పాపన్నపేట, న్యూస్‌లైన్: సింగూరు నుంచి నీరు విడుదల కావడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వరి నాట్లకోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రబీపంటల కోసం మంజీరా బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,340 క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదటి విడతగా 0.3 టీఎంసీల నీటిని 13.30 గంటలపాటు ఏకధాటిగా వదిలారు. మంగళవారం ఉదయానికి ఆ నీరు ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి ఆనకట్ట పొంగిపొర్లుతోంది.
మరోవైపు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల నుంచి నీటిని వదిలారు. దీంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. మరో 5 విడతలపాటు మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పరిధి కింద మొత్తం 21వేల ఎకరాలు సాగు భూమి ఉంది. సింగూరు నీటి విడుదలతో సుమారు 15వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది.
కాగా చివరి ఆయకట్టు కాలువలు శిథిలంకావడంతో ఆ ప్రాంతానికి నీరు చేరే అవకాశం లేదు. జైకా పనులు పూర్తయితే.. తమకు కూడా సాగు నీరు అందేందని చివరి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి జైకా పనులు సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఎంఎన్ కెనాల్‌కు సాగునీరు విడుదల
కొల్చారం: సింగూరు నీరు రావడంతో మండల పరిధిలోని మహబూబ్ నహర్(ఎంఎన్) కెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో చిన్నఘణాపూర్, పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్,రాం పూర్ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలతో ఘనపురం ఆనకట్టకు పెద్ద ఎత్తున వరదనీరు చేరుకోవడంతో ఆ నీటితోనే రైతులు పంటలు సాగుచేసుకున్నారు. అప్పట్లో సింగూర్ ప్రాజెక్ట్‌నుంచి చుక్కనీరు విడుదల కాలేదు.
కాగా రబీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో ప్రభుత్వ జీఓ ప్రకారం సాగునీరు విడుదల చేస్తున్నారు. మంగళవారంస్థానిక నాయకులు మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ రమేష్, ఏడుపాయల దేవస్థానం డెరైక్టర్‌లు యాదయ్య, సంగమేశ్వర్, ఎంఎన్ కెనాల్ చైర్మన్ నారాయణ, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డిలు ఘణాపురం ఆనకట్ట నుంచి ఎంఎన్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో వరినాట్లు ముమ్మరం కానున్నాయి.
సింగూరు బిరబిర ఘనపురం గలగల
Published Wed, Jan 22 2014 12:36 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement