలోని మంజీరా పాయలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగింది. గమనించిన బోయిని పాపయ్య అనే గజ ఈతగాడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి 12గంటల వరకు మంజీరా నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దుర్గ శవం లభ్యమైంది. రూ.500 అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంట్లో చిల్లిగవ్వలేక పక్కింటి వాళ్ల దగ్గర రూ.500ల అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తల్లీ.. నేను ఎవరి కోసం బతకాలి బిడ్డా...! అంటూ మృతురాలి తల్లి బాలమణి రోధించిన తీరు జాతరకు వచ్చిన భక్తులను కంటతడి పెట్టించింది. తమ బిడ్డ గల్లంతైందన్న విషయం తెలుసుకొని ఏడుపాయలకు వచ్చిన బాలమణికి తెల్లవారి శవం చూసేసరికి తెలియదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లికి నోచుకోకుండానే కానరాని లోకాలకు వెళ్లడంతో బాలమణి కన్నీరు మున్నీరైంది. పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘చిల్లర’ దోపిడీ
* పెట్రో బంకుల సిబ్బంది ఇష్టారాజ్యం * మోసపోతున్న వినియోగదారులు * పట్టించుకోని అధికారులు సిద్దిపేట అర్బన్ : పెట్రోల్, డీజిల్ నాణ్యత, కొలతల్లో తీవ్ర వ్యత్యాసం చూపుతూ బంకు నిర్వాహకులు ‘చిల్లర’ను వెనుకేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో బిజీబిజీగా ఉండే వివిధ వర్గాల ప్రజలు ఈ దోపిడీని చూసీ, చూడనట్లు వదిలేస్తున్నారు. కొందరైతే ఈ వ్యవహారంపై సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. మరి కొన్ని బంకుల్లో కొందరు వినియోగదారులు ఈ ‘చిల్లర’పై వాగ్వాదాలకు దిగిన సందర్భాలూ లేకపోలేదు. ఈ తేడాలను అరికట్టాల్సిన తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సిద్దిపేట పట్టణంలో సుమారు 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 20 వేల లీటర్ల పెట్రోల్, 80 వేల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం సుమారు రూ. 6 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతుంది. రూ. 50లకు గాను రూ. 49.61పెసలకే పెట్రోల్ మాత్రమే పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దబాయిస్తారు. ఇక్కడే 39 పైసలు ‘చిల్లర’ మిగిలిస్తారు. ఇలా 1000 మిల్లీ లీటర్లు పెట్రోల్ పోయాల్సిన చోట 850 మిల్లీ లీటర్లకు మించి రావడం లేదు. దీనికి ఎలక్ట్రానిక్ మిషన్ల లోపాలుగా చెబుతూ బంక్ నిర్వాహకులు పబ్బంగడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.72.43 ఉంది. రూ. 100 పెట్రోల్ పోస్తే 1.40 లీటర్ల పెట్రోల్ రావాలి. కానీ 1.10 నుంచి 1.20 లీటర్లు మాత్రమే వస్తుంది. బంకుల నిర్వాహకులు ముట్టజెప్పే ముడుపులు తీసుకుని అధికారులు బంకులపై కన్నెత్తి చూడడం లేదని వాటిని తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో నాణ్యత, పరిమాణంలో తేడాలున్నా, ఇన్వాయిస్కు, స్టాక్‌కు వ్యత్యాసం కనిపించినా సెక్షన్ - 6ఏ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. అదేవిధంగా బంకు పరిసరాల్లో నిర్వాహకులు పాటిస్తున్నారా..? ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నారా..? వాహనాలకు సరిపడా పార్కింగ్ చోటు ఉందా..? అనే వాటి ని పరిశీలించాల్సిన తూనికలు, కొలతల అధికారులు ఏటా పంపింగ్ సామర్థ్యాన్ని కూడా పరిశీలించి ముద్రలు వేయాల్సి ఉన్నా అలా జర గడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.