‘చిల్లర’ దోపిడీ | 'Retail' robbery | Sakshi
Sakshi News home page

‘చిల్లర’ దోపిడీ

Published Mon, Oct 27 2014 2:58 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

‘చిల్లర’ దోపిడీ - Sakshi

‘చిల్లర’ దోపిడీ

* పెట్రో బంకుల సిబ్బంది ఇష్టారాజ్యం
* మోసపోతున్న వినియోగదారులు
* పట్టించుకోని అధికారులు

సిద్దిపేట అర్బన్ : పెట్రోల్, డీజిల్ నాణ్యత, కొలతల్లో తీవ్ర వ్యత్యాసం చూపుతూ బంకు నిర్వాహకులు ‘చిల్లర’ను వెనుకేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో బిజీబిజీగా ఉండే వివిధ వర్గాల ప్రజలు ఈ దోపిడీని చూసీ, చూడనట్లు వదిలేస్తున్నారు. కొందరైతే ఈ వ్యవహారంపై సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. మరి కొన్ని బంకుల్లో కొందరు వినియోగదారులు ఈ ‘చిల్లర’పై వాగ్వాదాలకు దిగిన సందర్భాలూ లేకపోలేదు. ఈ తేడాలను అరికట్టాల్సిన  తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సిద్దిపేట పట్టణంలో సుమారు 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 20 వేల లీటర్ల పెట్రోల్, 80 వేల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి.

నిత్యం సుమారు రూ. 6 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతుంది. రూ. 50లకు గాను రూ. 49.61పెసలకే పెట్రోల్ మాత్రమే పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దబాయిస్తారు. ఇక్కడే 39 పైసలు ‘చిల్లర’ మిగిలిస్తారు. ఇలా 1000 మిల్లీ లీటర్లు పెట్రోల్ పోయాల్సిన చోట 850 మిల్లీ లీటర్లకు మించి రావడం లేదు. దీనికి ఎలక్ట్రానిక్ మిషన్ల లోపాలుగా చెబుతూ బంక్ నిర్వాహకులు పబ్బంగడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.72.43 ఉంది. రూ. 100 పెట్రోల్ పోస్తే 1.40 లీటర్ల పెట్రోల్ రావాలి. కానీ 1.10 నుంచి 1.20 లీటర్లు మాత్రమే వస్తుంది. బంకుల నిర్వాహకులు ముట్టజెప్పే ముడుపులు తీసుకుని అధికారులు బంకులపై కన్నెత్తి చూడడం లేదని వాటిని తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో నాణ్యత, పరిమాణంలో తేడాలున్నా, ఇన్‌వాయిస్‌కు, స్టాక్‌కు వ్యత్యాసం కనిపించినా సెక్షన్ - 6ఏ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. అదేవిధంగా బంకు పరిసరాల్లో నిర్వాహకులు పాటిస్తున్నారా..? ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నారా..? వాహనాలకు సరిపడా పార్కింగ్ చోటు ఉందా..? అనే వాటి ని పరిశీలించాల్సిన తూనికలు, కొలతల అధికారులు ఏటా పంపింగ్ సామర్థ్యాన్ని కూడా పరిశీలించి ముద్రలు వేయాల్సి ఉన్నా అలా జర గడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement