పాపన్నపేట, న్యూస్‌లైన్: శివసత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. బోనాలతో నృత్యాలు.. దుర్గమ్మనామస్మరణలతో రెండో రోజైన శుక్రవారం ఏడుపాయల జాతర హోరెత్తింది. రవికలు, చీరలు, కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, గాలి గుమ్మటాలు, మెరుపు కాగితాలతో అలంకరించిన ఎడ్లబండ్లు గణగణ గంటలతో పరుగులు తీస్తుండగా..శకట భ్రమణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాగా అకాల వర్షం భక్తజనులను ఆగమాగం చేసింది.
అడపా దడపా కురిసిన చిరు జల్లులతో భక్తులు చెల్లా చెదురయ్యారు. బండ్లు తిరిగే సమయానికి ఒకేచోటుకు చేరుకొని ఉత్సవాన్ని తిలకించారు. కాగా ఉదయం 5గంటలకు పాలక వర్గ చైర్మన్ పబ్బతి ప్రభాకర్‌రెడ్డి పూజలుచేసి దుర్గమ్మ దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి సునీతారెడ్డి ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రే భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. తెల్లవారుజామునుంచే మంజీర నదిలో స్నానాలుచేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకుని ఉపవాస దీక్షలు విరమించారు.
గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. దుర్గా భవానికి జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఏడుపాయల్లోని కొండా కోనాలు ప్రతిధ్వనించాయి. మెదక్ డీఎస్పీ గోద్రూ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతరావు, పాలక వర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
బోనంతో ఆకట్టుకున్న నృత్యాలు
నెత్తిపై బోనం పెట్టుకుని.. చేతిలో చెర్న కోళాలు పట్టుకొని డప్పుచప్పుళ్లకనుగుణంగా శివసత్తులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు
జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జానపదులు తమ బండ్లను అందంగా అలంకరించారు. వాటిపై వేపకొమ్మలు చేతపట్టుకున్న శివసత్తులు సిగాలు ఊగుతుండగా ఎడ్లు పరుగులు తీశాయి. మొదట ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి పాలక వర్గ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు స్వాగతం పలికారు. బండి ముందు డప్పుచప్పుళ్లకనుగుణంగా వందలాది యువకులు నృత్యం చేశారు. చెట్టు, గుట్ట భక్తులతో నిండిపోయి ఈ అపురూప దృశ్యాన్ని తిలకించారు.
నేడు రథోత్సవం
ఏడుపాయల జాతరలో మూడో రోజైన శనివారం అర్ధరాత్రి రథోత్సవం జరుగుతుంది. రంగు రంగుల మెరుపు కాగితాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాన్ని భక్తులు తాళ్లతో లాగుతారు. ఆదివారం తెల్లవారు జాము వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
జజ్జనకరి జనాలే..
Published Fri, Feb 28 2014 11:51 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement