మది నిండా భక్తి భావం
♦ అట్టహాసంగా జనజాతర ప్రారంభం
♦ జనారణ్యంగా మారిన మంజీర తీరం
♦ ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు
♦ హెలికాప్టర్‌లో తరలివచ్చిన మంత్రులు
పాపన్నపేట: మంజీర తీరం.. జనసంద్రమైంది... ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు.. మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరను డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఉదయం 8.45గంటలకే హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈఓ కార్యాలయం నుంచి ఊరేగింపుగా ఆలయం వరకు పట్టు వస్త్రాలను తీసుకెళ్లి పూజలు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఏడుపాయల్లో స్నానాలుచేసి దుర్గమ్మతల్లిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివదీక్షలు చేపట్టారు. శివసత్తులు సిగాలూగుతూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఏడుపాయల్లో గల శివాలయంలో శివపూజలు చేసి ఉపవాస దీక్షలను విడిచి పెట్టారు. తెల్లవార్లు జాగరణ చేశారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆకట్టుకున్న జాతర: ఏడుపాయల దుర్గమ్మ ఆలయ ప్రాంగణాన్ని, రాజగోపురాన్ని రంగు రంగుల డిజిటల్ బల్బులతో అందంగా అలంకరించారు. రాత్రివేళ అమావాస్య చీకట్లో రంగు రంగుల కాంతులతో దుర్గమ్మతల్లి ఆలయం వింతశోభ సంతరించుకుంది. పిల్లల ఆనందం కోసం ఏర్పాటుచేసిన రంగుల రాట్నం, గ్లోబల్ బైక్ రేసింగ్, బ్రేక్ డాన్సింగ్ తదితర ఆట వస్తువులు ఆందరిని ఆకట్టుకున్నాయి.
జాతరను పురస్కరించుకొని ఏడుపాయల్లో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖల అధికారులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అటవీశాఖ వివిధ రకాల మొక్కలను ప్రదర్శనకు ఉం చారు. మంజీరా నది పొడవున ఏర్పాటు చేసిన షవర్‌బాత్‌ల కింద స్నానాలు చేసి భక్తులు పులకరించిపోయారు.
భారీ ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జాతర నిర్వహక ప్రతినిధి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్, డివిజన్ పంచాయతి, ఇరిగేషన్, వైద్యశాఖ, ఫైర్‌స్టేషన్, ఎక్సైజ్‌శాఖ, సమాచారశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. కాగా భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో భక్తులకు వాటర్‌ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.